Super Star Krishna: కృష్ణ కెరీర్‌లో ఆ కాలం స్వర్ణయుగం..

కృష్ణ కెరీర్‌లో 1978-86 మధ్య కాలం స్వర్ణయుగమని చెప్పొచ్చు. ఆ కాలంలో సంఖ్య పరంగా ఎక్కువ సినిమాలు చేయడమే కాదు... అత్యధిక విజయాలూ అందుకున్నారు.

Updated : 16 Nov 2022 08:38 IST

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ కృష్ణ కెరీర్‌లో 1978-86 మధ్య కాలం స్వర్ణయుగమని చెప్పొచ్చు. ఆ కాలంలో సంఖ్య పరంగా ఎక్కువ సినిమాలు చేయడమే కాదు... అత్యధిక విజయాలూ అందుకున్నారు. 1978లో ‘అన్నదమ్ముల సవాల్‌’, ‘ఏజెంట్‌ గోపి, ‘ఇంద్ర ధనస్సు’, ‘కుమార్‌ రాజా’, ‘అల్లరి బుల్లోడు’.. 1979లో వియ్యాలవారి కయ్యాలు, హేమాహేమీలు, మండే గుండెలు, కొత్త అల్లుడు, బుర్రిపాలెం బుల్లోడు విజయవంతమైన చిత్రాలుగా నిలిచాయి. ఘరానా దొంగ, మామా అల్లుళ్ల సవాల్‌, చుట్టాలున్నారు జాగ్రత్త, రామ్‌ రాబర్ట్‌ రహీమ్‌ లాంటి హిట్‌ చిత్రాల్లో నటించారు. వీటిలో అత్యధిక చిత్రాల్లో కలసి నటించిన కృష్ణ, శ్రీదేవి హిట్‌పెయిర్‌గా పేరొందారు.

1981లో సంక్రాంతికి విడుదలైన ‘ఊరికి మొనగాడు’ పెద్ద విజయం సాధించింది. 1982లో కృష్ణ స్వయంగా నిర్మించిన ‘ఈనాడు’ సినిమాతో ఆయన 200 చిత్రాల మైలురాయిని చేరుకోవడం విశేషం. 1983లో ఆయన పద్మాలయా స్టూడియోస్‌ను స్థాపించారు. ఆ తర్వాతా ఆయన జైత్రయాత్రను కొనసాగించారు. ‘ముందడుగు’, ‘కిరాయి కోటిగాడు’, ‘అడవి సింహాలు’, ‘ప్రజారాజ్యం’, ‘ఇద్దరు దొంగలు’, ‘బంగారు కాపురం’, ‘ముఖ్యమంత్రి’, ‘కంచు కాగడా’ చిత్రాలతో ఆకట్టుకున్నారు. 1985లో కృష్ణ ఇమేజ్‌ శిఖరాగ్రస్థాయికి చేరింది. ఆ ఏడాది విడుదలైన ‘అగ్నిపర్వతం’, ‘పల్నాటి సింహం’, ‘వజ్రాయుధం’ చిత్రాలు సంచలన విజయాలు సాధించాయి. వాటిలోని ఆవేశపూరిత పాత్రల్లో కృష్ణ ప్రదర్శించిన అభినయానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

1986లో కృష్ణ దర్శకుడిగా మారి.. ‘సింహాసనం’తో సత్తా చాటారు. ఆ తర్వాతి సంవత్సరాల్లో ‘ముద్దాయి’, ‘తండ్రీ కొడుకుల ఛాలెంజ్‌’, ‘కొడుకు దిద్దిన కాపురం’, ‘సాహసమే నా ఊపిరి’, ‘గూఢచారి 117’, ‘గూండారాజ్యం’ చిత్రాలతో మెప్పించారు. హిందీలోనూ అడుగుపెట్టి నిర్మాతగా ‘ఇష్క్‌ హై తుమ్‌సే’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ‘తెలుగు వీర లేవరా’ (1995)తో 300 చిత్రాలు పూర్తిచేశారు. ఆ తర్వాత కథానాయకుడిగా నటిస్తూనే ఇతర చిత్రాల్లో కీలకపాత్రలు పోషించడం ప్రారంభించారు. ‘వారసుడు’, ‘రాముడొచ్చాడు’, ‘ఒసేయ్‌ రాములమ్మా’, ‘సుల్తాన్‌’, ‘రాజకుమారుడు’, ‘వంశీ’, ‘మల్లన్న’ తదితర చిత్రాల్లో ప్రత్యేక పాత్రలతో ఆకట్టుకున్నారు కృష్ణ. ‘శ్రీశ్రీ’ సినిమా తర్వాత ఆయన నటించలేదు. ఆరోగ్యం సహకరించకపోవడంతో కొన్నేళ్లుగా సినిమాలకు పూర్తి దూరంగా ఉంటున్నారు. కృష్ణ నట వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు మహేశ్‌బాబు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని