అనిల్‌ సర్.. ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌: ఆకాశ్‌ పూరీ

సెన్సేషనల్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరీ ఒక్క ఛాన్స్‌ ప్లీజ్ అని అంటున్నారు. బాలనటుడిగా పలు సినిమాల్లో మెప్పించిన ఆకాశ్‌ తాజాగా తన స్నేహితుడు....

Updated : 18 May 2020 12:50 IST

నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న వీడియో..!

హైదరాబాద్‌: సెన్సేషనల్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరీ ఒక్క ఛాన్స్‌ ప్లీజ్ అని అంటున్నారు. బాలనటుడిగా పలు సినిమాల్లో మెప్పించిన ఆకాశ్‌ తాజాగా తన స్నేహితుడు, నటుడు రాహుల్‌ విజయ్‌తో కలిసి ప్రత్యేకంగా ఓ వీడియోను రూపొందించారు. పూరీ దర్శకత్వం వహించిన ‘బుజ్జిగాడు’, ‘బద్రి’, ‘శివమణి’, ‘పోకిరి’, ‘దేశముదురు’, ‘టెంపర్’‌, ‘ఇస్మార్ట్‌ శంకర్’‌, ‘పైసా వసూల్‌’.. ఇలా పలు చిత్రాల్లోని మాస్‌ డైలాగ్‌లకు వీరిద్దరూ యాక్ట్‌ చేసి అలరించారు. వీడియో చివర్ల్లో ‘ఖడ్గం’ సినిమాలోని ‘ఒక్క ఛాన్స్‌ అండి.. ఒకే ఒక్క ఛాన్స్‌’ డైలాగ్‌తో మెప్పించారు. సదరు వీడియోను ట్విటర్‌ వేదికగా షేర్‌ చేసిన ఆకాశ్‌.. ‘మాకు సినిమా అంటే ప్రేమ. పూరీ జగన్నాథ్‌ అంటే ఇంకా చాలా ఇష్టం.’ అని పేర్కొన్నారు.

కాగా, ఆకాశ్‌ షేర్‌ చేసిన వీడియోకి సినీ ప్రియుల నుంచే కాకుండా పలువురు సినీ ప్రముఖుల నుంచి కూడా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ‘సూపర్బ్‌ అబ్బాయిలు.. ఇద్దరూ చించేశారు’ అని అనిల్‌ రావిపూడి రిప్లై ఇవ్వగా ఆకాశ్‌ స్పందించారు. ‘థ్యాంక్యూ సో మచ్‌ సర్‌.!! కానీ ఒక్క ఛాన్స్‌ సర్‌ (నవ్వుతున్న ఎమోజీ) ప్లీజ్‌ గుర్తుపెట్టుకోండి’ అని ఆకాశ్‌ అన్నారు. మరోవైపు పూరీ సైతం తన తనయుడి నటన చూసి మురిసిపోయారు. ‘సూపర్‌.. లవ్‌ యూ’ అని కామెంట్ చేశారు.

‘మెహబూబా’ చిత్రంతో ఆకాశ్‌ పూరీ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ ఫలితాలు అందుకుంది. ప్రస్తుతం ఆకాశ్‌ ‘రొమాంటిక్‌’ చిత్రంలో నటిస్తున్నారు. అనిల్‌ పాడూరి దర్శకత్వం వహిస్తున్నారు. కేతికాశర్మ కథానాయిక.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని