Updated : 01 Jul 2022 16:08 IST

Pakka Commercial Review: రివ్యూ: పక్కా కమర్షియల్‌

Pakka Commercial Review: చిత్రం: పక్కా కమర్షియల్‌; నటీనటులు: గోపిచంద్‌, రాశీఖన్నా, సత్యరాజ్‌, రావు రమేశ్‌, అజయ్‌ ఘోష్‌, సప్తగిరి, తదితరులు; సంగీతం: జేక్స్ బిజోయ్; సినిమాటోగ్రఫీ: కర్మ్‌ చావ్లా; ఎడిటింగ్‌: ఎస్‌.బి.ఉద్ధవ్‌; నిర్మాత: బన్నీ వాసు; నిర్మాణ సంస్థలు: యూవీ క్రియేషన్స్‌, జీఏ2 పిక్చర్స్‌; రచన, దర్శకత్వం: మారుతి; విడుదల తేదీ: 1-07-2022

గోపిచంద్‌(Gopi chand) అంటే యాక్షన్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌. దర్శకుడు మారుతీది సెపరేట్‌ ట్రాక్‌. కుటుంబ కథలకు కామెడీ, కీలక పాత్రలకు ఏదో ఒక సమస్యతో ముడి పెట్టి సినిమాలను తెరకెక్కించి సక్సెస్‌ కొట్టడంలో సిద్ధహస్తులు. అలాంటి వీరి కాంబినేషన్‌లో వచ్చిన మూవీ ‘పక్కా కమర్షియల్‌’(Pakka commercial). రాశీఖన్నా(raashi khanna) కథానాయిక. మరి ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? యాక్షన్‌ హీరో గోపిచంద్‌ను మారుతి ఎలా చూపించారు?‘పక్కా కమర్షియల్‌’ అని టైటిల్‌ ఎందుకు పెట్టారు?

క‌థేంటంటే: సూర్య‌నారాయ‌ణ (స‌త్య‌రాజ్‌) ఓ న్యాయ‌మూర్తి.  స‌రైన సాక్ష్యాధారాలు లేక‌పోవ‌డంతో చేసేదేమీ లేక ఓ కేసులో బాధితురాలికే జ‌రిమానా విధిస్తాడు. నేరం చేసిన వివేక్ (రావు ర‌మేష్‌) ఆ కేసులో గెలుస్తాడు. బాధితురాలికి న్యాయం చేయ‌లేక‌పోయాన‌ని కుమిలిపోతాడు సూర్య‌నారాయ‌ణ‌. నిందితుల‌కే న్యాయం జ‌రుగుతుండ‌టాన్ని చూసి జీర్ణించుకోలేని ఆయ‌న త‌న వృత్తి నుంచి వైదొలుగుతాడు. కిరాణాకొట్టుని న‌డుపుతూ జీవితం సాగిస్తుంటాడు.  సూర్య‌నారాయ‌ణ కొడుకు ల‌క్కీ (గోపిచంద్‌)(Gopi chand) కూడా తండ్రిలాగే న‌ల్ల‌కోటే ధ‌రిస్తాడు. కాక‌పోతే తండ్రిలా  కాదు, ఇత‌ను ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ లాయ‌ర్‌. డ‌బ్బు కోసం విలువ‌ల్ని సైతం ప‌క్క‌న‌పెడ‌తాడు. ఓ  కేసు విష‌యంలో తండ్రీ కొడుకుల మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ త‌లెత్తుతుంది. బాధితుడి ప‌క్షాన నిల‌వ‌డం కోసం ఎప్పుడో వ‌దిలిపెట్టిన న‌ల్ల‌కోటుని మ‌ళ్లీ ధ‌రిస్తాడు సూర్య‌నారాయ‌ణ‌. త‌న కొడుకుతోనే కోర్టులో పోరాటానికి దిగుతాడు. మ‌రి ఈ వైరం ఎక్క‌డిదాకా సాగింది? (Pakka Commercial Review) చివ‌రికి విలువ‌ల్నే న‌మ్ముకున్న తండ్రి గెలిచాడా లేక‌, ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ అయిన త‌న‌యుడు గెలిచాడా? తాను న‌టిస్తున్న సీరియ‌ల్ కోసం లా కూడా చ‌దివేసిన లాయ‌ర్ ఝాన్సీ  క‌థేమిటన్న‌ది మిగ‌తా సినిమా.

ఎలా ఉందంటే: తండ్రీ కొడుకుల క‌థ ఇది. ఆ ఇద్ద‌రు ఎంచుకున్న దారులు, వాళ్ల భావ‌జాలం వేరు. అలాంట‌ప్పుడు ఓ సంఘ‌ర్ష‌ణ త‌లెత్తుతుంది. ఆ నేప‌థ్య‌మే మారుతి ఈ క‌థ‌ని రాయ‌డానికి మూలమై ఉంటుంది.  కానీ, ఆయ‌న ఆ విష‌యాన్నే నిర్ల‌క్ష్యం చేశాడు. ప్ర‌తి చోటా కామెడీపైనే దృష్టిపెట్టినా, అది ఆశించిన స్థాయిలో పండ‌లేదు. దాంతో అటు తండ్రీ కొడుకుల బంధం,  ఇటు కామెడీ... రెండింటిలో ఏదీ పెద్ద‌గా  ప్ర‌భావం చూపించలేదు. సినిమాలో కామెడీ ఉంటే బాగుంటుంది కానీ, సినిమానే కామెడీగా మార్చేస్తే ఇక ప్రేక్ష‌కుడు ఆ క‌థ‌లో లీన‌మ‌య్యేదెప్పుడు?  కామెడీ కోసం స‌న్నివేశం నుంచి బ‌య‌టికొచ్చి మ‌రీ న‌వ్విస్తాడ‌ని మారుతికి పేరుంది. ఒక ట్రాక్ వ‌ర‌కూ, ఒక‌ట్రెండు స‌న్నివేశాల వ‌రకూ అది ప‌ర్వాలేదేమో కానీ, ఆ ప్ర‌య‌త్నం ఇందులో మ‌రింత‌గా శ్రుతిమించింది. క‌థ‌లో ఎక్క‌డా ప్రేక్ష‌కుడిని లీనం చేయ‌నీయ‌కుండా, భావోద్వేగాలు పండేచోట కూడా ఆ స‌న్నివేశాల్ని కామెడీ చేసేయ‌డంతో సినిమా ప‌ట్టుద‌ప్పింది. కొత్త‌ద‌నం లేని క‌థ, అదీ ఏ దిశ‌లో ప్ర‌యాణం చేస్తుందో ఆరంభంలోనే తెలిసిపోతుంది.

కానీ మారుతి త‌న మార్క్ కామెడీతో సినిమాని ఎక్క‌డో ఒక చోట మ‌ళ్లీ ట్రాక్  ఎక్కిస్తాడ‌నే ఓ భ‌రోసా ఉంటుంది. రాశిఖ‌న్నా పాత్ర ఎంట్రీ త‌ర్వాత పండిన కొన్ని న‌వ్వుల‌తో సినిమా ట్రాక్ ఎక్కిన‌ట్టే అనిపిస్తుంది. కానీ, ఆ త‌ర్వాత స‌న్నివేశాలు రిపీటెడ్‌గానే అనిపిస్తాయి త‌ప్ప కొత్త‌దనం లేదు. లాయ‌ర్ ఝాన్సీగా రాశిఖ‌న్నా పాత్ర‌తో మ‌రీ అతి చేయించ‌డం, స‌త్య‌రాజ్ చెప్పాల్సిన సంభాష‌ణ‌ల్ని కూడా ఆమెతో చెప్పించ‌డంతో తండ్రీ కొడుకుల బంధం నీరుగారిపోతుంది. కోర్ట్ రూమ్ నేప‌థ్యం ఉంది  కాబ‌ట్టి వాద ప్ర‌తివాద‌న‌లు, డ్రామా అయినా ఆక‌ట్టుకుంటాయేమో అనుకుంటే ఆ స‌న్నివేశాల్లో కూడా బ‌లం క‌నిపించ‌దు. ప్ర‌థ‌మార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం పర్వాలేద‌నిపిస్తుంది.  రావు ర‌మేష్ - అజ‌య్ ఘోష్ మ‌ధ్య కొన్ని స‌న్నివేశాలు మారుతి మార్క్ వినోదంతో సంద‌డి చేయిస్తాయి.  ప‌తాక స‌న్నివేశాల్లో మ‌లుపు సినిమాకి కీల‌కం. అక్క‌డ క‌థానాయ‌కుడితో చెప్పించిన విష‌యాలు బాగున్నాయి.

ఎవ‌రెలా చేశారంటే: గోపిచంద్ న్యాయ‌వాదిగా క‌నిపించిన విధానం బాగుంది. స్టైలిష్‌గా చూపించారు. రాశిఖ‌న్నాతో క‌లిసి అక్క‌డ‌క్క‌డా కామెడీ పండించారు. స‌త్య‌రాజ్ పాత్రలో బ‌లం లేదు.  రావుర‌మేష్ న‌ట‌న ద్వితీయార్ధంలో  ఆక‌ట్టుకుంటుంది. రాశిఖ‌న్నా  పేజీల కొద్దీ డైలాగులు చెప్పింది. ఎంత సీరియ‌ల్ న‌టి పాత్ర అయినా ప్ర‌తీ చోటా ఒక ర‌క‌మైన బిల్డ‌ప్‌తో క‌నిపించ‌డం అంత‌గా మెప్పించ‌దు. అజ‌య్ ఘోష్‌, స‌ప్త‌గిరి, వైవా హ‌ర్ష, శ్రీనివాస‌రెడ్డి, ప్రవీణ్ త‌దిత‌రులు అక్కడక్కడా న‌వ్వించారు. సియా గౌతం, వరలక్ష్మి శరత్ కుమార్  ప్రాధాన్యం లేని పాత్రల్లో కనిపించారు. సాంకేతికంగా సినిమా ప‌ర్వాలేద‌నిపిస్తుంది. జేక్స్ బిజోయ్ బాణీలు రెండు పాటల్లో మెప్పిస్తాయి. క‌ర్మ్ చావ్లా కెమెరా ప‌నిత‌నం బాగుంది. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో  కంటే కూడా.. ఆయ‌న ర‌చ‌నలో చాలా లోపాలు క‌నిపిస్తాయి. గ‌త సినిమాల త‌ర‌హాలో భావోద్వేగాల‌పై ప‌ట్టు ప్ర‌ద‌ర్శించ‌లేక‌పోయారు. కామెడీ కోసం ఆయ‌న చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. నిర్మాణం ప‌రంగా లోటేమీ క‌నిపించ‌దు. 

బ‌లాలు

+ కొన్ని కామెడీ సన్నివేశాలు

+ పతాక సన్నివేశాలు

బ‌ల‌హీన‌త‌లు

- క‌థ‌, కథనాల్లో బ‌లం లేక‌పోవడం

- భావోద్వేగాలు పండకపోవటం

చివ‌రిగా: ‘పక్కా కమర్షియల్‌’.. కామెడీ ఆర్టిఫిషియల్‌..

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని