Veera Simha Reddy: అప్పుడు రైలు.. ఇప్పుడు కారు.. ఆ సన్నివేశంపై గోపిచంద్‌ మలినేని క్లారిటీ

Veera Simha Reddy: వీరసింహారెడ్డి చిత్రంలో కాలితో కారుని తన్నే సీన్‌పై దర్శకుడు గోపిచంద్‌ మలినేని స్పష్టతనిచ్చారు.

Updated : 22 Jan 2023 17:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy). శ్రుతిహాసన్‌ (Shruti Haasan) కథానాయిక. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మరోసారి బాలకృష్ణ సంక్రాంతి హీరోగా అదరగొట్టారు. యాక్షన్‌ సన్నివేశాలకు అభిమానులు ఫిదా అయిపోయారు. అయితే, ఓ సన్నివేశంలో బాలకృష్ణ తన కాలితో కారును తంతే, వెనక్కి వెళ్తుంది. దీనిపై సామాజిక మాధ్యమాల వేదికగా ట్రోల్స్‌ మొదలయ్యాయి.‘పలనాటి బ్రహ్మనాయుడు’లో తొడగొడితే రైలు వెనక్కి వెళ్లిన సన్నివేశంతో పోల్చి మీమ్స్‌ కూడా చేయడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో గోపిచంద్‌ మలినేని స్పష్టతనిచ్చారు. ఈ సీన్‌పై ట్రోల్‌ చేయాల్సిన అవసరం లేదని అన్నారు.

‘‘వీరసింహారెడ్డి పాత్ర గొడ్డలితో కారు ముందు నిలబడినప్పుడు అందులో ఉన్న వాళ్లు రివర్స్‌ గేర్‌ వేసి వెనక్కి వెళ్లాలనుకుంటారు. అయితే, కారు వెనుక చక్రం మట్టిలో కూరుకుపోయి ఉంటుంది. బాలకృష్ణగారు డైలాగ్‌ చెప్పిన తర్వాత కాలితో కారును తంతారు. దీంతో మట్టిలో దిగబడిపోయిన కారు టైరు పైకి లేస్తుంది. అప్పటికే కారు రివర్స్‌ గేర్‌లో ఉంది కదా! అప్పుడది వెనక్కి వెళ్లకుండా ముందుకు వస్తుందా? మీరే చెప్పండి. దాన్ని ట్రోల్‌ చేయాల్సిన అవసరం లేదు. మీమ్స్‌ చేసేవాళ్లు రకరకాలుగా చేస్తారు. బాలకృష్ణగారితో చర్చించే ఈ సీన్‌ తీశా’’ అని గోపీచంద్‌ మలినేని అన్నారు. ఇక ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్‌, దునియా విజయ్‌ తమ నటనతో మెప్పించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని