Published : 05 Nov 2021 09:46 IST

Cinema news: గుండెల్లో నిలిచి.. దివికేగిపోయారు!

పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణంతో సినీ, అభిమాన లోకం ఉలిక్కిపడింది! తనొక్కడే కాదు.. అభినయం, నటనతో అలరిస్తూ.. మన ఆయుష్షు పెంచుతున్న తారలెందరో అనారోగ్యంతో అర్థాంతరంగా చుక్కల లోకంలోకి వెళ్లిపోతున్నారు... మీదీ, మాదీ కలకాలం విడదీయలేని బంధం అంటూనే అభిమానుల్ని కన్నీటి సంద్రంలో ముంచేస్తున్నారు... ఈమధ్యకాలంలో అలా మనకు హఠాత్తుగా దూరమైన కొందరు సెలెబ్రెటీల వివరాలు.

శ్రీదేవి.. వయసు: 54

అందం, అభినయంతో అలరించిన అతిలోక సుందరి శ్రీదేవి 54 ఏళ్లకే ఈ లోకం విడిచి వెళ్లిపోయింది. ఐదు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రయాణం తనది. లేడీ సూపర్‌స్టార్‌గా అభిమానులతో జేజేలు అందుకున్న అమ్మయ్యంగార్‌ దుబాయ్‌లో జరుగుతున్న బంధువుల పెళ్లి వేడుకకు హాజరైంది. అక్కడ హోటల్‌ గదిలో ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో మునిగిపోయింది. అదేసమయంలో గుండెపోటు రావడంతో ఊపిరాడక చనిపోయింది. సమస్త అభిమానుల్ని నిశ్చేష్టులను చేసింది.

మధుబాల.. వయసు: 36

సౌందర్యానికి మారుపేరుగా, లెజెండరీ నటిగా నీరాజనాలు అందుకున్న నటి మధుబాల. అందం, నటనతో ఎన్నో హృదయాలను రంజింపజేసింది. హాలీవుడ్‌లో నటించిన తొలి భారతీయ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ కాలంలో తనని ప్రఖ్యాత నటి మార్లిన్‌ మన్రోతో పోల్చేవారు. అంతటి గొప్ప నటి గుండె, కాలేయ సంబంధ వ్యాధులతో 36 ఏళ్లకే అకాల మరణం చెందింది. భారతీయ సినీ లోకాన్ని శోకంలో ముంచెత్తింది.

ఇర్ఫాన్‌ ఖాన్‌.. వయసు: 53

భారత్‌ అందించిన అత్యుత్తమ విలక్షణ నటుల్లో ఒకరిగా ఇర్ఫాన్‌ఖాన్‌కి గుర్తింపు ఉంది. రాజస్థాన్‌లోని చిన్న పట్టణం నుంచి వచ్చి నటనతో శిఖరాగ్రానికి చేరాడు ఇర్ఫాన్‌. నటన, సినిమా పరిశ్రమతో తనది మూడున్నర దశాబ్దాల బంధం. హాలీవుడ్‌లోనూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. పదుల సంఖ్యలో అవార్డులు అందుకున్నాడు. అంత గొప్ప కళాకారుడిపై అనారోగ్యం పంజా విసిరింది. న్యూరో ఎండోక్రైన్‌ క్యాన్సర్‌తో రెండేళ్లు పోరాడి గతేడాదే మృత్యు ఒడిలోకి జారిపోయాడు ఖాన్‌.

ఆర్తి అగర్వాల్‌.. వయసు: 31

పద్దెనిమిదేళ్లకే తెలుగు చిత్రసీమలో స్టార్‌ హోదా అందుకున్న నటి ఆర్తి అగర్వాల్‌. కెరీర్‌ ఉచ్ఛదశలో ఉన్నప్పుడు.. చేతి నిండా సినిమాలుండేవి. డేట్స్‌ సర్దుబాటు చేయలేక సతమతయ్యేది. తర్వాత కొన్ని స్వయంకృతాపరాధాలతో వెనకబడిపోయింది. మానసిక ఒత్తిడికి గురైంది. విపరీతంగా లావు పెరిగిపోవడంతో తగ్గించుకొని మళ్లీ సత్తా చూపాలనుకుంది. బరువు తగ్గడానికి శస్త్రచికిత్సలను నమ్ముకుంది. దురదృష్టవశాత్తు అవి వికటించడంతో తీవ్ర అనారోగ్యాలపాలై చిన్న వయసులోనే అర్థాంతరంగా కన్నుమూసింది.

సిద్ధార్థ్‌ శుక్లా... వయసు: 40

మోడల్‌గా మొదలుపెట్టి.. సీరియళ్లు, సినిమాల్లో చిన్నా చితకా పాత్రలతో పేరు తెచ్చుకున్న నటుడు సిద్ధార్థ్‌ శుక్లా. బిగ్‌బాస్‌ 13 సీజన్‌ విజేతగా నిలవడంతో స్టార్‌ హీరోలకు మించి పాపులర్‌ అయ్యాడు.  ఖత్రోం కా ఖిలాడీ, ఇండియాస్‌ గాట్‌ టాలెంట్‌లాంటి రియాలిటీ షోలు, బాలీవుడ్‌ అవార్డుల కార్యక్రమాలకు తనదైన వ్యాఖ్యానంతో వన్నె తెచ్చిన యాంకర్‌ కూడా. కెరీర్‌ ఊపందుకుంటున్న దశలోనే గుండెపోటుతో ఈ లోకం నుంచి నిష్క్రమించాడు.

చిరంజీవి సర్జా... వయసు: 38

కన్నడ సినిమాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ప్రతిభావంతుడైన నటుడు చిరంజీవి సర్జా. సీనియర్‌ నటుడు అర్జున్‌ సర్జాకి దగ్గరి బంధువు. ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాల్లో నటించి మంచి కమర్షియల్‌ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. గతేడాది ఇంట్లోనే ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించే లోపే గుండెపోటు అతడిని బలి తీసుకుంది. తను చనిపోయే నాటికి భార్య మేఘన ఆరుమాసాల గర్భిణి.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని