
శ్రీనువైట్ల.. ‘ఢీ2’ ఎప్పుడు?: మంచు విష్ణు
హైదరాబాద్: చిత్ర పరిశ్రమలో కెరీర్‌ను ప్రారంభించిన ప్రతి కథానాయకుడికి ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం ఒకటి తప్పకుండా ఉంటుంది. మరీ ముఖ్యంగా అతని కెరీర్‌ను ఓ స్థాయికి తీసుకెళ్లిన సినిమా ఉంటుంది. మంచు విష్ణు కెరీర్‌లో అలాంటి చిత్రం ‘ఢీ’. జెనీలియా కథానాయిక. శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చి ఈ చిత్రం నేటి విడుదలైన 13ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ‘ఢీ2’ ఎప్పుడు చేద్దామంటూ ట్విటర్ వేదికగా శ్రీనువైట్లను మంచు విష్ణు అడిగారు.
కల్ట్ యాక్షన్ కామెడీ: మంచు విష్ణు
‘ఢీ’ విడుదలై 13ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంచు విష్ణు ట్విటర్ వేదికగా స్పందించారు. ‘‘13, ఏప్రిల్ 2007న నవ్వీ.. నవ్వీ కన్నీళ్లొచ్చాయి. మా నాన్న సహకారం లేకుంటే ఈ సినిమా విడుదలై ఉండేది కాదు. మొదటగా ఆయనకు కృతజ్ఞతలు. ఏం సినిమా అండీ, కల్ట్ యాక్షన్ కామెడీ. శ్రీనువైట్ల.. మై బిగ్ బ్రదర్ ‘ఢీ2’ ఎప్పుడు’’ అని ట్వీట్ చేశారు. మంచు విష్ణు ట్వీట్‌కు జెనీలియా స్పందిస్తూ, ‘నేను అక్కడ ఉన్నట్లు నీకు గుర్తుందా?’ అని ట్వీట్ చేయగా, దానికి విష్ణు ‘నువ్వు ఫొటో చూశావా? నువ్వు చాలా అందంగా టింకర్ బెల్‌లా ఎప్పటికీ గుర్తుండిపోతావు. అప్పటికీ.. ఇప్పటికీ’’ అని సమాధానం ఇచ్చారు.
నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం: శ్రీనువైట్ల
తాజాగా ఈ సినిమా 13ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీనువైట్ల స్పందించారు. తనకు ఈ చిత్రం ఎంతో ప్రత్యేకమని ట్విటర్ వేదికగా తెలిపారు. ఆనాటి సెట్‌లోని ఓ ఫొటోను పంచుకున్నారు. రోజూ ఎంతో ఛాలెంజింగ్ తెరకెక్కించాల్సిన సన్నివేశాలను అందరి సహకారంతో చాలా సులభంగా చిత్రీకరించినట్లు తెలిపారు. విష్ణు, జెనీలియా, బ్రహ్మానందం, సునీల్‌లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు, చిత్రంలో కీలక భూమిక పోషించిన దివంగత నటుడు శ్రీహరిని గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా కోన వెంకట్, గోపీ మోహన్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
క్లీన్ కామెడీ..
దర్శకుడు శ్రీనువైట్ల ఈ సినిమాను క్లీన్ కామెడీతో తెరకెక్కించాడు. ముఖ్యంగా బ్రహ్మానందం, విష్ణు, సునీల్, జయప్రకాష్‌రెడ్డిల మధ్య వచ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. అసభ్య పదజాలం, డబుల్ మీనింగ్ డైలాగులు లేకుండా ఇంటిల్లిపాదీ ఆస్వాదించేలా సన్నివేశాలు ఉంటాయి. కామెడీ తరహా సినిమాల్లో ఈ చిత్రం ఓ ట్రెండ్ సెట్ చేసింది. ఈ సినిమాకు కోన వెంకట్, గోపీ మోహన్ కథ అందించారు. కోన వెంకట్ సంభాషణలు సినిమాకే ప్రధానంగా నిలిచాయి. చక్రి అందించిన సంగీతం శ్రోతల్ని బాగా అలరించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.