‘ఏమాయ చేసావే’ సీక్వెల్‌ చేస్తా: గౌతమ్‌ మేనన్‌

త్రిష.. శింబు కాంబినేషన్‌లో తెరకెక్కిన ఫీల్‌గుడ్‌ ప్రేమకథా చిత్రం ‘విన్నైతాండి వరువాయ’. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘ఏమాయ చెసావే’ పేరుతో తెలుగులో రీమేక్‌ చేసిన విషయం తెలిసిందే. 2010లో విడుదలైన...

Published : 27 May 2020 22:05 IST

65 లక్షల మంది వీక్షించిన షార్ట్‌ఫిల్మ్‌

చెన్నై: త్రిష.. శింబు కాంబినేషన్‌లో తెరకెక్కిన ఫీల్‌గుడ్‌ ప్రేమకథా చిత్రం ‘విన్నైతాండి వరువాయ’. గౌతమ్‌ మేనన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘ఏమాయ చేసావే’ పేరుతో తెలుగులో రీమేక్‌ చేసిన విషయం తెలిసిందే. 2010లో విడుదలైన ఈ చిత్రానికి సీక్వెల్‌ తెరకెక్కితే చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల తాను సీక్వెల్‌ను తెరకెక్కించాలనుకుంటున్నట్లు గౌతమ్‌ ఇన్‌స్టా లైవ్‌లో వెల్లడించారు. ‘శింబు కనుక ఓకే అంటే ‘విన్నైతాండి వరువాయ’ సీక్వెల్‌ను తెరకెక్కిస్తాను. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి కథ రాస్తున్నా. నేను తప్పకుండా తెరకెక్కించాలనుకునే  సినిమా ఇది’ అని ఆయన చెప్పిన విషయం తెలిసిందే. తెలుగు రీమేక్‌లో నాగచైతన్య, సమంతా నటించారు.

కాగా, తాజాగా గౌతమ్‌.. ‘విన్నైతాండి వరువాయ’ సీక్వెల్‌ గురించి మరోసారి స్పందించారు. ఈవిషయంపై ఆయన మాట్లాడుతూ... ‘త్వరలోనే మా ప్రయాణం ప్రారంభం కానుంది. నిజం చెప్పాలంటే నాకెంతో సంతోషంగా ఉంది. ఓ హిట్‌ సినిమా సీక్వెల్‌ను తెరకెక్కించే సమయంలో ఫిల్మ్‌మేకర్‌ ఎన్నో ఇబ్బందులను, ఒత్తిడిని ఎదుర్కొవాల్సి ఉంటుందని నేను విశ్వసిస్తాను. సీక్వెల్‌ను రూపొందించాలనే ఆలోచన ఎప్పటినుంచో ఉంది. కానీ అనుకున్న కాన్సెప్ట్‌ను ప్రేక్షకులకు సరిగ్గా అందచేయడం కోసం ఇంకొంచెం ఒత్తిడికి గురి అవుతున్నా. ఎంత ఒత్తిడికి గురైనా సరే తప్పకుండా ఆ సీక్వెల్‌ను రూపొందిస్తాను.’ అని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా ఈ సీక్వెల్‌లో శింబు, అనుష్క శెట్టి నటించనున్నారంటూ ప్రచారం సాగుతోంది.

మరోవైపు లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇటీవల గౌతమ్‌ తెరకెక్కించిన ఓ షార్ట్‌ ఫిల్మ్‌కు అభిమానుల నుంచి విపరీతమైన రెస్పాన్స్‌ వస్తోంది. త్రిష, శింబు నటనను ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. ఇప్పటివరకూ ఈ షార్ట్‌ ఫిల్మ్‌ను 65 లక్షల మంది వీక్షించారు. 


 


 


 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు