ఆ చిన్న ప్రమాదం అజిత్‌-షాలినీని కలిపింది!

అజిల్‌, షాలినీ.. ఒకరి కోసం మరొకరు పుట్టారనే మాట వీరిద్దరికీ అక్షరాలా సరిపోతుంది. తమిళ చిత్ర పరిశ్రమలో అందరికీ ఆదర్శంగా నిలిచిన దంపతులు. వీరిది తొలిచూపులోనే పుట్టిన ప్రేమ కాదు. సినిమా సెట్‌లో జరిగిన ఓ చిన్న ప్రమాదం ఇద్దరూ ఒక్కటి కావడానికి కారణమైంది....

Updated : 06 Dec 2022 13:41 IST

పెళ్లిరోజు సందర్భంగా బ్యూటిఫుల్‌ లవ్‌స్టోరీ

అజిత్‌‌, షాలినీ.. ఒకరి కోసం మరొకరు పుట్టారనే మాట వీరిద్దరికీ అక్షరాలా సరిపోతుంది. తమిళ చిత్ర పరిశ్రమలో అందరికీ ఆదర్శంగా నిలిచిన దంపతులు. వీరిది తొలిచూపులోనే పుట్టిన ప్రేమ కాదు. సినిమా సెట్‌లో జరిగిన ఓ చిన్న ప్రమాదం ఇద్దరూ ఒక్కటి కావడానికి కారణమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ వీరు జీవితాన్ని పంచుకుని ఎంతో ఆనందంగా ముందుకు సాగుతున్నారు. ఇద్దరి ప్రేమకు నిదర్శనంగా అనౌష్క, ఆడ్విక్‌ కుమార్‌ జన్మించారు. శుక్రవారం అజిత్‌-షాలినీల పెళ్లి రోజు. వీరిద్దరూ 20 ఏళ్ల వైవాహిక జీవితాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులు పెళ్లి రోజు శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. HappyWeddingDayAjithShalini అనే హ్యాష్‌ట్యా‌గ్‌ ట్రెండింగ్‌లో ఉంది. ఈ సందర్భంగా అజిత్‌, షాలినీ ప్రేమ కథ ఎలా మొదలైందో చూద్దాం..

అప్పుడే కలిశారు..

అజిత్‌, షాలినీ కలిసి నటించిన తొలి సినిమా ‘అమర్‌కాలం’. శరణ్‌ దర్శకుడు. 1999 ఆగస్టు 13న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో అజిత్‌ కోపిష్ఠిగా కనిపించారు. థియేటర్‌లో ఉంటూ.. మద్యం సేవిస్తూ, గొడవలకు వెళ్తూ కాలం గడుపుతుంటారు. ఓ సినిమా రీల్‌ విషయంలో అతడికి, పోలీసు అధికారి కుమార్తె షాలినీకి మధ్య వివాదం ఏర్పడుతుంది. అలా మొదలైన వారి పరిచయంతో ఆపై ఇద్దరు ప్రేమలోపడతారు. ఈ కథాంశంతో రూపొందిన ‘అమర్‌కాలం’ సినిమాలోని యాక్షన్‌ సన్నివేశంలో షాలినీని అజిత్‌ కత్తితో బెదిరించాలి. కానీ షూట్‌లో అజిత్‌ ప్రమాదవశాత్తు ఆమె చేతికి నిజంగానే గాయం చేశారు. తనవల్ల షాలినీ గాయపడిందనే బాధతో ఆమె సెట్‌లో ఉన్నంత వరకు జాగ్రత్తగా చూసుకున్నారు. ఆ సమయంలో షాలినీకి అజిత్‌ వ్యక్తిత్వం ఏంటో తెలిసి, ఇష్టపడ్డారట. అలా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది.

అజిత్‌ నుంచి ఫోన్‌..

షాలినీ అప్పటికే బాలనటిగా అనేక సినిమాల్లో నటించారు. కథానాయికగానూ పలు మలయాళ, తమిళ సినిమాలు చేశారు. కానీ ‘అమర్‌కాలం’ సినిమా ఆఫర్ వచ్చినప్పుడు ఆమె కాలేజీలో చదువుతున్నారు. పరీక్షల కారణంగా మొదట ఆఫర్‌ను తిరస్కరించారట. శరణ్‌ ఆమెను కలిసినప్పుడు షాలినీ నటించలేనని అన్నారు. కానీ ఆమెనే కథానాయికగా తీసుకోవాలని దర్శకుడు గట్టిగా అనుకున్నారు. దీంతో అజిత్‌ ఓరోజు షాలినీకి ఫోన్‌ చేసి, నిర్ణయం అడిగారు. పరీక్షలు ఉన్నాయని చెప్పడంతో.. అవి పూర్తయిన తర్వాతే షూటింగ్‌ చేద్దామని అజిత్‌ చెప్పారు. అలా షాలినీ పరీక్షలు పూర్తయిన తర్వాత సినిమా షూట్‌ను ఆరంభించారు. ఆ సమయంలో అజిత్‌ నటించిన ‘కాదల్‌ మన్నన్’ (1998) ప్రీమియర్‌ షోకు షాలినీ హాజరయ్యారు.

షాలినీకి కోపం వచ్చింది..

2010లో ఇచ్చిన ఇంటర్వ్యూలో షాలినీ ‘కాదల్‌ మన్నన్’ (1998) ప్రీమియర్‌ షోలో పాల్గొనడం గురించి ముచ్చటించారు. ఆ సమయంలో అజిత్‌ తన జుట్టుపై కామెంట్‌ చేశారని, కోపం తెప్పించారని చెప్పారు. ‘నా జుట్టును రింగురింగులుగా చేసుకుని షోకు వెళ్లా. అజిత్‌ నాకు షేక్‌హ్యాండ్‌ ఇస్తూ.. రింగుల జుట్టు మీకు నప్పలేదు అన్నాడు. నాకు చాలా కోపం వచ్చింది. వెంటనే నా ముఖం చూసి.. ‘తప్పుగా అర్థం చేసుకోకండి. ‘కాదలుక్కు మరియాధై’ (విజయ్‌తో కలిసి నటించిన సినిమా)లో మీరు జుట్టు స్వేచ్ఛగా చాలా బాగుంటుంది’ అన్నారు. అజిత్‌ అలా నిజాయితీగా మాట్లాడటం నాకెంతో నచ్చింది’ అని ఆమె అప్పట్లో అన్నారు.

నదికి సముద్రం దొరికింది..

‘అమర్‌కాలం’ సినిమా విడుదల తర్వాత అజిత్‌-షాలినీ లవ్‌ ప్రపోజ్‌ చేసుకున్నారు. 1999లో ఓ తమిళ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అజిత్‌ తనకు, షాలినీకి మధ్య ఉన్న బంధం గురించి ముచ్చటించారు. ‘నేను నదిలాంటివాడిని. నా జీవితం అనేక మలుపులు తిరిగింది. ఈ ప్రయాణంలో ఎన్నో రాళ్లను ఢీ కొట్టా. నేను ఎన్నో బాధ్యతల్ని నా భుజాలపై మోశా. ఇప్పుడు నాకు సముద్రం దొరికింది. ఈ సముద్రం నన్ను ప్రశాంతంగా ఉంచుతుందని ఆశిస్తున్నా. నా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని విశ్వసిస్తున్నా’ అని చెప్పారు.

ప్రేమ తర్వాత..

2000లో అజిత్‌-షాలినీ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత షాలినీ సినిమాలకు, నటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ‘నాకు నటనంటే ఇష్టం. కానీ అజిత్‌ అంటే ఇంకా ఎక్కువ ఇష్టం. ఇటు నటిస్తూనే.. అటు ఇంటి బాధ్యతల్ని చూసుకునే వ్యక్తిని నేను కాదు. జీవితంలో మొదటి ప్రాధాన్యం దేనికనే విషయంలో నాకు చాలా స్పష్టత ఉంది’ అని 2009లో షాలినీ ఓ మ్యాగజైన్‌తో అన్నారు. ఇన్నేళ్లు గడుస్తున్నప్పటికీ అజిత్‌-షాలినీ ప్రేమలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని