RenuDesai: వాళ్లని ప్రశ్నించండి.. నన్ను కాదు

సాయం కోరుతూ కొంతమంది వ్యక్తులు తనకి పెడసరి ధోరణిలో మెస్సేజ్‌లు పెడుతున్నారని నటి రేణూదేశాయ్‌ అన్నారు. రేణూ సరిగ్గా సాయం చేయడం లేదంటూ, తన సహాయ కార్యక్రమాల గురించి ప్రశ్నిస్తూ...

Published : 21 May 2021 00:59 IST

ఆగ్రహానికి లోనైన నటి

హైదరాబాద్‌: సాయం కోరుతూ తాము చేసిన మెస్సేజ్‌లకు సరైన సమయంలో రేణూ స్పందించడం లేదంటూ కొంతమంది వ్యక్తులు మెస్సేజ్‌లు పెడుతున్నారని నటి రేణూదేశాయ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లోనే ఉంటున్న రేణూ గత కొన్నిరోజుల నుంచి పలువురు కొవిడ్‌ బాధితులకు చేయూతనందిస్తున్న విషయం విదితమే. కాగా, తాజాగా ఓ నెటిజన్‌.. కొవిడ్‌ ఆసుపత్రుల విషయంలో సాయం చేయమని కోరుతూ రేణూకి మెస్సేజ్‌ పెట్టాడు. కాకపోతే ఆమె ఆ సందేశానికి ఏవిధంగానూ స్పందించలేదు. దీంతో ఆగ్రహానికి లోనైన నెటిజన్‌.. ‘మేడమ్‌ సాయం చేస్తున్నా అన్నారు. ఎక్కడ చేస్తున్నారండి మీరు.. సాయం. డబ్బున్న వాళ్లనే మీరు పట్టించుకుంటారు కానీ మాలాంటి మధ్య తరగతి వాళ్లని  పట్టించుకోరు’ అని సందేశం పంపించాడు. కాగా, నెటిజన్‌ పంపిన సందేశం పట్ల ఆమె అసంతృప్తి చెందారు. తనని ప్రశ్నించాల్సిన అవసరం ఎవరికీ లేదని.. కావాలంటే రాజకీయ నాయకుల్ని ప్రశ్నించమని ఆమె అన్నారు.

‘సుమారు 10-12 రోజుల నుంచి నిరంతరంగా కొవిడ్‌ బాధితులకు నాకు చేతనైనంత సాయం చేస్తున్నాను. నేను ఏమీ రాజకీయ నాయకురాలినో లేదా మీరు ఎన్నుకున్న నేతనో కాదు.. మీరు నన్ను ప్రశ్నించడానికి!! మీరు ఎవరికైతే ఓట్లు వేశారో వెళ్లి వాళ్లని ప్రశ్నించండి!! సాయం కోరుతూ కొంతమంది వ్యక్తులు పెడసరి ధోరణితో నాకు మెస్సేజ్‌లు పెడుతున్నారు. వాటి వల్ల కొన్నిసార్లు సాయం చేయాలనే స్ఫూర్తి పోతుంది. ఒకవేళ నేను కనుక మీ మెస్సేజ్‌కు స్పందించకపోతే దయచేసి నాకు మరొకసారి సందేశాన్ని పంపించండి. ఎందుకంటే చేయూతనందించమంటూ నాకు ఎంతోమంది మెస్సేజ్‌లు చేస్తున్నారు. దానివల్ల కొన్నిటిని నేను చూడలేకపోతున్నాను’ అని రేణూ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని