Updated : 05/05/2020 14:16 IST

షూటింగ్స్.. ఒక్క నెల ఓపిక పట్టండి: తలసాని

మనవాళ్లకు ఆ ఇబ్బందులు తాత్కాలికమే

హైదరాబాద్‌: ‘‘లాక్‌డౌన్‌ వల్ల సినీ పరిశ్రమ కూడా చాలా ఇబ్బందులు పడుతోంది. దీని కోసం ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే చర్చించాం’’ అని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ అన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో తెలంగాణలో సినిమా పరిశ్రమ గురించి ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘కరోనా వైరస్‌ ప్రపంచాన్ని కుదిపేస్తున్న తరుణంలో.. ఒక ప్రాంతం.. నగరం అని కాకుండా యావత్‌ ప్రపంచం ఇబ్బంది పడుతోంది. హైదరాబాద్‌కు ఆయువు పట్టులాంటి ఫిల్మ్‌ ఇండస్ట్రీ కూడా ఇబ్బంది పడుతోంది. చిత్ర పరిశ్రమలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమంది బతుకుతున్నారు. థియేటర్‌లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు. స్టూడియోల్లో పనిచేసేవారు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ రోజు జరిగే కేబినెట్‌ సమావేశంలో దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటాం. ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రేషన్‌ కార్డులు ఉన్నవారందరికీ ప్రభుత్వం తరఫు నుంచి అందాల్సినవి అందాయి’’

‘‘చిత్ర పరిశ్రమ నుంచి కరోనా క్రైసిస్‌ ఛారిటీ(సీసీసీ) కమిటీ ఏర్పాటు చేయడం శుభపరిణామం. దీని ద్వారా 14వేల మందికి నిత్యావసరాలు అందించారు. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా చిత్ర పరిశ్రమ ముందుకు వచ్చి సహకరిస్తోంది.  చిత్ర పరిశ్రమను ఇంకా ఎలా అభివృద్ధి చేయాలన్న దానిపై చిరంజీవి, నాగార్జునలతో ఇప్పటికే మూడుసార్లు సమావేశం అయ్యాం. ప్రభుత్వం కూడా ఒక నూతన పాలసీని విడుదల చేయాలని అనుకుంది. సరిగ్గా ఇటువంటి సమయంలో కరోనా వచ్చింది. రాబోయే రోజుల్లో బెస్ట్‌ పాలసీని తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత ఏం చేయాలన్న దానిపై మరోసారి చర్చిస్తాం’’అని అన్నారు. అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నకుల మంత్రి సమాధానం ఇచ్చారు.

కరోనా వల్ల ఎక్కువగా నష్టపోయే వాటిల్లో చిత్ర పరిశ్రమ కూడా ఉంది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు?  ఎప్పటి నుంచి షూటింగ్స్‌ మొదలు పెట్టవచ్చు?

తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌: మీరన్నట్లు చాలా రంగాలపై ప్రభావం ఉంది. అందులో చిత్ర పరిశ్రమ కూడా ఒకటి. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత పరిస్థితులు చక్క బడటానికి కొంత సమయం కావాలి. ఈ పరిస్థితి అనుకోకుండా వచ్చింది. షూటింగ్స్‌ మళ్లీ మొదలు పెట్టే విషయంలో అందరితో చర్చించి, వారి సహకారం తీసుకుని ప్రభుత్వం పనిచేస్తుంది.

థియేటర్లలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?

తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌: లాక్‌డౌన్‌ అయిపోయిన తర్వాత ఇండస్ట్రీ పెద్దలతో ఒక సమావేశం నిర్వహిస్తాం. వాళ్ల సలహాలు, సూచనల ప్రకారం జరుగుతుంది. థియేటర్‌లలో భౌతిక దూరం సాధ్యమవుతుందా? అన్న విషయాన్ని కూడా చర్చిస్తాం.

లాక్‌డౌన్‌ వేళ నష్టపోయిన చిత్ర పరిశ్రమకు ఊరట కల్పించేందుకు పవర్‌టారిఫ్‌, ఇతర పన్నులను మారటోరియం కిందకు తెచ్చేందుకు ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటోందా?

తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌: పవర్‌ టారిఫ్‌పై ఇప్పటికే చర్చిస్తున్నాం. మారటోరియం విషయంలో చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన వినతులను పరిశీలించాల్సి ఉంది. ఎవరెవరు బ్యాంకు  లోన్‌లకు వెళ్లారో తెలియదు. ఆ వివరాలు కూడా తెప్పించుకుని బ్యాంకులతో మాట్లాడి, తదుపరి కార్యాచరణ అమలు చేస్తాం.

చిత్ర పరిశ్రమకు సంబంధించినంత వరకూ మీరు మాట్లాడబోయే తొలి సమస్య ఏది?

తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌: తెలుగు రాష్ట్రాల్లో చిత్ర పరిశ్రమకు హైదరాబాద్‌ మంచి వేదిక. ఇక్కడ దాదాపు 200 చిత్రాలు, 100 వరకూ టెలివిజన్‌ షోలు షూటింగ్స్‌ జరుగుతుంటాయి. పైగా ఇక్కడ సౌకర్యాలు కూడా  చాలా బాగుంటాయి. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా చిత్ర పరిశ్రమకు ఎలాంటి ఆటంకాలు లేవు. చాలా సజావుగా సాగుతోంది. చలన చిత్ర పరిశ్రమకు కుల,మత, ప్రాంత భేదాలు ఉండవు. అన్ని విభాగాలను ఒక దాని కిందకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇవన్నీ కరోనా రాకముందే చర్చించాం.

కరోనా కట్టడిలో తెలంగాణ ముందు వరుసలో ఉంది. ఇలాంటి సమయంలో షూటింగ్స్‌ ఎంత త్వరగా మొదలవుతాయని అనుకుంటున్నారు?

తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌: ఈ రోజు జరిగే కేబినెట్‌లో స్పష్టత వస్తుంది. నా అభిప్రాయం ప్రకారం ఈ నెలాఖరు వరకూ ఆగితే మంచిది. షూటింగ్స్‌కు అనుమతి ఇవ్వడం పెద్ద విషయమేమీ కాదు. అయితే, కరోనా ఏ రూపంలో వస్తుందో తెలియదు. ఇందులో భాగంగా షూటింగ్స్‌ చేయకపోవడం మంచిదన్న నిర్ణయం తీసుకున్నాం. దశల వారీగా కొన్నింటిని అమలు చేస్తున్నారు కాబట్టి, అందులో షూటింగ్స్‌ను కూడా భాగం చేసేదానిపై చర్చిస్తాం.

కేరళలో పోస్ట్‌ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. ఈ విషయంపై తమిళనాడు ప్రభుత్వాన్ని కూడా అక్కడి వాళ్లు అడిగారు. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా అనుమతి ఇస్తారా?

తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌: ఇప్పుడున్న పరిస్థితుల్లో తొందరపడటం మంచిది కాదు. ఈ నెలాఖరు వరకూ ఓపిక పడితే, జూన్‌ నుంచి షూటంగ్స్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌పై మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. నేను అనుమతి ఇస్తానని కూడా ఎక్కడా చెప్పలేదు. కేరళ, ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను కూడా పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం.

ఈ విషయంలో ఏపీ ప్రభుత్వంతో కూడా మాట్లాడతారా?

తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌: చిత్ర పరిశ్రమకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే విషయంలో తప్పకుండా ఏపీ ప్రభుత్వంతో మాట్లాడతాం. అందరం తెలుగువాళ్లమే కదా! సినిమా అక్కడా, ఇక్కడా ఉంది.

అతి తక్కువ మందితో షూటింగ్స్‌ చేయాలని నిర్మాతలు అనుకుంటున్నారు. చిత్ర పరిశ్రమను నమ్ముకొని ఉన్న చాలా మందికి అప్పుడు ఉపాధి కరవవుతుంది. అలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కొంటారు??

తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌: కొన్నిరోజుల వరకూ పరిమితంగా ఉంటుంది. ప్రపంచంలో చాలా మందికి ఉద్యోగాలు పోయాయి.  రానున్న రోజుల్లో ఇంకా పోతాయి. చిత్ర పరిశ్రమలో ఆ స్కోప్‌లేదు. భారత దేశంలో అత్యధిక సినిమాలు తెలుగు చిత్ర పరిశ్రమే తీస్తోంది. అయితే, మనవాళ్లకు ఆ ఇబ్బందులు తాత్కాలికమే.

కార్డు లేని వారికీ సాయం చేస్తాం: సి.కల్యాణ్‌

ఈ సందర్భంగా నిర్మాత సి. కల్యాణ్‌ మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమలో కార్డులున్న వారందరికీ సీసీసీ నుంచి సాయం అందిందని అన్నారు. ‘‘సీసీసీ ఏర్పాటులో చిరంజీవిగారు లీడ్‌ తీసుకోవడం వల్ల మంచి జరిగింది. అందరి నుంచి సహకారం అందింది. 14వేల కిట్స్‌ను డోర్‌ డెలివరీ చేశాం. అవి తీసుకున్నప్పుడు వాళ్ల సంతోషం మాటల్లో చెప్పలేం. అవన్నీ చూపిస్తే, బాగుండదని  చిరంజీవి చెప్పారు. ‘ఇది ఒక్క నెలతో పోదు. అవసరమైన రెండు మూడు నెలలు ఇద్దాం. వ్యక్తిగతంగా నేను కొంత ఖర్చు చేస్తాను. నా స్నేహితులను కూడా అడుగుతాను’ అని చిరంజీవి చెప్పారు.  డైలీ వర్కర్లు, జూనియర్‌ ఆర్టిస్ట్‌లు, కార్డులున్న వారందరికీ సాయం అందింది. ప్రస్తుతం కార్డులేని వారు చాలా మంది ఉన్నారు. కష్టపడి పనిచేసేది అలాంటి వాళ్లే ఎక్కువ. వారికి ఎలా సాయం చేయాలో చర్చిస్తున్నాం. వారికీ తప్పకుండా సాయం అందుతుంది.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని