GoodLuck Jerry Review: రివ్యూ: గుడ్‌లక్‌ జెర్రీ

జాన్వీ కపూర్‌ ప్రధాన పాత్ర పోషించిన ‘గుడ్‌లక్‌ జెర్రీ’ సినిమా ఎలా ఉందంటే?

Updated : 29 Jul 2022 16:55 IST

GoodLuck Jerry review చిత్రం: గుడ్‌లక్‌ జెర్రీ; నటీనటులు: జాన్వీ కపూర్‌, దీపక్‌ దోబ్రియాల్‌, మితా వశిష్ఠ్‌, సమతా సుదీక్ష, నీరాజ్‌ సూద్‌, సుశాంత్‌ సింగ్‌, సాహిల్‌ మెహతా తదితరులు; సంగీతం: అమన్‌ పంత్‌ (నేపథ్య సంగీతం), పరగ్‌ ఛబ్రా (పాటలు); ఛాయాగ్రహ‌ణం: రంగరాజన్‌ రామభద్రన్‌; కూర్పు: ప్రకాశ్‌ చంద్రా సాహూ, జుబిన్‌ షేక్‌; నిర్మాణ సంస్థలు: లైకా ప్రొడక్షన్స్, కలర్‌ ఎల్లో ప్రొడక్షన్స్‌, మహవీర్‌ జైన్‌ ఫిల్మ్స్‌; దర్శకత్వం: సిద్ధార్థ్‌ సేన్‌గుప్త; విడుద‌ల‌: డిస్నీ+ హాట్‌స్టార్‌ (Disney+ Hotstar).

నయనతార (Nayanathara) కెరీర్‌లో సూపర్‌ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో ‘కోలమావు కోకిల’ (Kolamaavu Kokila) ఒకటి. నాయికా ప్రాధాన్యంగా 2018లో వచ్చిన ఈ సినిమా తమిళ, తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇదే సినిమా హిందీలో జాన్వీ కపూర్‌ (Janhvi Kappor) ప్రధాన పాత్రలో ‘గుడ్‌లక్‌ జెర్రీ’ (GoodLuck Jerry) పేరుతో రీమేక్‌ అయింది. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్నా, థియేటర్‌లో విడుదల కాకుండా నేరుగా ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’లో విడుదలైంది. మరి, జాన్వీ.. నయన్‌ పాత్రకు న్యాయం చేసిందా? తెలుసుకునే ముందు కథేంటో చూద్దాం..

ఇదీ కథ: జయ కుమారి అలియాస్‌ జెర్రీ (జాన్వీ కపూర్‌) మధ్యతరగతి అమ్మాయి. తండ్రి చనిపోవడంతో కుటుంబ భారాన్ని తన భుజాలపై వేసుకుంటుంది. మసాజ్‌ సెంటర్‌లో పనిచేస్తూ తల్లి (మితా వశిష్ఠ్‌), చెల్లి (సమతా సుదీక్ష)ని పోషిస్తుంది. ఎంతో సరదాగా ఉండే ఈ కుటుంబానికి ఊహించని సమస్య ఎదురవుతుంది. జెర్రీ తల్లి.. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ బారిన పడుతుంది. చికిత్సకు 25 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో జెర్రీ ఆ మొత్తాన్ని సమకూర్చేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో తన ప్రమేయం లేకుండానే డ్రగ్స్‌ సరఫరా చేసే ఓ ముఠా చేతుల్లో చిక్కుకుంటుంది. వారెందుకు జెర్రీని టార్గెట్‌ చేశారు?  ఆ చీకటి వ్యాపారం నుంచి ఆమె ఎలా తప్పించుకుంది? తన తల్లి ఆరోగ్యం బాగుపడిందా? అన్నది మిగతా కథ.

ఎలా ఉందంటే: కొత్త కథను తెరకెక్కించడం కంటే వేరే భాషలో హిట్‌ అయిన సినిమాను రీమేక్‌ చేయడం కష్టమనేది చాలామంది దర్శకులు చెప్పేమాట. పలువురు ప్రేక్షకులు మాతృక చిత్రాన్ని చూసుంటారు కాబట్టి కథేంటో ముందే తెలిసిపోతుంది. ఆయా పాత్రలు ఎలా ఉంటాయో అర్థమైపోతుంది. దాంతో రీమేక్‌లు చేసే దర్శకుడు, నటులు మరింత శ్రద్ధ చూపాల్సి వస్తుంది. ‘గుడ్‌లక్‌ జెర్రీ’ థీమ్‌ ‘కోలమావు కోకిల’దే అయినా ఉత్తరాది ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కొన్ని మార్పులు చేశారు. ‘కోలమావు కోకిల’ చూడని వారికి ఈ సినిమా మంచి అనుభూతి కలిగిస్తుంది. పంజాబ్‌ నేపథ్యంలో సాగే ఈ కథ ఇది. జెర్రీ కుటుంబ పరిచయం, జెర్రీని- ఆమె చెల్లిని ప్రేమిస్తున్నామంటూ ఇద్దరు యువకులు వారి వెంట పడటం, జెర్రీ మత్తు పదార్థాలు రవాణా చేసే బృందానికి చిక్కడం తదితర సన్నివేశాలో ప్రథమార్ధం సరదాగా సాగుతుంది. ఆ తర్వాతే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. డ్రగ్స్‌ ముఠా నుంచి బయటపడేందుకు జెర్రీ వేసిన స్కెచ్‌ ద్వితీయార్ధంలో థ్రిల్‌ పంచుతుంది. డ్రగ్స్‌ దందా సజ్జెక్ట్‌కి కామెడీని జతచేయడమే ఓ సవాలు. ఈ విషయంలో దర్శకుడు విజయం సాధించారు. ఓ వైపు జెర్రీ పరిస్థితి ఏమవుతుందోననే ఉత్కంఠను ప్రేక్షకుల్లో రేకెత్తిస్తూనే మరోవైపు కామెడీ సన్నివేశాలతో ఎక్కడా బోర్‌ కొట్టకుండా కథను నడిపించిన తీరు మెప్పిస్తుంది. హీరోలే కాదు హీరోయిన్లతోనూ ఇలాంటి స్టోరీలను డీల్‌ చేయొచ్చని నిరూపించారు. దేని కోసమైతే జెర్రీ అన్ని ఇబ్బందుల్లో పడుతుందో ఆ అంశాన్ని ఎలివేట్‌ చేయలేదనే భావన ప్రేక్షకుడికి కలుగుతుంది. ఈ స్మగ్లింగ్‌ గ్యాంగ్‌లో ఓ బాస్‌, అతని కింద మరొకడు, తర్వాత సప్లయిర్‌, డిస్ట్రిబ్యూటర్‌.. ఇలా చాలా పాత్రలు ఉండటంతో స్పష్టత లోపించింది. ఈ బృందంలోని ఓ పాత్ర జెర్రీని పోలీసులకు పట్టించే ప్రయత్నం చేస్తాడు. అలా ఎందుకు చేయాలనుకుంటాడో చూపించపోవడంతో సందేహం తలెత్తుతుంది. క్లైమాక్స్‌ను మాతృకుకు విభిన్నంగా చిత్రీకరించిన విధానం ఆకట్టుకుంటుంది. అదే ఈ టైటిల్‌కు జస్టిఫికేషన్‌ ఇస్తుంది.

ఎవరెలా చేశారంటే: నటన విషయంలో జాన్వీ ఈ సినిమాతో మరో మెట్టెక్కింది. జెర్రీ అనే పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఆహార్యం, హావభావాలతో మిడిల్‌ క్లాస్‌ అమ్మాయిగా ఒదిగిపోయింది. సీనియర్‌ నటి మితా వశిష్ఠ్‌.. జెర్రీ తల్లిగా కనిపించి, మంచి మార్కులు కొట్టేశారు. మాతృకలో నయనతారను ప్రేమించే వ్యక్తిగా నవ్వులు పంచే యోగిబాబు పాత్రలో దీపక్‌ దోబ్రియాల్‌ సందడి చేశారు. డ్రగ్స్‌ గ్యాంగ్‌ పాత్రలు పోషించిన ప్రతి ఒక్కరూ  మేరకు ఆకట్టుకున్నారు. ఇలాంటి ఉత్కంఠభరిత కథలకు నేపథ్యం సంగీతం ప్రధానబలంగా నిలుస్తుంది. అమన్‌ పంత్‌ బీజీఎంతో సన్నివేశాలను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఓ ఇల్లు, బస్సు, వ్యాన్ల ప్రయాణానికి సంబంధించిన కథకు ఆ మూడ్‌ ఎలివేట్‌ అయ్యాలే సినిమాటోగ్రఫీ బాగుంది. దర్శకుడు సిద్ధార్థ్‌ సేన్‌గుప్తా టేకింగ్‌ బాగుంది. ఈ వీకెండ్‌లో ఓటీటీలో ఏదైనా కొత్త చిత్రం చూడాలంటే ‘గుడ్‌లక్‌ జెర్రీ’ ప్రయత్నించవచ్చు. (తెలుగు ఆడియో ఇచ్చి ఉంటే మరింత బాగుండేది.)

బ‌లాలు

+ జాన్వీ కపూర్‌ నటన

+ నేపథ్య సంగీతం

+ కామెడీ

బ‌ల‌హీన‌త‌లు

- ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాలు

డ్రగ్స్‌ గ్యాంగ్‌ పాత్రల్లో స్పష్టత లోపించడం

చివ‌రిగా:  ‘గుడ్‌ లక్‌ జెర్రీ’.. జాన్వీ ప్రయాణం.. నటన బాగున్నాయి.

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని