Ginna: నా మనసుకు దగ్గరైన చిత్రం ‘జిన్నా’

‘ఢీ’ కంటే పది రెట్లు మిన్నగా ‘జిన్నా’ విజయం సాధిస్తుందనేది నా నమ్మకం అన్నారు ప్రముఖ నటుడు మోహన్‌బాబు. ఆయన సమర్పణలో, తనయుడు మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తూ స్వీయ నిర్మాణంలో రూపొందిన చిత్రం ‘జిన్నా’.

Updated : 17 Oct 2022 20:05 IST

మంచు విష్ణు

‘ఢీ’ (Dhee) కంటే పది రెట్లు మిన్నగా ‘జిన్నా’ (Ginna) విజయం సాధిస్తుందనేది నా నమ్మకం అన్నారు ప్రముఖ నటుడు మోహన్‌బాబు (MohanBabu). ఆయన సమర్పణలో, తనయుడు మంచు విష్ణు (Manchu Vishnu) కథానాయకుడిగా నటిస్తూ స్వీయ నిర్మాణంలో రూపొందిన చిత్రం ‘జిన్నా’. పాయల్‌ రాజ్‌పూత్‌ (Payal Rajput), సన్నీలియోన్‌ (Sunny Leone) కథానాయికలు. ఇషాన్‌ సూర్య దర్శకుడు. ఈ నెల 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఆదివారం హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుక జరిగింది. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ ‘‘నా మనసుకు చాలా దగ్గరగా ఉంటుందీ చిత్రం. నా కూతుళ్లు అరియానా వివియానా తొలిసారి ఇందులో పాట పాడార’’న్నారు. మోహన్‌బాబు మాట్లాడుతూ ‘‘ఏ సినిమాకీ కష్టపడనంతగా ఈ సినిమా కోసం సాహసోపేతమైన సన్నివేశాల్లో నటించాడు విష్ణు. తను మంచి హీరో, మంచి వ్యక్తి. నాగేశ్వర్‌రెడ్డి కథతో ఓ చిత్రం చేద్దామని కోన వెంకట్‌ చెప్పారు. దర్శకుడిగా సూర్యని తనే సూచించాడు. అందరూ కష్టపడి పనిచేశారు. మా మనవరాళ్లతో ఈ సినిమాలో పాట పాడించాడు అనూప్‌. వాళ్లు చాలా బాగా పాడార’న్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘రెండో చిత్రమే ఇంత పెద్ద సినిమా చేసే అవకాశాన్నిచ్చిన మోహన్‌బాబు, విష్ణులకి నా కృతజ్ఞతలు. దర్శకుడు శ్రీనువైట్ల దగ్గర పనిచేసినప్పుడు నా గురించి  కోన వెంకట్‌కి తెలుసు. ఆయనే నన్ను మోహన్‌బాబు దగ్గరికి తీసుకెళ్లారు. నాపై నమ్మకంతో ఏ రోజూ నన్ను ప్రశ్నించకుండా సహకారం అందించారు. ఇందులో విష్ణు టైమింగ్‌ బాగుంటుంది. ఛోటా కె.నాయుడు, ప్రభుదేవా, ప్రేమ్‌రక్షిత్‌, సెల్వ, కెచా, రామకృష్ణ, అనూప్‌ రూబెన్స్‌ వంటి సీనియర్‌ సాంకేతిక నిపుణులతో కలిసి పనిచేసే అవకాశం ఈ చిత్రంతో లభించింద’’న్నారు. కోన వెంకట్‌ మాట్లాడుతూ ‘‘అన్నయ్య మోహన్‌బాబు నాపై పెట్టిన బాధ్యత ఈ సినిమా. దీంతో మా గుమ్మంలోకి మళ్లీ ఒక విజయం రావాలని వదిన నిర్మల చెప్పారు. మేమందరం తపించి పనిచేశాం. ప్రతి నటుడికి జీవితంలో రెండో ఇన్నింగ్స్‌ ఉంటుంది. విష్ణు కెరీర్‌కి ఈ సినిమా ఓ గొప్ప ఇన్నింగ్స్‌ అవుతుంది. మంచి బృందం తోడైంది’’ అన్నారు. కార్యక్రమంలో అలీ, సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌, జి.నాగేశ్వర్‌రెడ్డి, ఛోటా కె.నాయుడు, భాను, నందు, కిరణ్‌, రామకృష్ణ, ఛోటా కె.ప్రసాద్‌, దివి, చమ్మక్‌చంద్ర, ఈశ్వర్‌రెడ్డి, గౌతంరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ వేదికపై మనవడు అవ్రామ్‌ భక్తతో కలిసి ఆడిపాడారు మోహన్‌బాబు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని