కేటీఆర్‌కు మీరా చోప్రా ట్వీట్‌: స్పందించిన మంత్రి

నటి మీరా చోప్రాను పలువురు నెటిజన్లు బెదిరిస్తూ ట్విటర్‌వేదికగా అసభ్యపదజాలంతో దూషిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌కు తాను ఫ్యాన్‌ కాదని, మహేశ్‌బాబు

Updated : 06 Jun 2020 14:58 IST

హైదరాబాద్‌: నటి మీరా చోప్రాను పలువురు నెటిజన్లు బెదిరిస్తూ ట్విటర్‌వేదికగా అసభ్యపదజాలంతో దూషిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌కు తాను ఫ్యాన్‌ కాదని, మహేశ్‌బాబు అంటే ఇష్టమన్నందుకు వరుస ట్వీట్లతో, హ్యాష్‌ ట్యాగ్‌లతో ఆమెపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా  మీరా చోప్రా ఈ ఘటనపై తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌, మాజీ ఎంపీ కవితకు ట్విటర్‌ వేదికగా ఫిర్యాదు చేశారు.

‘‘కేటీఆర్‌, కవిత... మీ రాష్ట్రానికి చెందిన కొందరు నాపై సామూహిక అత్యాచారం, యాసిడ్‌తో దాడి చేస్తామని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా వేధిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌ నగర పోలీసులకు ఫిర్యాదు చేశాను. మహిళకు రక్షణ కల్పిస్తారని, దీనిపై విచారణ జరిపిస్తారని ఆశిస్తున్నా’’అని ట్వీట్‌ చేశారు. ట్వీట్‌తో పాటు తనను అసభ్యపదజాలంతో దూషిస్తూ చేసిన ట్వీట్లను కూడా పంచుకున్నారు. దీనిపై మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. 

‘‘ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ, హైదరాబాద్‌ సీపీలను కోరాను’’ అని సమాధానం ఇచ్చారు. ఇందుకు మీరా చోప్రా స్పందిస్తూ ‘‘ధన్యవాదాలు సర్‌.. చాలా సంతోషం. మహిళ భద్రతకు ఇది ఎంతో ముఖ్యం. మహిళపై నేరాలకు పాల్పడే ఇలాంటి వారిని వదలొద్దు’’ అని కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని