ఇక అది నిర్మాత ఇష్టం: రకుల్‌ప్రీత్‌

సినిమాను థియేటర్‌లో విడుదల చేయాలా?.. ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో విడుదల చేయాలా? అన్నది నిర్మాత ఇష్టమని కథానాయిక రకుల్‌ప్రీత్‌ సింగ్‌ అభిప్రాయపడ్డారు. కరోనా వల్ల చిత్ర పరిశ్రమ చాలా నష్టపోయింది. అనేక సినిమాల విడుదల, షూటింగ్‌ వాయిదా పడింది. భౌతిక దూరం....

Published : 27 May 2020 20:10 IST

‘నా రెండు సినిమాలు చివరి దశలో ఉన్నాయి’

హైదరాబాద్‌: సినిమాను థియేటర్‌లో విడుదల చేయాలా?.. ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో విడుదల చేయాలా? అన్నది నిర్మాత ఇష్టమని కథానాయిక రకుల్‌ప్రీత్‌ సింగ్‌ అభిప్రాయపడ్డారు. కరోనా వల్ల చిత్ర పరిశ్రమ చాలా నష్టపోయింది. అనేక సినిమాల విడుదల, షూటింగ్‌ వాయిదా పడింది. భౌతిక దూరం దృష్టిలో ఉంచుకుని థియేటర్లను ఇంకా ఓపెన్‌ చేయలేదు. దేశవ్యాప్తంగా ఒకేసారి థియేటర్లను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అనేక సినిమాలు ఓటీటీ ఫ్లాట్‌ఫాం బాటపట్టాయి. అయితే ఈ నిర్ణయంపై ఇటీవల వివాదం కూడా మొదలైంది. తాజాగా ఈ విషయం గురించి రకుల్‌ స్పందించారు.

‘ఇంటి నుంచి ధైర్యంగా బయటికి వచ్చి ఎప్పుడు తిరుగుతామో తెలియదు. ప్రత్యేకించి ఓ సినిమా షూటింగ్‌ జరగాలంటే కనీసం 100 మంది అవసరం. షూటింగ్‌లకు అనుమతి లభిస్తుందని అందరూ ఆశిస్తున్నారు. భవిష్యత్తు ఏంటో, ఎలా ఉంటుందో తెలియదు. నా రెండు సినిమాలు (‘ఎటాక్‌’, అర్జున్‌ కపూర్‌ సరసన నటిస్తున్న మరో చిత్రం) దాదాపు పూర్తయ్యాయి. నేను దక్షిణాదిలో మరో సినిమా షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. ఒక్కొక్క సమస్య క్రమంగా పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నా. ఆయా ప్రదేశాల్లో నిబంధనల్ని తొలగించడాన్ని బట్టి నా డేట్స్‌ను సర్దుబాటు చేసుకోవాలి’.

‘సినిమా ఏ ఫ్లాట్‌ఫాంలో విడుదలైనా నాకు ఇబ్బంది లేదు. ‘సూర్యవంశీ’లాంటి పెద్ద సినిమాల్ని ప్రజలు థియేటర్‌లో చూడాలి అనుకుంటారు. ఇలాంటివి పెద్ద స్క్రీన్‌పై చూస్తేనే బాగుంటుందనేది నా అభిప్రాయం. కానీ ఈ విషయంలో తుది నిర్ణయం నిర్మాత తీసుకోవాలి. ఎందుకంటే ఆయనే బడ్జెట్‌ భరిస్తారు. ఓ సినిమాపై చాలా మొత్తం ఫ్లో అవుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ల ప్రోడక్ట్‌ను వీలైనంత త్వరగా విడుదల చేయాలి అనుకుంటారు. ఈ క్రమంలోనే డిజిటల్‌ ఫ్లాట్‌ఫాం వైపు మొగ్గుచూపుతున్నారు. ఓ సినిమాను థియేట్రికల్‌ లేదా డిజిటల్‌.. ఎందులో విడుదల చేయాలన్నది నిర్మాత ఇష్టం. పరిస్థితులు చక్కబడాలి, సినిమాలు తిరిగి థియేటర్‌కు రావాలి. కానీ నిర్మాతలకు డిజిటల్‌ సరైంది అనిపిస్తే.. వారి కంటే నిర్ణయాలు ఎవరు బాగా తీసుకోగలరు?’ అని ఆమె చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు