విమర్శలకు చెక్‌పెట్టిన సోనూ సూద్‌

లాక్‌డౌన్‌లో వలస కార్మికులు పడుతున్న కష్టాలు చూసి చలించి, వారికి తన వంతు సాయం చేస్తున్న బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ప్రశంసించారు....

Updated : 08 Jun 2020 13:06 IST

ముంబయి: లాక్‌డౌన్‌లో వలస కార్మికులు పడుతున్న కష్టాలు చూసి చలించి, వారికి తన వంతు సాయం చేస్తున్న బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ప్రశంసించారు. ఆదివారం సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేను సోనూసూద్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. వలస కార్మికులు పడుతున్న కష్టాలపై చర్చించారు. అయితే, ఆ ముందు రోజు సోనూసూద్‌ చేస్తున్న సాయంపై శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ తీవ్ర విమర్శలు చేశారు. ఆర్థిక ప్రయోజనాల కోసం సోనూ ఇదంతా చేస్తూ భాజాపా కొమ్ము కాస్తున్నారంటూ ఆ పార్టీ అధికార పత్రిక సామ్నా వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం సోనూ సీఎంను కలిసి తనపై వచ్చిన విమర్శలకు చెక్‌ పెట్టారు.

‘‘మేము కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరికీ సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాము. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ అన్ని రాజకీయ పార్టీలు మాకు మద్దతిస్తున్నాయి. వలస కార్మికులతో నా ప్రయాణం చాలా ప్రత్యేకమైనది. సాయం కోసం కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకూ ఎవరైనా నన్ను సంప్రదిస్తే వారు ఇంటికి చేరుకునేందుకు సాయం చేయడంలో నేనెప్పుడూ ముందుంటా’’ అని సోనూ పేర్కొన్నారు. 

లాక్‌డౌన్‌తో ముంబయిలో చిక్కుకుపోయిన వలస కూలీలను వారి స్వగ్రామాలకు చేర్చేందుకు సోనూ తన సొంత ఖర్చుతో బస్సులు, రైళ్లు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరికీ సాయం చేయాలన్న ఉద్దేశంతో ఇటీవల ఆయన ఓ టోల్‌ఫ్రీ నంబర్‌ను కూడా ఏర్పాటు చేశారు. సాయం కావాలంటూ ఎవరైనా ఫోన్‌ చేస్తే.. వెంటనే స్పందిస్తున్నారు. సోనూ చేస్తున్న సాయంపై సర్వత్రా ప్రసంశలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఆయనపై వస్తున్న విమర్శలపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని