అభిమానులు అమాయకులు: పూనమ్‌ కౌర్‌

సినీ పరిశ్రమలో గత కొన్నిరోజుల నుంచి మీరా చోప్రా, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌ అభిమానులమని చెప్పుకునే కొంతమంది నెటిజన్లు సోషల్‌మీడియా వేదికగా తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని..

Published : 07 Jun 2020 11:20 IST

సినీ తారల జీవితంలో ట్రోలింగ్‌ ఒక భాగం

హైదరాబాద్‌: సినీ పరిశ్రమలో గత కొన్నిరోజులుగా నటి మీరా చోప్రా, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌ అభిమానులమని చెప్పుకునే కొంతమంది నెటిజన్లు సోషల్‌మీడియా వేదికగా తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని మీరాచోప్రా ఇటీవల సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నటి పూనమ్‌ కౌర్‌ పెట్టిన కొన్ని ట్వీట్లు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. సినీ తారల జీవితంలో ట్రోలింగ్‌ కూడా భాగమని, వాటిని పట్టించుకోకూడదని తెలిపారు. అభిమానులు అమాయకులని, రాజకీయ లబ్ధి కోసం కొంతమంది వ్యక్తులు వాళ్లని ప్రేరేపిస్తున్నారని అన్నారు.

‘సరైన కారణం లేకుండా చాలా మంది నా గురించి తప్పుగా ప్రచారం చేశారు. అసభ్యంగా మాట్లాడారు. కానీ ఇప్పటివరకూ నేను ఏ ఒక్క అభిమానిపై ఫిర్యాదు చేయలేదు. అభిమానులు అమాయకులని నమ్ముతాను. కొంతమంది మధ్యవర్తులు తమ స్వలాభం కోసం అభిమానులను ఇలాంటి విషయాల్లో ప్రేరేపిస్తున్నారు. అందుకే నన్ను ఇబ్బందిపెట్టిన వ్యక్తులపై మాత్రమే నేను ఫిర్యాదు చేశాను. సోషల్‌మీడియాలో జరిగే వార్స్‌కి అభిమానులను నిందించొద్దు. తన అభిమానులు వేరే వ్యక్తులతో అసభ్యంగా ప్రవర్తించాలని ఏ నటుడు లేదా నటీ కోరుకోదు. సినీ తారల జీవితంలో ట్రోలింగ్‌ ఒక భాగం. నిన్ను బాధితురాలిగా మార్చేందుకే ట్రోలింగ్‌ చేస్తారు. బాధపడాల్సిన అవసరం లేదు. వాటిని వదిలేసి మనం ప్రయాణం సాగించాలి’

‘రాజకీయ లబ్ధిలో భాగంగా ఓ నటుడిపై బురదజల్లడం కోసం ఫేక్‌ అకౌంట్లు సృష్టించి అభిమానులమని చెప్పుకుంటున్నారేమో మనకి తెలియదు. మన ఇండస్ట్రీ రాజకీయ పార్టీలతో లింకై ఉందని గ్రహించాలి. అభిమానులు అమాయకులు. కొంతమంది రాజకీయ నేతలు రాక్షసులు. అలాంటి వాళ్లే ఇలాంటివి చేస్తారు’ అని పూనమ్‌ కౌర్‌ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని