Kiran Korrapati: ‘గని’ స్ఫూర్తిగా నిలుస్తాడు

‘‘నేను ఓ జానర్‌కు పరిమితమవ్వాలని అనుకోవట్లేదు. విభిన్నమైన కథలతో ప్రేక్షకుల్ని అలరించాలనుకుంటున్నా’’ అన్నారు కిరణ్‌ కొర్రపాటి. ‘గని’ సినిమాతో వెండితెరకు పరిచయమవుతున్న కొత్త దర్శకుడాయన.

Updated : 05 Apr 2022 06:56 IST

‘‘నేను ఓ జానర్‌కు పరిమితమవ్వాలని అనుకోవట్లేదు. విభిన్నమైన కథలతో ప్రేక్షకుల్ని అలరించాలనుకుంటున్నా’’ అన్నారు కిరణ్‌ కొర్రపాటి. ‘గని’ సినిమాతో వెండితెరకు పరిచయమవుతున్న కొత్త దర్శకుడాయన. వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటించారు. అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించారు. సయీ మంజ్రేకర్‌ కథానాయిక. ఈనెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు దర్శకుడు కిరణ్‌.

‘‘ఇది క్రీడా నేపథ్య చిత్రమైనా కమర్షియల్‌ సినిమాలో ఉండే అన్ని రకాల వాణిజ్యాంశాలు పుష్కలంగా ఉన్నాయి. దీనికోసం ప్రత్యేకంగా బాక్సింగ్‌ ఆటనే ఎంపిక చేసుకోవడానికి ఓ కారణం ఉంది. క్రికెట్‌, ఫుట్‌బాల్‌ కథల్లో లేని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌.. ఫిజికల్‌ ఇంట్రాక్షన్‌ దీంట్లో ఎక్కువ ఉంటాయి. ఇది వరుణ్‌ కటౌట్‌కు సరిగ్గా సరిపోతుందనిపించింది. అందుకే ఈ బాక్సింగ్‌ కథతోనే ముందుకు వెళ్లాం’’.

తొలుత ఆ టైటిల్స్‌ అనుకున్నా..

‘‘జీరో నుంచి మొదలై హీరోగా మారడమన్నది ప్రతి స్పోర్ట్స్‌ డ్రామాలో కనిపించే అంశమే. ఇదీ ఆ తరహాలోనే ఉంటుంది. జీవితంలో గెలవాలనుకునే ప్రతి ఒక్కరికీ.. తామేంటో నిరూపించుకోవాలనుకునే వారికీ ‘గని’నే స్ఫూర్తిగా నిలుస్తాడు. ఈ కథకు నేను తొలుత ‘ఫైటర్‌’, ‘ఛాంపియన్‌’.. ఇలా రకరకాల పేర్లు అనుకున్నా. కథ పూర్తయ్యాక హీరో పాత్ర పేరుతోనే టైటిల్‌ ఉంటే బాగుంటుందనిపించింది. అప్పుడే వరుణ్‌ ‘గని’ అని పెడితే ఎలా ఉంటుందని అడిగారు. ఈ పేరైతే ప్రేక్షకులకు ఈజీగా కనెక్ట్‌ అవుతుందనిపించింది. అందుకే దాన్నే ఖరారు చేశాం’’.

లవ్‌ ట్రాక్‌కు చాలా కష్టపడ్డా..

‘‘తొలి ప్రయత్నంలోనే స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ కథాంశాన్ని ఎంచుకొని.. దాన్ని కమర్షియల్‌ యాంగిల్‌లో చూపించే ప్రయత్నం చేయడం  సవాల్‌తో కూడుకున్న విషయమే. నేను దీన్ని ఛాలెంజింగ్‌గా తీసుకొని చేశా. ఈ స్క్రిప్ట్‌ కోసం 3నెలలు కష్టపడ్డా. లవ్‌ ట్రాక్‌ సెట్‌ చేయడం కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఏడు వెర్షన్లు రాసుకున్నా. ‘దబాంగ్‌ 3’లో సయీ మంజ్రేకర్‌ పాట చూశా. చాలా బాగుంది అనిపించింది. వరుణ్‌కు తగ్గ హైట్‌ ఉంది.. జోడీ బాగుంటుంది అనిపించింది. అందుకే ఆమెని తీసుకున్నాం.

రోజూ సింగిల్‌ మీల్‌ తీసుకుంటూ..

‘‘ఈ సమాజం ఎప్పుడూ గెలిచిన వాడి మాటే నమ్ముతుంది’ అని ట్రైలర్‌లో ఓ మాట ఉంటుంది. నేను ఏమీ నిరూపించుకోకున్నా.. నన్ను, నా కథను నమ్మి వరుణ్‌ నాకీ అవకాశమిచ్చారు. బాక్సర్‌ లుక్‌ను మూడేళ్ల పాటు మెయింటైన్‌ చేశారు. మధ్యలో ఒకసారి ఆయన చెయ్యి విరిగింది. ఆ సమయంలో బాక్సింగ్‌ ప్రాక్టీస్‌ చేయడానికి లేదు.. వర్కవుట్స్‌ చేయలేరు. తన లుక్‌ కాపాడుకోవడం కోసం ప్రతిరోజూ సింగిల్‌ మీల్‌ తీసుకుంటూ.. రెండు నెలలు ఎంతో కష్టపడ్డారు’’.


‘‘మా నాన్న సినిమా జర్నలిస్ట్‌ కావడం వల్ల చిన్నప్పటి నుంచీ  సినిమాలపై ఆసక్తి ఉండేది. కొత్త సినిమా వచ్చిందంటే చాలు.. ఉదయాన్నే ప్రీమియర్లకు వెళ్లిపోయేవాడిని. నేను ఇండస్ట్రీలో వి.వి.వినాయక్‌, జయంత్‌, హరీష్‌ శంకర్‌, శ్రీను వైట్ల, లారెన్స్‌ తదితర ప్రముఖ దర్శకుల వద్ద చాలా కాలం పనిచేశాను. మధ్యలో దర్శకుడిగా రెండు ప్రాజెక్ట్‌లు అనుకున్నా. అనుకోని కారణాల వల్ల అవి పట్టాలెక్కలేదు. తర్వాత మళ్లీ కొన్నాళ్లు సహాయ దర్శకుడిగానే చేశా. ఈ క్రమంలో వరుణ్‌ పరిచయమవడం.. నాపై నమ్మకంతో ఈ సినిమా ఇవ్వడం జరిగాయి. ప్రస్తుతం కొన్ని కథలు సిద్ధం చేసుకున్నా. నిర్మాతలు చెరుకూరి సుధాకర్‌, భగవాన్‌ పుల్లారావులతో సినిమాలు చేయాల్సి ఉంది. అలాగే వరుణ్‌ తేజ్‌ నిర్మాణంలోనూ ఓ చిత్రం చేయాలి’’.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని