బాలయ్య కెరీర్‌లో మైలురాళ్లు ఈ చిత్రాలు..!

జానపదం.. పౌరాణికం.. యాక్షన్‌.. లవ్‌.. సోషియో ఫాంటసీ ఇలా జోనర్‌ ఏదైనా సరే ఆ కథలో, పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తారు అగ్ర‘కథానాయకుడు’ నందమూరి బాలకృష్ణ. మాస్‌ ప్రేక్షకుల నాడి తెలిసిన ‘సుల్తాన్‌’ ఆయన. ‘అన్నదమ్ముల అనుబంధం’తో ఇండస్ట్రీలో మెరిసి...

Updated : 09 Jun 2020 10:07 IST

జానపదం.. పౌరాణికం.. యాక్షన్‌.. లవ్‌.. సోషియో ఫాంటసీ ఇలా జోనర్‌ ఏదైనా సరే ఆ కథలో, పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తారు అగ్ర‘కథానాయకుడు’ నందమూరి బాలకృష్ణ. మాస్‌ ప్రేక్షకుల నాడి తెలిసిన ‘సుల్తాన్‌’ ఆయన. ‘అన్నదమ్ముల అనుబంధం’తో ఇండస్ట్రీలో మెరిసి ‘మంగమ్మగారి మనవడు’గా పేరు తెచ్చుకుని ‘టాప్‌ హీరో’గా ఎదిగారు. అయినవాళ్లకు ‘మిత్రుడు’గా కోపం వస్తే ‘డిక్టేటర్‌’గా ఉంటూ ‘లెజెండ్‌’ అనిపించుకున్న ఆయన ప్రతి పదో చిత్రంలో విభిన్నతను చాటారు. అలా ఆయన నటించిన ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద ‘పైసా వసూల్‌’ చేశాయి. జూన్‌ 10న బాలకృష్ణ 60వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా యువ కథానాయకులు దీటుగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతారు బాలయ్య. అలాంటి ఆయన కెరీర్‌లో మైలురాయిలాంటి చిత్రాలు పలు ఉన్నాయి. ఇందులో కొన్ని బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని చాటితే, మరికొన్ని అభిమానుల అంచనాలను అందుకోలేకపోయాయి. మరి ఆ చిత్రాలేంటో ఓసారి చూద్దామా!

తాతమ్మకల

నందమూరి తారక రామారావు నట వారసుడిగా బాలకృష్ణ వెండితెరకు పరిచయమైన చిత్రం ‘తాతమ్మ కల’. ఎన్టీఆర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1974లో ఇది విడుదలైంది. కరవుతో విలవిల్లాడుతున్న ఓ మారుమూల గ్రామంలో ఒంటరిగా జీవితాన్ని వెళ్లదీస్తున్న తన మామ్మ కలను సాకారం చేసి.. ఆ ఊరిని మార్చే తెలివైన అబ్బాయిగా బాలకృష్ణ మెప్పించారు. నిజ జీవితంలో అన్నదమ్ములైన హరికృష్ణ-బాలకృష్ణ.. రీల్‌లైఫ్‌లో సైతం సోదరులుగా ఈ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

అనురాగ దేవత

ఎన్టీఆర్‌, జయసుధ, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అనురాగ దేవత’. బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘ఆషా’ సినిమాని ఆధారంగా చేసుకుని ‘అనురాగ దేవత’ను రూపొందించారు. 1982లో విడుదలైన ఈ సినిమాలో బాలకృష్ణ కీలకపాత్రలో నటించారు. ఇది ఆయన పదో చిత్రం. ఇందులో ఎన్టీఆర్‌-బాలయ్య మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి.

బాబాయ్‌ అబ్బాయ్

‘సాహసమే జీవితం’ అనే చిత్రంతో బాలయ్య సోలో హీరోగా మారారు. అలా బాలయ్య హీరోగా నటించిన మొదటి చిత్రం 1984లో విడుదలైంది. అదే ఏడాదిలో ఆయన కథానాయకుడిగా నటించిన ఏడు చిత్రాలు విడుదలయ్యాయి. ఇక ఆయన నటించిన 20వ చిత్రం ‘బాబాయ్ అబ్బాయ్‌’. జంధ్యాల దర్శకత్వం వహించారు. ఇందులో బాలయ్య, సుత్తి వీరభద్రరావుల నటన ఆద్యంతం నవ్వులు పూయించింది.

నిప్పులాంటి మనిషి

బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘ఖయామత్‌’ చిత్రానికి రీమేక్‌గా ‘నిప్పులాంటి మనిషి’ రూపొందింది. ఎస్‌.బి.చక్రవర్తి దర్శకత్వం వహించిన యాక్షన్‌ ఫిల్మ్‌లో బాలయ్య సరసన రాధ కథానాయికగా నటించారు. శరత్‌బాబు కీలకీపాత్రలో మెప్పించారు. 1986లో విడుదలైన ఈ చిత్రం బాలకృష్ణ నటించిన 25వ సినిమా.

కలియుగ కృష్ణుడు

పరచూరి బ్రదర్స్‌ రచనలో మురళీ మోహన్‌రావు డైరెక్ట్‌ చేసిన సినిమా ‘కలియుగ కృష్ణుడు’. బాలకృష్ణ-రాధ నటీనటులుగా రావుగోపాలరావు, శారదా, అల్లు రామలింగయ్య కీలకపాత్రలు పోషించారు. ఇందులో బాలయ్య చెప్పిన డైలాగులు సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇది బాలకృష్ణ నటించిన 30వ సినిమా.

దొంగరాముడు

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన యాక్షన్‌ కథాచిత్రం ‘దొంగ రాముడు’. 1988లో తెరకెక్కిన ఈ చిత్రం బాలయ్య కెరీర్‌లో ఓ మైలురాయిగా చెప్పుకోవచ్చు. బాలకృష్ణ నటన, రాధ అభినయం ప్రేక్షకులను అలరించాయి. ప్రతినాయకుడిగా మోహన్‌బాబు యాక్షన్‌, చక్రవర్తి సంగీతం సినిమాని మరోస్థాయికి తీసుకువెళ్లాయి. ఇది బాలయ్య నటించిన 40వ సినిమా.

నారీ నారీ నడుమ మురారి

ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కిన చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. 1990లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్దే కాకుండా బాలయ్య కెరీర్‌లో కూడా సూపర్‌ హిట్‌ చిత్రంగా నిలిచింది. బాలయ్యకు జంటగా శోభనా, నిరోషా సందడి చేశారు. ప్రీ క్లైమాక్స్‌కి ముందు 20 నిమిషాలపాటు జరిగిన ఏ సన్నివేశంలో కూడా హీరో ఎక్కడా కనిపించడు. అంత ఎక్కువ సమయం హీరో కనిపించకుండా సినిమాని తెరకెక్కించడం తెలుగులో ఇదే మొదటిసారి. బాలయ్య నటించిన 50వ చిత్రం సినీ ప్రియులకు ఎప్పటికీ గుర్తుండిపోతోంది.

బంగారు బుల్లోడు

బాలకృష్ణ, రమ్యకృష్ణ, రవీనా టాండన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘బంగారు బుల్లోడు’ 1993లో విడుదలైంది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌హిట్‌ చిత్రంగా నిలిచింది. కోటి అందించిన స్వరాలు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. ఇది బాలకృష్ణ నటించిన 60వ సినిమా. అయితే ‘బంగారు బుల్లోడు’ విడుదలైన రోజునే బాలయ్య నటించిన ‘నిప్పురవ్వ’ కూడా విడుదలైంది. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా వందరోజులపాటు ఆడింది. 

దేవుడు

‘బంగారు బుల్లోడు’ హిట్‌ తర్వాత రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేవుడు’. 1997లో విడుదలైన ఈ సినిమాలో బాలయ్య-రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. బాలయ్య కెరీర్‌లో ఇది 70వ సినిమా. అయితే, బాక్సాఫీస్‌ వద్ద ఇది మిశ్రమ స్పందనలందుకుంది.

క్రిష్ణ బాబు

‘సమరసింహారెడ్డి’, ‘సుల్తాన్‌’ చిత్రాల తర్వాత బాలకృష్ణ నటించిన చిత్రం ‘క్రిష్ణబాబు’. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమా NBK75గా అభిమానులను అలరించింది. మీనా కథానాయికగా నటించిన ఈ చిత్రంలో బాలకృష్ణ గ్రామపెద్దగా తన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన వారికి తగిన విధంగా బుద్ధి చెబుతాడు.

సీమసింహం

బాలకృష్ణ నటించిన 80వ చిత్రం ‘సీమసింహం’. రామ్‌ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సిమ్రాన్‌ కథానాయిక. మణిశర్మ స్వరాలు అందించారు. 2002లో విడుదలైన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది.

మిత్రుడు

ప్రియమణి-బాలకృష్ణ జంటగా నటించిన చిత్రం ‘మిత్రుడు’. మహదేవ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలు అందించారు. ఇది కూడా అభిమానులను మెప్పించలేకపోయింది. ఇది బాలకృష్ణ నటించిన 90వ చిత్రం.

గౌతమిపుత్ర శాతకర్ణి

శాతవాహనుల రాజు గౌతమిపుత్ర శాతకర్ణి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చారిత్రాత్మక చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. బాలకృష్ణ 100 చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ఆయన కెరీర్‌లోనే ఓ అద్భుతమైన మైలురాయిగా నిలిచింది. క్రిష్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని ప్రతి సన్నివేశంలో బాలయ్య పలికించిన హావభావాలు ప్రతి ఒక్కరి చేత ఈలలు వేయించాయి. ‘సమయం లేదు మిత్రమా’ అంటూ ఆయన చెప్పిన డైలాగులు తెలుగువాడి రోమాలు నిక్కబోరిచేలా చేశాయి. శ్రియ, హేమమాలిని నటన ప్రత్యేకార్షణగా నిలిచింది. 2017లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘన విజయాన్ని నమోదు చేసుకుంది.

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని