నేను నటుడ్నే.. నిజ జీవితంలో నటించలేకపోయా!

ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణికి అంకితం ఇస్తూ నటి పూనమ్‌ కౌర్‌ కవిత రాశారు. ఆయన రాసే మాటలకు, తెరపై నటనకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఇప్పుడు ఆయన గురించి పూనమ్ కౌర్ కవిత రాశారు. తనికెళ్ల జీవితంలోకి పూనమ్ పరకాయ ప్రవేశం చేసినట్టు, ఆయన.....

Published : 15 Apr 2020 22:21 IST

తనికెళ్ల భరణిపై గౌరవంతో పూనమ్ కౌర్ కవిత

హైదరాబాద్‌: ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణికి అంకితం ఇస్తూ నటి పూనమ్‌ కౌర్‌ కవిత రాశారు. ఆయన రాసే మాటలకు, తెరపై నటనకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఇప్పుడు ఆయన గురించి పూనమ్ కౌర్ కవిత రాశారు. తనికెళ్ల జీవితంలోకి పూనమ్ పరకాయ ప్రవేశం చేసినట్టు, ఆయన ఆత్మ ఆమెను ఆవహించినట్టు ఆ కవితను రాశారు. ఈ సందర్భంగా పూనమ్ మాట్లాడుతూ.. ‘భరణి సర్‌కి గురు గోబింద్ సింగ్ జీ అంటే ఎంతో గౌరవం. బైసాఖి (పండగ) సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ వీడియో ఛాట్ నిర్వహించాను. నా తరఫున ఆయనకు ఈ కవిత వినిపించా. ఆయన గురించి ఆయన మాట్లాడుతున్నట్టు నేను రాసిన కవిత ఇది’ అని చెప్పారు..   

‘ఔను... నేను నటుడినే.
కానీ, నిజ జీవితంలో నటించలేకపోయాను.
ఔను... నేను ఒక కళాకారుడినే. 
కానీ, కళామతల్లి మీద ప్రేమ, అభిమానంతో,
కళ విలువ తెలియకుండా 
నా దగ్గరకి వచ్చే 
ప్రతి మనిషికి నేను 
నా కళని అమ్ముకోలేకపోయాను. 
సాహిత్యం పట్ల ప్రేమతో, 
మన భారత దేశంలో ఉన్న 
సంస్కృతిని మరింతగా వికసింపచేయాలని 
ఒక చిన్న ఆశ. 
ఆ భావంతో, మనసు నిండా అదే ఆలోచనతో 
నేను నా ప్రతి నాటకం రాశా. 
డబ్బు గురించి మాట్లాడితే 
అవసరాలు కొన్ని, ఆశయాలు కొన్ని తీర్చుకున్నాను. 
అమ్మ శ్రీ మహాలక్ష్మి ప్రేమతో,
కరుణతో, మర్యాదతో వచ్చినప్పుడు 
శిరసు వంచి అందుకున్నాను. 
నా దగ్గరకి వచ్చిన మనిషి 
అహంభావం చూపించినా, 
నేను ప్రేమతోనే చూశాను.
కానీ, నాలో ఉన్న కళా దైవాన్ని మాత్రం 
ఏరోజూ అహంతో పంచుకోలేకపోయాను.
వెనకడుగు వేసే ప్రతి నిమిషం 
కుటుంబ అవసరాలు గుర్తుకు వచ్చేవి.
కానీ నా స్వార్థం కోసం 
నేను అత్యంత గౌరవం ఇచ్చే 
కళామతల్లిని నేను అమ్ముకోలేకపోయాను.
పూజ చేశాక, మా ఆవిడ నా నుదిటిన పెట్టిన బొట్టుతో
నా పాదం బాధ్యతతో బయటకు కదిలేది. 
నాకు తోడుగా ఎప్పటికీ ఉంటాను, 
అని మా ఆవిడ అంటే, 
నీ సహాయం లేకుండా 
ఈ జీవితం ఎలా గడిపేది అంటాను నేను.
పిల్లలందరిని నేను కోరుకునేది ఒకటే.
అమ్మ అనే బంధానికి ప్రేమని పంచండి.
నాన్న అనే పదంతో స్నేహం పెంచుకోండి.
ఇంతకంటే ఎక్కువ ఏమీ ఆశల్లేని
నేను... మీ తనికెళ్ళ భరణి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని