Ramesh babu:సినీనటుడు మహేష్‌బాబు సోదరుడు రమేష్‌బాబు కన్నుమూత

ప్రముఖ సినీ హీరో మహేశ్‌ బాబు సోదరుడు ఘట్టమనేని రమేష్‌ బాబు కన్నుమూశారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం సాయంత్రం

Updated : 09 Jan 2022 06:35 IST

హైదరాబాద్‌: సూపర్‌ స్టార్‌ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్‌బాబు సోదరుడు ఘట్టమనేని రమేష్‌బాబు (56) అనారోగ్యంతో కన్నుమూశారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన్ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ప్రస్తుతం రమేష్‌బాబు భౌతికకాయాన్ని ఏఐజీ మార్చురీలో ఉంచారు. ఈ ఉదయం ఇంటికి తీసుకెళ్లనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

రమేష్‌బాబు 1974లో బాలనటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. అల్లూరి సీతారామరాజు, మోసగాళ్లకు మోసగాడు, దేవుడు చేసిన మనుషులు చిత్రాల్లో బాలనటుడిగా నటించి తండ్రి వారసత్వాన్ని చాటారు. కొంత విరామం తర్వాత నీడ చిత్రంతో వయసులో ఉన్న కుర్రాడి పాత్రలో నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఆ చిత్రం అనంతరం కొన్నేళ్లు గ్యాప్‌ తీసుకొని సామ్రాట్‌ చిత్రంతో కథనాయకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ విరామం మధ్యలో డిగ్రీ పూర్తిచేసినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. నా ఇల్లే నా స్వర్గం, అన్నా చెల్లెలు, పచ్చతోరణం, ముగ్గురు కొడుకులు, సామ్రాట్‌, చిన్ని కృష్ణుడు, కృష్ణగారి అబ్బాయి, బజార్‌ రౌడీ, కలియుగ కర్ణుడు, బ్లాక్‌ టైగర్‌, ఆయుధం, కలియుగ అభిమన్యుడు చిత్రాల్లో నటించారు. చివరిగా తండ్రి కృష్ణతో కలిసి ఎన్‌కౌంటర్‌ చిత్రంలో నటించారు. తండ్రి కృష్ణ, సోదరుడు మహేష్‌బాబుతో కలిసి పలు చిత్రాల్లో రమేష్‌బాబు నటించాడు. 1997 నుంచి నటనకు దూరంగా ఉన్న రమేష్‌బాబు 2004లో నిర్మాతగా మారారు. అర్జున్‌, అతిథి సినిమాలు నిర్మించారు. రమేష్‌బాబు మొత్తం 17 చిత్రాల్లో నటించారు. మొదటి నుంచి కథానాయకుడు కావాలని ఉన్నప్పటికీ డిగ్రీ పూర్తి చేశాకే సినిమాల్లోకి వచ్చేందుకు తన తండ్రి కృష్ణ నుంచి పూర్తి గ్రీన్‌సిగ్నల్‌ వచ్చినట్లు రమేష్‌బాబు ఒక సందర్భంలో చెప్పారు. కథనాయకుడిగా ఎదగడానికి కుటుంబ సభ్యులందరూ ప్రోత్సహించారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. రమేష్‌బాబుకు భార్య మృదుల, పిల్లలు భారతి, జయకృష్ణ ఉన్నారు. 

రమేష్‌బాబు మృతి పట్ల ఘట్టమనేని కుటుంబం ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. రమేష్‌బాబు మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా శ్రేయోభిలాషులందరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని కోరుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దహన సంస్కారాల సమయంలో అభిమానులు గుమిగూడకుండా ఉండాలని సూచించారు. 

పవన్‌ కల్యాణ్‌ సంతాపం

రమేష్‌బాబు మృతి పట్ల జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. ఆయన కుటంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కృష్ణ నట వారసుడిగా చిత్ర నిర్మాణంలో రమేష్‌బాబు విజయాలు సాధించారని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. రమేష్‌బాబు కుటుంబ సభ్యులకు మనోస్థైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిన్నట్లు పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని