త్వరలో థియేటర్లు తెరుస్తారా?

లాక్‌డౌన్‌ కారణంగా సినిమా థియేటర్‌లన్నీ మూతబడిన సంగతి తెలిసందే. త్వరలో లాక్‌డౌన్‌ 4.0 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో థియేటర్లు,

Published : 16 May 2020 17:35 IST

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఏమన్నారంటే?

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కారణంగా సినిమా థియేటర్‌లన్నీ మూతబడిన సంగతి తెలిసందే. త్వరలో లాక్‌డౌన్‌ 4.0 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో థియేటర్లు, స్కూళ్లు, కాలేజ్‌లు మూసే ఉంచుతారని అధికార వర్గాల సమాచారం. కాగా, తెలంగాణ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ థియేటర్లు తెరిచే విషయమై ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.

‘‘ప్రస్తుతానికి వెంటనే సినిమా థియేటర్లు తెరిచే యోచన లేదు. అందుకు ఇంకా సమయం పడుతుంది. అది నెలా.. రెండు నెలలా అనేది చెప్పలేం. ఒక వేళ థియేటర్లు తెరిచినా, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపరు. కనీసం సీటింగ్‌లో మార్పులు కూడా చేయలేదు. అదే విధంగా షూటింగ్‌లు మొదలు పెట్టడానికి కూడా ఇంకాస్త వేచి చూడాలి. ఇప్పటికే సీరియల్స్‌ షూటింగ్‌లకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. కనీస సిబ్బంది లేకుండా ఏదీ సాధ్యం కాదు కదా? వారంతా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తారు. వారిలో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నాయో? లేదో? తెలియదు. అందుకే ఇంకొన్ని రోజులు వేచి చూడటం మంచిది’’ అని తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అభిప్రాయపడ్డారు.

ఇటీవల తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడున్న పరిస్థితుల్లో తొందరపడటం మంచిది కాదు. ఈ నెలాఖరు వరకూ ఓపిక పడితే, జూన్‌ నుంచి షూటింగ్స్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌పై మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. నేను అనుమతి ఇస్తానని కూడా ఎక్కడా చెప్పలేదు. కేరళ, ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను కూడా పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. లాక్‌డౌన్‌ అయిపోయిన తర్వాత ఇండస్ట్రీ పెద్దలతో ఒక సమావేశం నిర్వహిస్తాం. వాళ్ల సలహాలు, సూచనల ప్రకారం జరుగుతుంది. థియేటర్‌లలో భౌతిక దూరం సాధ్యమవుతుందా? అన్న విషయాన్ని కూడా చర్చిస్తాం’’ అని పేర్కొన్నారు. తెలంగాణలో లాక్‌డౌన్‌ మే 28వ తేదీ వరకూ పొడిగించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని