డిసెంబర్‌ కంటే ముందే రానా-మిహికాల పెళ్లి..!

నటుడు రానా దగ్గుబాటి త్వరలో తన ప్రియురాలు మిహికా బజాజ్‌ మెడలో మూడు ముళ్లు వేయనున్నారు. ఆగస్టు మొదటి వారంలో వీరి వివాహానికి సంబంధించిన ఓ వేడుకగా జరనుందని రానా తండ్రి సురేశ్‌బాబు...

Updated : 01 Jun 2020 13:53 IST

ఆగస్టు మొదటి వారంలో జరగనున్న వేడుక

హైదరాబాద్‌: నటుడు రానా దగ్గుబాటి త్వరలో తన ప్రియురాలు మిహికా బజాజ్‌ మెడలో మూడు ముళ్లు వేయనున్నారు. ఆగస్టు మొదటి వారంలో వివాహానికి సంబంధించిన  ఓ వేడుక జరగనుందని రానా తండ్రి సురేశ్‌బాబు తెలిపారు. రానా-మిహికాల పెళ్లిపై ఆయన తాజాగా మాట్లాడారు. ‘లాక్‌డౌన్‌ కారణంగా పెళ్లి పనులు పూర్తి చేసుకోవడానికి మాకెంతో సమయం దొరికింది. ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాం. డిసెంబర్‌ కంటే ముందే ‘రానా-మిహికా’ల వివాహం జరిగినా ఆశ్చర్యపోకండి. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న కరోనా వైరస్‌ అంతత్వరగా వదిలేలా కనిపించడం లేదు. కాబట్టి మేము ఆగస్టు 8న కుటుంబసభ్యుల సమక్షంలో వివాహానికి సంబంధించిన ఓ చిన్న ఫంక్షన్‌ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. సామాజికదూరం, ఇతర ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ శుభకార్యం జరగనుంది’ అని సురేశ్‌ బాబు తెలిపారు.

కాగా, మిహికా బజాజ్‌ తల్లి బంటీ బజాజ్‌ కూడా వీరి పెళ్లి విషయం గురించి స్పందించారు. ‘ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే మేము అన్ని పనులు చేయాలనుకుంటున్నాం. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం 80 నుంచి 100 మంది మాత్రమే హాజరు కావడానికి అవకాశం ఉంది. కానీ, ఆగస్టు వచ్చేసరికి పరిస్థితులు ఎలా మారతాయో తెలియదు. ప్రభుత్వ నిబంధనల్లో మార్పులు ఉండొచ్చు. విదేశాల్లో ఉన్న బంధువులు రావడానికి అనుగుణంగా అంతర్జాతీయ ప్రయాణాలు  ప్రారంభమవుతాయా?అన్న అంశంపై స్పష్టత లేదు. పెళ్లి తేదీ మినహాయించి ఇంకా ఏ విషయంలోనూ పూర్తి స్పష్టత రాలేదు. ప్రస్తుతం నేను డెకరేషన్‌ గురించి ఆలోచిస్తున్నా. వెడ్డింగ్‌ థీమ్‌ ప్లానింగ్‌లో ఉన్నాను. నా మైండ్‌లో చాలా ఆలోచనలున్నాయి. ఎందుకంటే మాకు అది ఎంతో ప్రత్యేకమైన రోజు’ అని ఆమె అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని