చైనాలో థియేటర్లు తెరిస్తే మనమూ తెరవచ్చు

కరోనా కారణంగా చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోయిందని ప్రముఖ నిర్మాత సురేశ్‌బాబు అన్నారు. తాజాగా థియేటర్లు తెరవడంపై ఆయన మాట్లాడారు. ‘‘ఆగస్టులో థియేటర్లు తెరుచుకుంటాయని

Published : 08 Jun 2020 16:24 IST

ఇప్పుడే తొందరపాటు పనికిరాదు: నిర్మాత సురేశ్‌బాబు

హైదరాబాద్‌: కరోనా కారణంగా చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోయిందని ప్రముఖ నిర్మాత సురేశ్‌బాబు అన్నారు. తాజాగా థియేటర్లు తెరవడంపై ఆయన మాట్లాడారు. ‘‘ఆగస్టులో థియేటర్లు తెరుచుకుంటాయని చాలా మంది అంటున్నారు. మరికొంత సమయం తీసుకోవడం ఉత్తమమని నా అభిప్రాయం. ఇండస్ట్రీ దెబ్బతిన్న మాట వాస్తవమే. దీంతో కొందరు తొందరపడుతున్నారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని ఆలోచించాలి. థియేటర్లు తెరిస్తే జనం వస్తారా? ప్రదర్శించడానికి సినిమాలు ఉన్నాయా? ఇప్పటికే చిత్రీకరణ పూర్తయిన సినిమాలు ప్రదర్శించేందుకు దర్శక-నిర్మాతలు ముందుకు వస్తారా? ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. విదేశాల్లో చాలా దేశాల్లో థియేటర్లు ఓపెన్‌ చేశారు. అయితే, అక్కడ  2శాతం ఆక్యుపెన్సీ కూడా లేదు. ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో ప్రస్తుతం తెలుసుకుంటున్నాం. థియేటర్లు ఎక్కడెక్కడ తెరుచుకుంటున్నాయో ఆరా తీస్తున్నాం. వాళ్లు ఎలాంటి పద్ధతులు పాటిస్తున్నారో చూస్తున్నాం. వాళ్లు చేసే తప్పులు మనం చేయకూడదు. చైనాలో థియేటర్లు ఓపెన్‌ చేసి జనాలు వెళ్తుంటే, ఇక్కడ కూడా మనం థియేటర్లు తెరవవచ్చు. అక్కడ ఓపెన్‌ చేయనప్పుడు మనమెందుకు తెరవాలి’’ 

‘‘ప్రస్తుతం తిరిగి షూటింగ్‌లు ఎలా మొదలుపెట్టాలన్నదానిపై చర్చిస్తున్నాం. ఓటీటీకి అమ్మేసుకునే చిత్రాల షూటింగ్‌లు మొదలు పెడితే మంచిది. అదే విధంగా టెలివిజన్‌ సిరీస్‌లు కూడా. ఎందుకంటే ఆ సినిమాను అమ్ముకునే అవకాశం ఉంది. ఎవరో ఒకరు కొంటారు. 50మందితో మాత్రమే షూటింగ్‌ చేయాలని అంటున్నారు. అది అస్సలు సాధ్యపడదు. మేము తీస్తున్న ‘నారప్ప’కోసం రోజుకు 100మంది జూనియర్‌ ఆర్టిస్ట్‌లు కావాలి. నా స్వార్థం కోసం నేను షూటింగ్‌ మొదలు పెట్టి, అందులో ఎవరికైనా కరోనా వస్తే, ఆ మచ్చ నాపై పడిపోతుంది. నా సినిమా పూర్తయినా కూడా ఇప్పుడే విడుదల చేసే పరిస్థితి మార్కెట్‌లో లేదు. ఇలాంటి సమయంలో తొందరపడకూడదని నేను అభిప్రాయపడుతున్నా’’ అని థియేటర్లలో సినిమాల విడుదల, చిత్రీకరణపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని