
ఆ రెండు సినిమాలు చూడకండి: గౌతమ్ మీనన్
చెన్నై: తాను దర్శకత్వం వహించిన రెండు చిత్రాలను ప్రస్తుతం ఎవరూ వీక్షించవద్దని దర్శకుడు గౌతమ్ మీనన్ అన్నారు. కరోనాకట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా వచ్చే నెల మూడో తేదీ వరకూ లాక్‌డౌన్ విధించారు. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ప్రజలు పలు సినిమాలు, షోలు చూడడంతోపాటు కుటుంబసభ్యులతో కాలక్షేపం చేస్తున్నారు. ఇదిలా ఉండగా కరోనా నియంత్రణపై అవగాహన కల్పిస్తూ ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు సైతం పలు వీడియోలను రూపొందించి సోషల్‌మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ కరోనావైరస్ నియంత్రణ గురించి అవగాహన కల్పిస్తూ ఓ ప్రత్యేక వీడియోను రూపొందించి అభిమానులతో పంచుకున్నారు.
తాను దర్శకత్వం వహించిన ‘ఎంతవాడు గాని..’, ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రాలను ప్రస్తుతం ఎవరూ వీక్షించవద్దని ఆయన కోరారు. ‘ఎంతవాడు గాని..’ చిత్రంలో అజిత్ తన కుమార్తెతో కలిసి దేశవ్యాప్తంగా ఉన్న ప్రదేశాలకు టూర్‌కు వెళ్తాడు. అలాగే ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంలో నాగచైతన్య తన ప్రేయసితో కలిసి బైక్‌పై వివిధ ప్రాంతాలకు లాంగ్ టూర్‌కు వెళ్తాడు. దీంతో ఇప్పుడు ఆ రెండు సినిమాలను ఎవరైనా చూస్తే బయటకు వెళ్లాలనే ఆలోచన భావన కలుగుతుందని.. ఈ పరిస్థితుల్లో అది అంత సురక్షితం కాదని.. కాబట్టి ఎవరూ ఆ రెండు సినిమాలను చూడవద్దని ఆయన సూచించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.