We For India: కొవిడ్‌ ఉపశమన నిధి కోసం సినీ ప్రముఖులతో 3 గంటల వీడియోథాన్‌

దేశంలో కొవిడ్‌-19 ఉపశమన చర్యలకు దోహదపడేలా రూ.25 కోట్లకు పైగా నిధులు సేకరించేందుకు

Updated : 10 Aug 2021 10:57 IST

 ఆగస్టు 15న ఫేస్‌బుక్‌లో ప్రసారం

ముంబయి, దిల్లీ: దేశంలో కొవిడ్‌-19 ఉపశమన చర్యలకు దోహదపడేలా రూ.25 కోట్లకు పైగా నిధులు సేకరించేందుకు పలువురు సినీ ప్రముఖులు చేతులు కలిపారు. ఇందుకోసం రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మిస్తున్న వీడియోథాన్‌లో వీరంతా పాల్గొంటున్నారు. ‘వుయ్‌ ఫర్‌ ఇండియా’ పేరిట జరిగే ఈ కార్యక్రమం ఆగస్టు 15న ఫేస్‌బుక్‌లో 3 గంటల పాటు ఏకధాటిగా ప్రసారం కానుంది. సుమారు వంద మందికి పైగా సినీ నటులు, దర్శకులు ఇందులో కనిపిస్తారు.

హిందీ నటుడు రాజ్‌కుమార్‌ రావ్‌ వ్యాఖ్యాతగా ఉండే ఈ కార్యక్రమంలో బాలీవుడ్‌ నటులు సైఫ్‌ అలీ ఖాన్, విద్యా బాలన్, రాజ్‌కుమార్‌ హిరానీ, ఇంతియాజ్‌ అలీ, ఫరాఖాన్, విక్రమ్‌ భట్‌ తదితరులు పాల్గొంటారు. అజయ్‌ దేవగణ్, అక్కినేని నాగార్జున, ఆర్‌.మాధవన్, ఫరాన్‌ అక్తర్, తుషార్‌ కపూర్‌ తదితరులతో రూపొందించిన ముఖాముఖి కార్యక్రమాలు ఉంటాయి. బ్రిటిష్‌ గాయకులు మిక్‌ జాగర్, ఎడ్‌ షీరన్, సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్, జావేద్‌ అక్తర్, ప్రభుదేవా, రెమో డిసౌజా, శంకర్‌ మహదేవన్, ఉషా ఉతప్, కనికా కపూర్‌ల ప్రదర్శనలూ ఉంటాయి. శిల్పాశెట్టి, సోనాక్షి సిన్హా, సారా అలీఖాన్, రకుల్‌ ప్రీత్‌సింగ్, మలైకా ఆరోరా, దియామీర్జా, అనన్య పాండే వంటి నాయికలు సందడి చేయనున్నారు.

ఎన్‌ఎస్‌డీలో 12 నుంచి నాటకాల ప్రదర్శన

స్వాతంత్య్రోద్యమ ప్రేరణతో రూపొందించిన నాటకాలను ఈనెల 12 నుంచి మూడు రోజుల పాటు ప్రదర్శిస్తున్నట్టు నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా (ఎన్‌ఎస్‌డీ) ఛైర్మన్‌ పరేశ్‌ రావల్‌ ఓ ప్రకటనలో తెలిపారు. జగదాంబ, బాపు, పెహ్లా సత్యాగ్రహి అనే మూడు నాటకాలను ఎన్‌ఎస్‌డీలోని అభిమంచ్‌ ఆడిటోరియంలో ఈనెల 12న కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ ప్రారంభిస్తారని చెప్పారు. వీటిని తిలకించేందుకు 10వ తేదీ నుంచి ప్రవేశ టిక్కెట్లు ఉచితంగా ఇస్తామన్నారు.

1.28 లక్షల ప్రాంతాల్లో జెండావందనం: ఏబీవీపీ

75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా 1,28,335 ప్రాంతాల్లో జాతీయ జెండా ఎగురవేస్తామని ఏబీవీపీ పేర్కొంది. ఏడాది పాటు తిరంగా యాత్రలు, విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాలు, సామాజిక మాధ్యమాలలో ప్రచారం, స్వాతంత్య్ర సమరయోధులపై లఘుచిత్రాల నిర్మాణం వంటివి చేపడతామని చెప్పింది. నూతన జాతీయ విద్యా విధానాన్ని సకాలంలో అమలుచేసేలా ప్రతి రాష్ట్రంలో ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, ఈ కమిటీలు ఇచ్చే నివేదికలను కేంద్రానికి నివేదిస్తామని ఏబీవీపీ ప్రధాన కార్యదర్శి నిధి త్రిపాఠి తెలిపారు.

ఏడాది పాటు స్వాతంత్య్ర వేడుకలు: కాంగ్రెస్‌

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఏడాది పొడవునా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్‌ తెలిపింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇన్‌ఛార్జులు, పీసీసీ అధ్యక్షుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీనియర్‌ నేత కేసీ వేణుగోపాల్‌ చెప్పారు. ‘‘75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ఆగస్టు 14, 15 తేదీల్లో అన్ని జిల్లాల్లో పార్టీ ఆధ్వర్యంలో స్వతంత్ర సేనాని, షాహీద్‌ సమ్మాన్‌ దివస్‌ కార్యక్రమాలు జరుగుతాయి. 14న సాయంత్రం స్వాతంత్య్ర సమరయోధులు, వారి కుటుంబాలను సత్కరిస్తారు. 15న ఉదయం మండల, జిల్లా కాంగ్రెస్‌ కమిటీలు స్వతంత్ర మార్చ్‌ చేపడుతాయి. పీసీసీలు ఆయా రాష్ట్రాల్లో జరిగిన స్వాతంత్య్రోద్యమ సంఘటనలపై రెండు నిమిషాల వీడియోలు సిద్ధం చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తాయి’’ అని వివరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని