సెలబ్రిటీలకు ఈ ఇబ్బందులు తప్పవా?

సెలబ్రిటీ.. ఈ మాట వినడానికి చాలా వింపుగా ఉంటుంది. సమాజంలో హోదా.. గౌరవం.. అభిమానించే కోట్లాది ప్రేక్షకులు.. ఇంకేం కావాలి. ఈ ఆనందంలో అంతకుముందుపడ్డ శ్రమను కూడా మార్చిపోతుంటారు. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే.....

Updated : 04 Jun 2020 11:06 IST

ట్రోల్స్‌.. అందరూ చెప్పేవాళ్లే..!

సెలబ్రిటీ.. ఈ ఒక్క మాట చాలు సమాజంలో హోదా.. గౌరవం.. అభిమానించే కోట్లాది ప్రేక్షకులు.. ఇంకేం కావాలి. ఈ ఆనందంలో అంతకు ముందుపడ్డ శ్రమను కూడా మర్చిపోతుంటారు. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే, మరోవైపు అందరికీ కనపడదు. అవకాశం దొరికితే విమర్శించే వాళ్లూ.. అవసరం లేకపోయినా సలహాలు ఇచ్చేవారు ఎందరో. వారి అభిప్రాయాలకు సానుకూలంగా స్పందిస్తే సరే.. లేకపోతే చిన్నపాటి పోరాటమే చేయాల్సి వస్తుంది. సోషల్‌ మీడియా వినియోగం ఎక్కువైన తమ అభిమాన కథానాయకుడు/నాయికను ఎవరైనా చిన్న మాట అంటే చాలు అభిమానులు సహించలేకపోతున్నారు. వారిపై సామాజిక మాధ్యమాల వేదికగా దుమ్మెత్తిపోస్తూ, అసభ్య పదజాలంతో దూషిస్తూ ట్రోల్‌ చేయడం మొదలు పెడుతున్నారు. ఇటీవల కాలంలో కథానాయికలు వీటిని ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. దుస్తులు, పాత్రల ఎంపిక నుంచి.. శరీర బరువు వరకూ విమర్శలు తప్పడం లేదు. అలా నటీమణుల్ని ఇబ్బంది పెట్టిన విషయాలివి..

అభిమానిని కాదు అన్నందుకు..

‘చిత్ర పరిశ్రమలో మేమంతా స్నేహితుల’మని హీరోలంతా చెబుతున్నా వారి అభిమానుల తీరు మాత్రం మారడం లేదు. మా హీరో గొప్పంటే.. మా హీరో గొప్పంటూ సామాజిక మాధ్యమాల వేదికగా వాగ్వాదానికి దిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా కథానాయిక మీరా చోప్రా ట్విటర్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్‌ ‘ఎన్టీఆర్‌ గురించి చెప్పండి?’ అని అడిగారు. ‘నాకు ఆయన గురించి తెలియదు. నేను ఆయన అభిమానిని కాదు.. మహేశ్‌ బాబు అంటే ఎక్కువ ఇష్టం’ అని బదులిచ్చారు. దీంతో తారక్‌ అభిమానులుగా చెప్పుకుంటూ.. కొంతమంది ఆమెను అసభ్య పదజాలంతో ట్వీట్‌లు చేయడం మొదలు పెట్టారు. బెదిరింపులకు పాల్పడ్డారు. వీటిని భరించలేక మీరా చోప్రా సోషల్ ‌మీడియా వేదికగా సైబర్‌ పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.  తెలుగులో ‘బంగారం’, ‘వాన’, ‘గ్రీకు వీరుడు’ సినిమాల్లో మెరిశారు.

రకుల్‌ ఆ డ్రెస్‌ ఏంటి?

థానాయికలు డ్రెస్సింగ్‌కు, డైటింగ్‌, ఫ్యాషన్‌కు ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తుంటారు. అందంగా, విభిన్నంగా కనిపించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ విషయంలో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఇప్పటికే పలుమార్లు విమర్శలు ఎదుర్కొన్నారు. ఆమె పొట్టి దుస్తులు వేసుకున్నారని నెటిజన్లు అసభ్యంగా మాట్లాడారు. దీనికి రకుల్‌ స్పందిస్తూ.. ‘ఇలాంటి మనుషులు సమాజంలో ఉన్నంత వరకు మహిళలకు భద్రత ఉండదు. మహిళల సమానత్వం, రక్షణ గురించి మాట్లాడతారు కానీ.. పాటించరు’ అని ట్వీట్ చేశారు.

క్షమాపణ చెప్పాల్సిందే!

థానాయిక పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ఇటీవల హ్యాకింగ్‌కు గురైన సంగతి తెలిసిందే. ఆమె ఖాతా నుంచి హ్యాకర్‌ నటి సమంతపై అభ్యంతరకర వ్యాఖ్యలు పోస్ట్‌ చేశారు. పూజా స్పందించి ఇన్‌స్టా ఖాతాను పునరుద్ధరించే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సమంత గురించి పూజా ఇన్‌స్టాలో హ్యాకర్‌ పెట్టిన అభ్యంతర వ్యాఖ్యలు ఒక్కసారిగా వైరల్‌ అయ్యాయి. వాటిని చూసిన సమంత అభిమానులు ట్విటర్‌ వేదికగా ‘పూజా హెగ్డే క్షమాపణ చెప్పాలి’ అంటూ ట్రెండింగ్‌ చేయడం మొదలు పెట్టారు. 

అలాగేనా రిప్లై ఇచ్చేది?

‘గూఢచారి’ సినిమాతో ఆకట్టుకున్న కథానాయిక శోభితా ధూళిపాళ్ల. అడివి శేషు కథానాయకుడిగా నటించిన ఈ సినిమాను చూసిన మహేశ్‌బాబు కొన్నాళ్ల క్రితం చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశారు. దీనికి శోభితా రిప్లై ఇస్తూ.. ‘థాంక్యూ’ అన్నారు. ‘సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబుతో మాట్లాడే తీరు ఇదేనా..?, గౌరవిస్తూ మాట్లాడాలని తెలియదా..?, పొగరా..?’ అంటూ రకరకాలుగా మాట్లాడారు.

మీ అమ్మలా లేవేంటి?

లనాటి తార శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్‌ నటిగా రాణిస్తున్నారు. అచ్చం అమ్మలానే ఉందంటూ జాన్విని చూసి అభిమానులు ఆనందపడ్డారు. అయితే శ్రీదేవి రెండో కుమార్తె ఖుషి కపూర్‌.. జాన్వితో పోలిస్తే విభిన్నంగా ఉంటారు. ఈ నేపథ్యంలో తన రూపం అమ్మ శ్రీదేవిలా లేదని చాలా మంది విమర్శించారని ఇటీవల ఖుషి ఆవేదన చెందారు. 19 ఏళ్ల వయసులో ఇలాంటి ట్రోల్స్ తనను మానసికంగా బాధిస్తున్నాయని చెప్పారు. ‘నేనూ ఓ సాధారణ అమ్మాయినే’నని అభిప్రాయాల్ని పంచుకున్నారు.

పవన్‌ ఊసు ఎత్తితే...

టి, దర్శకురాలు రేణూ దేశాయ్‌ ట్విటర్‌లో విమర్శల్ని భరించలేక.. ప్రశాంతత కోసం అకౌంట్‌ను డిలీట్‌ చేశారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల్ని మాత్రమే వినియోగిస్తున్నారు. ఇటీవల ‘బద్రి’ సినిమా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రేణూ తన మాజీ భర్త పవన్‌ కల్యాణ్‌తో చిత్రం సెట్‌లో తీసుకున్న ఫొటోల్ని షేర్‌ చేశారు. దీంతో కొందరు అభిమానులు ఆమెపై మండిపడ్డారు. ఇలా అనేక సందర్భాల్లో ఆమె నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ కారణంగానే కొన్ని ఇన్‌స్టా పోస్ట్‌లకు ఆమె కామెంట్‌ ఆప్షన్‌ కూడా ఇవ్వడం లేదు.

అలా అంటావా?

‘పులి’ సినిమాలో పవన్కల్యాణ్‌తో కలిసి నటించారు నికీషా పటేల్‌. ఆమె గతంలో ఓసారి పవన్‌ అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ.. ద్వందార్థం వచ్చే పదాన్ని పొరపాటున ట్యాగ్‌ చేశారు. దీంతో ఫ్యాన్స్‌ ఆమెను ద్వేషిస్తూ కామెంట్లు చేశారు. ఇది అనుకోకుండా జరిగిందని నికీషా వివరణ ఇచ్చినా వినలేదు. అక్షర దోషం జరిగినందుకు తనను ట్రెండ్‌ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘పవన్‌ సర్‌ మీపై నాకు చాలా గౌరవం ఉంది. కొందరు ఇడియట్స్‌ తప్పుడు హ్యాష్‌ట్యాగ్‌ను మొదలుపెట్టడంతో నేను ఇబ్బందుల్లోపడ్డా. ఇతరుల్ని బాధపెట్టే ఉద్దేశం నాకు లేదు’ అని ఆమె అప్పట్లో అన్నారు.

ఇంత సన్నగానా..!

థానాయిక శ్రుతి హాసన్‌ కొన్ని రోజుల క్రితం బరువు పెరిగారు. ఆ సమయంలో ఆమెను నెటిజన్లు విసిగించారు. సోషల్‌ మీడియాలో ఏ ఫొటో పెట్టినా.. రూపం గురించి మాట్లాడేవారు. ఆ తర్వాత కొన్నాళ్లకు శ్రుతి కసరత్తులు చేసి నాజూకుగా తయారయ్యారు. అయినా ఆమెకు విమర్శలు తప్పలేదు. దీనిపై ఆమె స్పందిస్తూ.. ‘ఇతరుల అభిప్రాయం నాకు అనవసరం. కానీ ప్రజలు ‘ఆమె చాలా లావుగా ఉంది, చాలా సన్నగా ఉంది..’ అనడం మాత్రం ఆపడం లేదు. నాకు హార్మోన్ల సమస్య ఉంది. ఒత్తిడి కారణంగా నా ఆరోగ్యం దెబ్బతింది. అందుకే నా శరీరంలో మార్పులు జరిగాయి. ఇది నా జీవితం, నా ముఖం.. అని చెప్పుకోవడం నాకు ఎప్పుడూ సంతోషమే. నన్ను నేను ఇష్టపడుతున్నా. మీరూ అలానే ఉంటారు అనుకుంటున్నా’ అని గట్టిగా సమాధానం ఇచ్చారు.

పోషకాహార లోపమా?

కేవలం శ్రుతి హాసన్‌ మాత్రమే కాదు నటి వాణీ కపూర్‌ కూడా ఇదే తరహా విమర్శలు ఎదుర్కొన్నారు. ఆమె అస్తిపంజరంలా ఉన్నారని, ఎముకలు మాత్రమే కనిపిస్తున్నాయని నెటిజన్లు అన్నారు. పోషకాహార లోపం ఉందా? అని ఎగతాళి చేశారు. వీటిపై ఆమె విభిన్నంగా స్పందించారు. నలుగురి దృష్టిలో పడటానికి ఇలా మాట్లాడుతారని, కానీ ప్రయోజనం లేదని అన్నారు.

30 కేజీలు తగ్గినా..

థానాయిక సోనాక్షి సిన్హా కెరీర్‌ ఆరంభంలో బొద్దుగా ఉండేవారు. ఆపై దాదాపు 30 కేజీలు బరువు తగ్గారు. అయినా సరే ఇప్పటికే ప్రజలు తన బరువు విషయంలో వెక్కిరిస్తున్నారని ఇటీవల ఆమె అన్నారు. ‘గతంలో ప్రతి కామెంట్‌ చదివేదాన్ని. ఓ వ్యక్తి ఎదురుగా ఉన్నప్పుడు చెప్పలేని ఇలాంటి విషయాల్ని ప్రజలు ఆన్‌లైన్‌లో అంత ధైర్యంగా ఎలా చెబుతారని అనుకునేదాన్ని. ఎవరైనా నా ముందుకు వచ్చి.. ‘నువ్వు లావుగా ఉన్నావు’ అంటే ముఖం పగలగొట్టనూ.. ఎంతో కష్టపడి 30 కిలోలు తగ్గా. మీకు ఇష్టం లేకపోతే చూడొద్దు’ అని చెప్పారు.

నా ఫొటోలు తీసేవారు...

కప్పుడు తన అందంతో దక్షిణాదిలో అభిమానుల్ని సంపాదించుకున్న నటి ఇలియానా. ఆపై ఆమె బాలీవుడ్‌లో బిజీ అయ్యారు. కొన్ని రోజుల క్రితం ఇలియానా బొద్దుగా ఉన్న ఫొటోలు వైరల్‌ అయ్యాయి. ఆమెను విమర్శిస్తూ నెటిజన్లు కామెంట్లు చేశారు. దీనిపై ఇలియానా స్పందిస్తూ.. ‘నా ఆరోగ్యం బాగోలేదు. రోజుకు 12 మాత్రలు వేసుకునేదాన్ని. జిమ్‌కు వెళ్తుంటే.. మార్గమధ్యంలో నా ఫొటోలు తీసి వైరల్ చేస్తున్నారు. నా గురించే మాట్లాడుకుంటున్నారు. అందుకే జిమ్‌కు వెళ్లడం కూడా మానేశా’ అని అన్నారు. ఆపై ఇలియానా డైటింగ్‌ చేసి తిరిగి నాజూకుగా మారారు.

అలాంటి సీన్స్‌ చేస్తావా?

‘వరల్డ్ ఫేమస్‌ లవర్‌’ సినిమా సమయంలో రాశీ ఖన్నా ట్రోల్స్‌ ఎదుర్కొన్నారు. రొమాంటిక్‌ సన్నివేశాల్లో నటించడం పట్ల ఆమెను తప్పుపడుతూ మాట్లాడారు. ఎలాంటి పాత్రలు ఎంచుకోవాలనే విషయంపై సలహాలు ఇచ్చారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. ‘ట్రోల్స్‌ నన్ను ఏ మాత్రం బాధించలేదు. సినిమా టీజర్‌ విడుదలైనప్పటి నుంచి నేను అలాంటి కామెంట్లు చూస్తున్నా. ఈ సినిమాలో ప్రేమ సన్నివేశాలు చాలా కీలకం’ అని అన్నారు.

ఆ దుస్తులేంటి?

యాంకర్‌, నటి రష్మి ట్విటర్‌లో అనేక మార్లు విమర్శలు ఎదుర్కొన్నారు. ఆమె వస్త్రధారణను ఉద్దేశించి పలువురు అసభ్యంగా మాట్లాడారు. అంతేకాదు ఆమె అభిప్రాయాల్ని ఖండిస్తూ కామెంట్లు చేసిన వారూ చాలా మందే ఉన్నారు. అయితే రష్మి ఇలాంటి వారికి తిరిగి తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. టీవీ షోలో నటనపై ట్రోల్స్‌ గురించి మాట్లాడుతూ.. ‘మేం ప్రేక్షకుల చేతులు, కాళ్లు కట్టేసి టీవీ ముందు కూర్చో పెట్టడం లేదు. నా డ్యాన్స్‌ మీకు నచ్చకపోతే.. కళ్లు మూసుకోవచ్చు. లేదంటే ఛానల్‌ మార్చుకోవచ్చు’ అని అన్నారు. అంతేకాదు ప్రపంచం ఎన్నో సమస్యలతో సతమతమవుతుంటే.. కొందరికి తన అభిప్రాయల్లో తప్పులు వెతకడమే పనిగా మారిందని ఆమె అన్నారు.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని