Ginna trailer: నవ్వులు పూయించేలా ‘జిన్నా’ ట్రైలర్‌

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ‘జిన్నా’ (GINNA). అక్టోబర్‌ 21న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.  

Published : 05 Oct 2022 13:40 IST

హైదరాబాద్‌: ‘‘నాకు దుడ్లు ముఖ్యమే కానీ, నా అనుకున్న వాళ్లు దుడ్లు కన్నా ఎక్కువ ముఖ్యం’’ అని అంటున్నారు మంచు విష్ణు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘జిన్నా’లోని డైలాగ్‌ ఇది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం దసరా కానుకగా బుధవారం విడుదల చేసింది. హారర్‌ కామెడీ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా ట్రైలర్‌ ఆద్యంతం నవ్వులు పూయించేలా ఉంది. విష్ణు, సద్దాం, చంద్ర కామెడీ టైమింగ్‌, అన్నపూర్ణ సంభాషణలు అలరించేలా ఉన్నాయి.

‘‘నెలనెలా వడ్డీ కట్టించుకొనే నీకే అంత ఉంటే కట్టేవాళ్లం మాకెంత ఉండాలి’’, ‘‘జిన్నా అంటే పొయ్యి మీద కరిగే వెన్న కాదురా. లోడ్‌ చేసిన గన్‌.. టచ్‌ చేస్తే దీపావళే’’ అంటూ సద్దాం చెప్పే డైలాగ్‌లు మెప్పిస్తున్నాయి. ఈ చిత్రంతో సూర్య దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం కానున్నారు. కోన వెంకట్‌ ఈ చిత్రానికి కథ అందించారు. పాయల్‌ రాజ్‌పుత్‌, సన్నీలియోనీ కథానాయికలు. మోహన్‌బాబు సమర్పణలో విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 21న ‘జిన్నా’ విడుదల కానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని