వెయ్యి మందికి రజనీ సాయం.. 

ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆర్టిస్టులకు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తనవంతు సాయం ప్రకటించారు. రోజురోజూకీ విజృంభిస్తోన్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు గత కొన్నిరోజుల నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే....

Published : 23 Apr 2020 14:33 IST

నిత్యావసరాలు అందించనున్న సూపర్‌స్టార్‌

చెన్నై: ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆర్టిస్టులకు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తనవంతు సాయం ప్రకటించారు. రోజురోజూకీ విజృంభిస్తోన్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు గత కొన్నిరోజుల నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ కారణంగా గత నెల నుంచి షూటింగ్స్‌ నిలిచిపోవడంతో ఎంతోమంది ఆర్టిస్ట్‌లు కుటుంబపోషణ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పలువురు సెలబ్రిటీలు ఇండస్ట్రీలో పనిచేస్తున్న రోజువారీ కార్మికులతోపాటు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇతర ఆర్టిస్ట్‌లకు తమవంతు సాయాన్ని ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఫిల్మ్‌ ఎంప్లాయిస్‌ ఫేడరేషన్ ఆఫ్‌ సౌత్‌ ఇండియాకు రూ.50 లక్షలను విరాళంగా అందించిన సూపర్‌స్టార్‌ తాజాగా వెయ్యి మంది ఆర్టిస్ట్‌లకు సాయం చేయనున్నారు. ఈ మేరకు రజనీ నడిగర్‌ సంఘంలో సభ్యులుగా ఉన్న 1000 మంది ఆర్టిస్ట్‌లకు నిత్యావసరాలను అందించనున్నారు.

మరో 25 వేల మందికి సోను భోజనం

లాక్‌డౌన్‌ కారణంగా సరైన ఆహారం దొరక్క ఇబ్బందులు పడుతున్న ముంబయిలోని పేదవారికి నటుడు సోనుసూద్‌ గతకొన్నిరోజులుగా ఆహారం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన ‘శక్తి అన్నదానం’ పేరిట ముంబయిలోని వివిధ ప్రాంతాల్లో ప్రతిరోజూ 45000 మందికి ఆహారాన్ని అందిస్తున్నారు. తాజాగా ఆయన మరో 25000 మందికి ఆహారాన్ని అందించనున్నట్లు పేర్కొన్నారు. కర్ణాటక, ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌, పశ్చిమ బంగా ప్రాంతాలకు చెందిన వలస కార్మికులు రాజస్థాన్‌లో చిక్కుకుపోయారు. ప్రస్తుతం వారికి ఆహారం కూడా సరిగ్గా అందడం లేదనే విషయాన్ని తెలుసుకున్న సోనుసూద్‌ అక్కడి అధికారులతో మాట్లాడి.. కార్మికుల కోసం ప్రత్యేకంగా వంటగదులను ఏర్పాటు చేయించి మంచి భోజనాన్ని అందించనున్నారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. ‘రంజాన్‌ మాసం సందర్భంగా వారికి ఎలాంటి ఆహారం అవసరమైతే అలాంటి ఆహారాన్ని అందిస్తానని వాళ్లకి మాటిచ్చాను. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ వేరొకరికి సాయం చేయడం ఎంతో అవసరం. రంజాన్‌ మాసం సందర్భంగా ఉపవాసం ఉంటున్న వారందరికీ ప్రత్యేకమైన ఆహారాన్ని అందించనున్నాం.’ అని సోను పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని