నా దృష్టిలో వాళ్లు దేవుళ్లు: శేఖర్‌ కమ్ముల

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రజాశ్రేయస్సు కోసం బాధ్యతలు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు తన వంతు సాయం చేయడానికి  టాలీవుడ్‌ దర్శకుడు శేఖర్‌ కమ్ముల ముందుకొచ్చారు. వారికి కృతజ్ఞతలు చెబుతూ.. ఒక నెల రోజుల పాటు నార్త్ జోన్ పరిధిలో.....

Published : 27 Apr 2020 20:21 IST

పారిశుద్ధ్య కార్మికుల కోసం దర్శకుడు ఏం చేశారంటే?

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ విజృంభిస్తున్న ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రజాశ్రేయస్సు కోసం బాధ్యతలు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు తన వంతు సాయం చేయడానికి  టాలీవుడ్‌ దర్శకుడు శేఖర్‌ కమ్ముల ముందుకొచ్చారు. వారికి కృతజ్ఞతలు చెబుతూ.. ఒక నెల రోజుల పాటు నార్త్ జోన్ పరిధిలో పనిచేస్తున్న వెయ్యిమంది సిబ్బందికి పాలు, మజ్జిగ అందించబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆయన సోమవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్‌ఎమ్‌సీ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ పంపిణీ కార్యక్రమాన్ని జీహెచ్‌ఎమ్‌సీనే నిర్వహించబోతోంది.

ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ‘పారిశుద్ధ్య కార్మికులు సమాజానికి చేస్తున్న సేవలు అమోఘం. వారి ఆరోగ్యం గురించి ఆలోచించి దర్శకుడు శేఖర్ కమ్ముల తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నా. ఈ రోజు కరోనా నివారణకు స్వీయ నియంత్రణ తప్ప మరో మందు లేదు. ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు మేరకు చాలా మంది ఇళ్ల నుంచి బయటికి రావడం లేదు. కానీ కొంతమందిలో ఇంకా మార్పు రావాలి. బయటకు అనవసరంగా వచ్చి వ్యాధి వ్యాప్తికి కారణం అవుతున్నారు. అలాంటి వారు ఇకనైనా జాగ్రత్తగా ఉండాలి. కార్మికుల గురించి ఆలోచించిన శేఖర్ కమ్ములకు నా ధన్యవాదాలు’ అన్నారు.

అనంతరం శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ‘నేను మా ప్రాంతంలో ప్రతి రోజూ పారిశుద్ధ్య కార్మికుల్ని చూస్తున్నా. మన కోసం ఎండలోనూ కష్టపడుతున్న వారికి ధన్యవాదాలు చెప్పాలనే ఆలోచనతో అమిగోస్ సంస్థ నుంచి వెయ్యి మందికి నెల రోజుల పాటు పాలు, మజ్జిగ అందివ్వాలని నిర్ణయించుకున్నా. వాటిని మేం పంచడం కంటే.. సిబ్బంది ద్వారానే అందించగలిగితే కార్మికులకు గౌరవం ఇచ్చిన వారమవుతాం. అందుకే పంపిణీని జీహెచ్ఎమ్‌సీకే అప్పగించా. ఈ కార్యక్రమంతో మరికొంత మంది వారికి సహాయంగా నిలుస్తారని ఆశిస్తున్నా. పారిశుద్ధ్య కార్మికులంటే.. నా దృష్టిలో దేవుళ్లతో సమానం. ఇది మనిషికి, మనిషి తోడుండాల్సిన  సమయం.ఇది తప్ప వేరే దారిలేదు’’ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని