సుశాంత్ కేసు సీబీఐకి అప్ప‌గించా‌లి 

బాలీవుడ్ క‌థానాయ‌కుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ కేసును మహారాష్ట్ర ప్ర‌భుత్వం సీబీఐకి అప్ప‌గించాల‌ని భాజ‌పా ఎంపీ, భోజ్‌పూరి సూప‌ర్‌స్టార్‌ మ‌నోజ్ తివారీ

Published : 22 Jun 2020 19:20 IST

ఎంపీ మ‌నోజ్ తివారీ

ముంబ‌యి: బాలీవుడ్ క‌థానాయ‌కుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ కేసును మహారాష్ట్ర ప్ర‌భుత్వం సీబీఐకి అప్ప‌గించాల‌ని భాజ‌పా ఎంపీ, భోజ్‌పూరి సూప‌ర్‌స్టార్‌ మ‌నోజ్ తివారీ డిమాండ్ చేశారు. ఆయ‌న సోమ‌వారం ప‌ట్నాలోని సుశాంత్ కుటుంబ స‌భ్యుల్ని క‌లిశారు. న‌టుడి ఆత్మ‌హ‌త్య చుట్టూ ఉన్న కార‌ణాలు చూస్తుంటే.. కేసును లోతుగా ద‌ర్యాప్తు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అనంత‌రం బాలీవుడ్‌లో నెపోటిజం గురించి ప్ర‌స్తావించారు. సినీ నేప‌థ్యంలేని వారు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో నిల‌దొక్కుకోవ‌డం క‌ష్ట‌మ‌ని చెప్పారు.

‘సినీ నేప‌థ్యం లేకుండా బ‌య‌టి నుంచి వ‌చ్చిన ఓ న‌టుడు ఒంట‌రిగా క‌ష్ట‌ప‌డి గుర్తింపు, స‌క్సెస్ తెచ్చుకున్న‌ప్పుడు కొన్ని శ‌క్తులు అత‌డ్ని ఆపేందుకు ప్ర‌యత్నించాయి. సుశాంత్ 16 ఏళ్ల వ‌య‌సులో త‌న త‌ల్లిని పోగొట్టుకున్నారు. అయినా స‌రే త‌డ‌బ‌డ‌లేదు.. కానీ ఇప్పుడు ఆత్మ‌హ‌త్య చేసుకునేలా ఆయ‌న్ను ఎటువంటి పరిస్థితులు ప్రేరేపించాయో తెలియాలి. బాలీవుడ్‌లోని నెపోటిజం కార‌ణంగా సుశాంత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఈ కోణంలో కేసును ద‌ర్యాప్తు చేయాలి. నేర‌స్థుల్ని శిక్షించాలి‌. స‌రైన విచార‌ణ కోసం మహారాష్ట్ర ప్ర‌భుత్వం కేసును సీబీఐకి అప్ప‌గించాలి’ అని పేర్కొన్నారు.

సుశాంత్ ఈ నెల 14న ముంబ‌యిలోని త‌న నివాసంలో ఆత్మ‌హ‌త్య చేసుకుని, అంద‌ర్నీ షాక్‌కు గురి చేశారు. మాన‌సిక ఒత్తిడి కార‌ణంగా ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు పోలీసుల‌ ప్రాథ‌మిక విచార‌ణ‌లో తెలిసింది. మ‌రోప‌క్క తను సంత‌కం చేసిన ఏడు ప్రాజెక్టుల నుంచి తొల‌గించ‌డం, బాలీవుడ్‌లో కొంద‌రి ప్ర‌వ‌ర్త‌న వ‌ల్ల‌ సుశాంత్ మా‌న‌సిక ఒత్తిడికి గుర‌య్యార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని