నా ఎనర్జీ.. నా ప్రాణం.. మీరే

అభిమానులు తనపై చూపించే ప్రేమ కంటే ఎక్కువగా తాను వాళ్లని ప్రేమిస్తున్నానని యువ హీరో రామ్‌ పోతినేని అన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన రామ్‌ తాజాగా ట్విటర్‌ ఖాతా వేదికగా అభిమానులను ఉద్దేశిస్తూ ఓ ట్వీట్‌ పెట్టారు...

Published : 13 May 2020 14:09 IST

అభిమానులకు హీరో విన్నపం

హైదరాబాద్‌: అభిమానులు తనపై చూపించే ప్రేమ కంటే ఎక్కువగా తాను వాళ్లని ప్రేమిస్తున్నానని యువ హీరో రామ్‌ అన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన ఆయన తాజాగా ట్విటర్‌ వేదికగా అభిమానులను ఉద్దేశిస్తూ ఓ ట్వీట్‌ పెట్టారు. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాలంటే భౌతిక దూరం తప్పకుండా పాటించాలని, కాబట్టి ఈ ఏడాది తన పుట్టినరోజు వేడుకలను జరపొద్దని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన అభిమానులకు ఓ విన్నపం చేశారు.

‘నా ప్రియమైన అభిమానులకు.. మీరు నాపై చూపించే ప్రేమ, అభిమానానికి నా మనసులో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఏటా మే 15న నా పుట్టినరోజుని మీరు జరిపే తీరు నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంటుంది. మీకు నాపై ఎంత ప్రేమ ఉందో, అంతకంటే ఎక్కువగా నేను మిమ్మల్ని ప్రేమిస్తుంటాను. మీ ఆరోగ్యం, మీ సంతోషమే నాకు ముఖ్యం. మీరే నా సంతోషం.. నా  ఎనర్జీ.. నా ప్రాణం.. అంతకు మించి నా బాధ్యత..! ప్రస్తుతం ఉన్న విపత్కర పరిస్థితుల రీత్యా ఈ సారి నా పుట్టినరోజు వేడుకలకి మీరంతా దూరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు సామాజిక దూరం అందరికీ శ్రేయస్కరం..! ఈ ఒక్కసారి మీరు పాటించే ఈ దూరమే.. నాకు ఇచ్చే అసలైన పుట్టినరోజు కానుకగా భావిస్తున్నాను..’ అని రామ్‌ పేర్కొన్నారు.

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ విజయం తర్వాత రామ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రెడ్‌’. కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి స్రవంతి రవికిషోర్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తమిళంలో మంచి విజయం సాధించిన ‘తడమ్‌’ చిత్రానికి రీమేక్‌గా ‘రెడ్‌’ తెరకెక్కుతుంది. నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌ కథానాయికలు. కరోనా పరిస్థితుల రీత్యా ఏప్రిల్‌ 9న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని ప్రస్తుతానికి వాయిదా వేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని