అలా చూడు తులిప్‌ లోకం పిలుస్తోన్నది..

చుట్టూ అందమైన కొండలు.. ఆకాశంలో కమ్ముకున్న మేఘాలు.. కనుచూపుమేర రంగురంగుల తులిప్‌ అందాలు.. ఊహిస్తుంటే ఎంత అద్భుంతగా ఉందో కదా.. ప్రస్తుతం ఆసియాలోని అతి పెద్ద తులిప్‌ ఉద్యానవనం భూతల స్వర్గాన్ని తలపిస్తోంది. 80 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న శ్రీనగర్‌లోని.....

Updated : 11 May 2020 14:56 IST

వెండితెరపై భూతల స్వర్గం

చుట్టూ అందమైన పర్వతాలు.. ఆకాశంలో కమ్ముకున్న మేఘాలు.. కనుచూపుమేర రంగురంగుల తులిప్‌ అందాలు.. ఊహిస్తుంటే ఎంత అద్భుతంగా ఉందో కదా.. ప్రస్తుతం ఆసియాలోని అతి పెద్ద తులిప్‌ ఉద్యానవనం భూతల స్వర్గాన్ని తలపిస్తోంది. 80 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న శ్రీనగర్‌లోని ఇందిరా గాంధీ మెమోరియల్‌ తులిప్‌ గార్డెన్‌ రంగురంగుల పువ్వులతో కలకలలాడుతోంది. దాదాపు 13 లక్షల తులిప్‌ పువ్వులు విరబూశాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ ఉద్యానవనాన్ని చూడటానికి  సందర్శకులు రావడం లేదు.

తులిప్‌ అందాలను ఇప్పటికే అనేక చిత్రాల్లో వెండితెరపై ఆవిష్కరించారు. ప్రత్యేకంగా విదేశాలకు వెళ్లి షూట్‌ చేసిన గీతాలు కూడా ఉన్నాయి. పలు డ్యూయెట్‌లలో ఈ పూలు కనువిందు చేశాయి. అలా ప్రేక్షకుల హృదయాల్ని హత్తుకున్న కొన్ని‌ గీతాల్ని ఓసారి చూద్దాం..

‘కొత్త కొత్తగా ఉన్నది.. స్వర్గమిక్కడే అన్నది..’ అనే పల్లవికి సరైన అర్థం చూపించాలి అనుకున్నారేమో దర్శక, నిర్మాతలు. అందుకే మనసును పులకరింపజేసే తులిప్‌ అందాల మధ్య టబు, వెంకటేష్‌లను పెట్టి పాటను చిత్రీకరించారు. వీరిద్దరు జంటగా నటించిన సినిమా ‘కూలీ నెం.1’. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఇళయరాజా సంగీతం అందించారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మించిన చిత్రంలోని ఈ గీతం హైలైట్‌గా నిలిచింది.

కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్న స్టార్‌ విక్రమ్‌. ఆయన్ను తెలుగు వారికి దగ్గర చేసిన సినిమా ‘అపరిచితుడు’. శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సదా కథానాయికగా నటించారు. విక్రమ్‌ మూడు విభిన్నమైన పాత్రల్లో మెప్పించారు. సదా ప్రేమ కోసం పరితపిస్తూ.. ‘కుమారి నా ప్రేమ వెక్కి ముక్కి బక్క సిక్కెనె..’ అని సాగే గీతాన్ని తులిప్‌ పువ్వుల మధ్య చిత్రీకరించారు.

‘అలా చూడు ప్రేమ లోకం.. పిలుస్తోన్నది..’ అంటూ వెంకటేష్‌, అంజలా జవేరీ పూల సోయగాల మధ్య డ్యుయెట్‌ వేసుకుంటారు. ‘ప్రేమించుకుందాం రా..’ సినిమాలోని గీతమిది. సి. జయంత్‌ దర్శకత్వం వహించారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన ఈ గీతం హిట్‌ అందుకుంది.

‘మృగరాజు’ చిరంజీవి, సిమ్రాన్‌ల వివాహం జరుగుతుంది. ఇద్దరూ కలిసి నూతన జీవితాన్ని ఆరంభిస్తారు. ఆ సమయంలో ‘శతమానమన్నదిలే.. చెలిమే.. చిన్న చిన్నారి ఆశలు గిల్లి..’ అంటూ పాట తెరపైకి వస్తుంది. ఈ గీతం అందర్నీ ఆకట్టుకుంది. ఇందులోని రంగురంగుల తులిప్‌లను చూపిస్తారు. గుణశేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దేవివర ప్రసాద్‌ నిర్మించారు. మణిశర్మ బాణీలు సమకూర్చారు.

బాలకృష్ణ, కత్రినా కైఫ్‌ ఆడిపాడిన గీతం ‘నేడే ఈనాడే..’. ఇందులో తులిప్‌ పువ్వులు కనువిందు చేస్తాయి. ‘అల్లరి పిడుగు’ సినిమాలోని గీతమిది. ఛార్మి మరో కథానాయిక. ఎమ్‌.ఆర్‌.వి ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమాకు మణిశర్మ బాణీలు అందించారు. ఈ సినిమాకు సి. జయంత్‌ దర్శకత్వం వహించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని