Miss India 2022: ఫెమినా మిస్‌ ఇండియాగా సినీశెట్టి

ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌(2022) టైటిల్‌ను కర్ణాటకకు చెందిన సినీశెట్టి గెలుచుకున్నారు. ఆదివారం ముంబయిలోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ వీఎల్‌సీసీ ఫెమినా మిస్‌ ఇండియా గ్రాండ్‌ ఫైనల్‌ జరిగింది. ఈ పోటీల్లో రాజస్థాన్‌కు చెందిన

Updated : 04 Jul 2022 09:40 IST

ముంబయి: ఫ్యాషన్‌రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఫెమినా మిస్‌ ఇండియా’ (Femina Miss India 2022) కిరీటం ఈ ఏడాది కర్ణాటకకు చెందిన సినీశెట్టి (Sinishetty) సొంతమైంది. గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న ఈ పోటీలు ఆదివారంతో అట్టహాసంగా ముగిశాయి. ముంబయిలోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో గ్రాండ్‌ ఫైనల్‌ వేడుకగా జరిగింది. అన్ని పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సినీశెట్టి విజేతగా నిలిచి.. అందాల కిరీటాన్ని తన సొంతం చేసుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన రూబల్‌ శెఖావత్‌ మొదటి రన్నరప్‌గా నిలువగా, ఉత్తర్‌ప్రదేశ్‌ యువతి షినాటా చౌహాన్‌ ద్వితీయ రన్నరప్‌గా ఎంపికయ్యారు.

సినీశెట్టి విజయంపై ఆమె కుటుంబసభ్యులు, సన్నిహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శుభాకాంక్షలు చెబుతూ వరుస పోస్టులు పెడుతున్నారు. సినీ, ఫ్యాషన్‌ ప్రియులు అభినందనలు చెబుతున్నారు. బాలీవుడ్‌ స్టార్స్‌ నేహా ధూపియా, డినో మోరియా, మలైకా అరోరా.. డిజైనర్లు రోహిత్‌ గాంధీ, రాహుల్‌ఖన్నా.. కొరియోగ్రాఫర్‌ శియామక్‌ దావర్‌, మాజీ క్రికెటర్‌ మిథాలీరాజ్‌ జ్యూరీ ప్యానెల్‌గా వ్యవహరించారు.

విజేతగా నిలిచిన అనంతరం సినీశెట్టి మాట్లాడుతూ.. ఈ ప్రయాణాన్ని తాను ఎప్పటికీ మర్చిపోలేనని, ఇందులో భాగమై తనకు అడుగడుగునా సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఇక, ముంబయిలోనే పుట్టి పెరిగిన సినీశెట్టికి చిన్నతనం నుంచి ఫ్యాషన్‌పై అమితాసక్తి. ఇంట్లో వాళ్లు ప్రోత్సహించడంతో అందాల పోటీల్లోకి అడుగుపెట్టింది. కర్ణాటక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ పోటీల్లో పాల్గొని విజయాన్ని అందుకుంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని