GodFather: చిరంజీవి ‘గాడ్‌ఫాదర్‌’.. ఫ్యాన్సీ ధరకు డిజిటల్‌ రైట్స్‌!

చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘గాడ్‌ఫాదర్‌’

Published : 20 Sep 2022 13:16 IST

హైదరాబాద్‌: చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘గాడ్‌ఫాదర్‌’ (Godfather). నయనతార, సత్యదేవ్‌, సల్మాన్‌ఖాన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్‌ బిజినెస్‌ పూర్తి కాగా, తాజాగా ఓటీటీ రైట్స్‌ ఫ్యాన్సీ ధరకు విక్రయమయ్యాయి. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ డిజిటల్‌ రైట్స్‌ను దక్కించుకుంది. తెలుగు, హిందీ కలిపి నెట్‌ఫ్లిక్స్‌ రూ.57కోట్లు చెల్లించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘గాడ్‌ఫాదర్‌’  (Godfather) ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. దసరా కానుకగా అక్టోబరు 5న విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసే పనిలో ఉంది చిత్ర బృందం. సాధారణంగా చిరంజీవి సినిమా అంటే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంటుంది. కానీ, ‘ఆచార్య’ ఫలితం నేపథ్యంలో ‘గాడ్‌ఫాదర్‌’ యూనిట్‌ ఆచితూచి అడుగులు వేస్తోంది. అనంతపురం వేదికగా ప్రీరిలీజ్‌ వేడుకను నిర్వహించనున్నారు. ఇప్పటికే వేదికను కూడా ఖరారు చేశారు. అయితే, ఈవెంట్‌ ఎప్పుడు నిర్వహిస్తారు? ముఖ్య అతిథిగా ఎవరు వస్తారు? అన్నది తెలియాల్సి ఉంది.

మోహన్‌లాల్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రల్లో నటించిన మలయాళ సూపర్‌హిట్‌ ‘లూసిఫర్‌’ రీమేక్‌గా ‘గాడ్‌ఫాదర్‌’ వస్తోంది. చిరంజీవి స్టార్‌డమ్‌కు సరిపోయేలా మోహన్‌రాజా కథలో చిన్న చిన్న మార్పులు చేశారు. అదనపు ఆకర్షణ తీసుకొచ్చేందుకు మలయాళంలో పృథ్వీరాజ్‌ పోషించిన పాత్రను తెలుగులో సల్మాన్‌తో చేయిస్తున్నారు. చిరంజీవి సోదరి పాత్రలో నయనతార కనిపించనున్నారు. ప్రతినాయకుడి పాత్రలో సత్యదేవ్‌ కనిపించనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని