ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ హరికిషన్ కన్నుమూత

టాలీవుడ్‌లో మరో విషాదం. ఈ రోజు ఉదయం వాణిశ్రీ కుమారుడు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ మిమిక్రీ కళాకారుడు, నటుడు...

Updated : 23 May 2020 19:22 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌లో మరో విషాదం. ఈ రోజు ఉదయం వాణిశ్రీ కుమారుడు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ మిమిక్రీ కళాకారుడు, నటుడు హరికిషన్‌ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. ఎనిమిదేళ్ల వయసులో మిమిక్రీ చేయడం మొదలు పెట్టిన హరికిషన్ జాతీయ, అంతర్జాతీయ వేదికలపై వేల ప్రదర్శనలు ఇచ్చారు. అగ్ర నటుడు ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, కృష్ణ నుంచి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌లతో పాటు ఎంతో మంది సినీ నటుల గొంతులను ఆయన అనుకరించేవారు. కేవలం సినిమాల్లో వారు చెప్పిన డైలాగ్‌లు అనుకరించడమే కాదు, కొన్ని చిన్న స్కిట్‌లను వారు చేస్తే ఎలా ఉంటుందో చేసి చూపించేవారు. అవన్నీ ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించేవి. సినీనటులు మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు చంద్రబాబు, వైఎస్‌ఆర్‌, కేసీఆర్‌, వీహెచ్‌ తదితర నేతలను హరికిషన్‌ అనుకరించి అలరించేవారు. పలు చిత్రాల్లోనూ చిన్న చిన్న పాత్రలు పోషించారు.

హరికిషన్‌ మే 30, 1963లో ఏలూరులో జన్మించారు. ఎనిమిదేళ్ల వయసులో పాఠశాలలోని తన గురువులు, స్నేహితుల గొంతులను అనుకరించి నవ్వులు పూయించేవారు. 1971 మే 12న తాను చదువుతున్న పాఠశాలలోనే తొలి ప్రదర్శన ఇచ్చారు. హరికిషన్‌ తండ్రి వీ.ఎల్.ఎన్‌. చార్యులు గాయకుడు, స్టేజ్‌ ఆర్టిస్ట్‌, మ్యూజిక్‌ కంపోజర్‌. తాను ఈ రంగంలో రావడానికి తన బంధువు అయిన చూడామణితో పాటు, ప్రముఖ మిమిక్రీ కళాకారుడు, పద్మశ్రీ డాక్టర్‌ నేరెళ్ల వేణుమాధవ్‌లు స్ఫూర్తి అని హరికిషన్‌ పలు సందర్భాల్లో చెప్పారు. హరి కిషన్‌ పూర్తిస్థాయి మిమిక్రీ కళాకారుడు కాకముందు హైదరాబాద్‌లోని ఆల్‌ సెయింట్‌ హైస్కూల్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ తర్వాత పూర్తిగా ప్రదర్శనలపైనే దృష్టి సారించారు.

1971 నుంచి ఇటీవల కాలం వరకూ ఆయన 10వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. గంటలో 100మంది వాయిస్‌లను అనుకరించి ‘శత కంఠ ధ్వన్యనుకరణ ధురీణ’ బిరుదును పొందారు. అంతేకాదు, ఒకేసారి రెండు వాయిస్‌లను అనుకరించడం.. దూరం నుంచి దగ్గరి నుంచి వచ్చే శబ్దాలు ఎలా ఉంటాయో ప్రదర్శించడం ఇలా ఎన్నో ప్రయోగాలు చేశారు. ఇక హాలీవుడ్‌ చిత్రాలు ‘జురాసిక్‌ పార్క్‌, అనకొండ, ఈవీల్‌డెడ్‌, మెకన్నాస్‌ గోల్డ్‌, మమ్మీ, మమ్మీ రిటర్న్స్‌ ఇలా పలు చిత్రాలను ఆయన తన గొంతుతో రీక్రియేట్‌ చేశారు.హరికిషన్‌ మృతి తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు. ఆయన మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని