సాహిత్య మారుతి... గొల్లపూడి

ఆయన ఒక కథా రచయిత, ఒక నవలా రచయిత, ఒక రంగస్థల నాటక రచయిత, ఒక వక్త, ఒక పాత్రికేయుడు, ఒక సినిమా రచయిత, ఒక సినిమా నటుడు, ఒక బుల్లితెర ప్రయోక్త. ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీరావు. ఈ-టీవీ వారు నిర్వహించిన ‘ప్రతిధ్వని’

Published : 11 Jan 2021 18:57 IST

ఆయన ఒక కథా రచయిత, ఒక నవలా రచయిత, ఒక రంగస్థల నాటక రచయిత, ఒక వక్త, ఒక పాత్రికేయుడు, ఒక సినిమా రచయిత, ఒక సినిమా నటుడు, ఒక బుల్లితెర ప్రయోక్త. ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీరావు. ఈ-టీవీ వారు నిర్వహించిన ‘ప్రతిధ్వని’ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా, ‘మనసున మనసై’, ‘ప్రజావేదిక’, ‘వేదిక’, ‘సినీ సౌరభాలు’ వంటి ప్రాయోజిత కార్యక్రమాలకు కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించారు. నటుడిగా ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’, ‘యముడికి మొగుడు’, ‘స్వాతి ముత్యం’, ‘స్వాతి’, ‘ఆలయ శిఖరం’, ‘అభిలాష’, ‘గణపతి’, ‘ఎవరిగోల వారిది’, ‘ప్రేమలు పెళ్ళిళ్ళు’ వంటి 290 సినిమాలకు పైగా నటించారు. వెండి తెరమీద విలన్‌గా, క్యారక్టర్‌ నటుడుగా ఎన్నో అద్భుతమైన పాత్రలకు ప్రాణం పోసిన దివంగత నటుడు మారుతీరావు గురించిన కొన్ని విషయాలు..

తొలి జీవన ప్రస్థానం...

మారుతీరావు పుట్టింది ఏప్రిల్‌ 14, 1939న విజయనగరంలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో. ఆయన తల్లిదండ్రులు అన్నపూర్ణ, సుబ్బారావు. మారుతీరావు ఆయన తల్లిదండ్రులకు ఐదవ సంతానం. చిన్నతనం నుంచే కళారంగం వైపు ఆయన అడుగులు వేశారు. విశాఖపట్నంలోని సి.బి.ఎం హైస్కూలు, ఎ.వి.ఎన్‌ కళాశాలతోబాటు ఆంధ్రా విశ్వవిద్యాలయంలో మారుతీరావు విద్యాభ్యాసం సాగింది. ఆంధ్ర సారస్వత పరిషత్తు విశాఖపట్నం నుంచి బి.ఎస్సీ ఆనర్స్‌ పూర్తిచేశారు. కాలేజీ రోజుల్లోనే నాటకాలు రాసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన రాసిన తొలి కథ ‘ఆశాజీవి’ (1954). రాఘవ నికేతన్‌ పేరుతో మారుతీరావు ఒక నాటక సంస్థను నడిపేవారు. తద్వారా ఆది, కుక్కపిల్ల దొరికింది, స్వయంవరం, వాపస్, మహానుభావులు వంటి నాటకాలో నటిస్తూ దర్శకత్వం కూడా వహించేవారు. కొంతకాలం పాత్రికేయుడిగా సేవలందించిన మారుతీరావు 1959లో ఆంద్రప్రభ పత్రికలో ఉపసంపాదకుడుగా జీవన ప్రస్థానం ప్రారంభించారు. తరువాత ఆకాశవాణిలో రేడియో ప్రసార అధికారిగా ఎంపికై హైదరాబాదు, విజయవాడ కేంద్రాలలో పనిచేశారు. 1961 నవంబరు 11న మారుతీరావు శివకామసుందరిని హనుమకొండలో వివాహమాడారు. వారికి ముగ్గురు సంతానం. వారు సుబ్బారావు, రామకృష్ణ, శ్రీనివాస్‌. తరువాత కార్యక్రమ నిర్వాహకుడుగా పదోన్నతి పొంది ఒడిశా రాష్ట్రంలోని సంభల్పూర్, మద్రాసు, కడప కేంద్రాలలో పనిచేశారు. 1981లో ఆకాశవాణి, కడప కేంద్రంలో పదోన్నతి పొంది రెండు దశాబ్దాలపాటు సహాయ స్టేషన్‌ డైరెక్టర్‌గా సేవలందించారు. ఆయన తొమ్మిది నాటకాలు, పద్దెనిమిది నాటికలు, పన్నెండు నవలలు, నాలుగు బౌండ్‌ పుస్తకాల నిండా కథలు, అసంఖ్యాకంగా వ్యాసాలు రాశారు. సాంఘిక, రాజకీయ సమస్యలను తూర్పార బడుతూ గత ఇరవై నాలుగేళ్ళుగా ‘జీవన కాలమ్‌’ అనే ధారావాహికను వారం వారం నిర్వహిస్తూ వచ్చారు. ఈ ధారావాహికలు ఆంధ్రజ్యోతి, వార్త వంటి దినపత్రికలలో కనిపించేవి. తెలుగు సాహిత్యం మీద మారుతీరావు రాసిన అనేక పరిశోధనాత్మక రచనలు, నాటకాలు తెలుగు రాష్ట్రాలలోని పలు విశ్వవిద్యాలయాలలో పాఠ్యాంశాలుగా వినియోగంలో ఉన్నాయి.

సినీరంగ ప్రస్థానం...

ప్రతాప్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ నిర్మాత కె.రాఘవ 1982లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో ‘ఇంట్లో రామయ్య - వీధిలో కృష్ణయ్య’ అనే కుటుంబ కథా చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమా 22, ఏప్రిల్, 1982లో విడుదలై ఢంకా మోగించింది. అటు కోడి రామకృష్ణకు, ఇటు గొల్లపూడి మారుతీరావు ఇద్దరికీ ఇదే తొలిచిత్రం కావడం విశేషం. చిరంజీవి, మాధవి, పూర్ణిమ, సంగీత, అన్నపూర్ణ ప్రధాన తారాగణంగా నిర్మించిన ఈ చిత్రంలో ఒకలాంటి విలన్‌ పాత్రను గొల్లపూడి మారుతీరావు పోషించారు. ‘వీడొట్టి సుబ్బారావోయ్‌’ అనే ఊతపదాన్ని ఉచ్చరిస్తూ హీరోయిన్‌ మీద కన్నేసి చిరంజీవి సంసారంలో కలతలు సృష్టించే పాత్ర అది. దర్శకుడు దాసరి నారాయణరావు శిష్యుడుగా చాలా సినిమాలకు పనిచేసిన కోడి రామకృష్ణ, ఒక అద్భుత కథకు శ్రీకారం చుట్టి దాసరి సహకారంతో నిర్మాత రాఘవను మెప్పించగలిగారు. ఇందులో వినూత్న విలన్‌ ‘సుబ్బారావు’ పాత్రకు గొల్లపూడి మారుతీరావును తీసుకుందామని రాఘవ ప్రతిపాదించారు. తొలుత మారుతీరావు సినిమా నటనమీద పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే ఈ చిత్రానికి సంభాషణలు మారుతీరావే రాయాల్సి రావడంతో వేషం కూడా కట్టాల్సి వచ్చింది. సినిమా షూటింగ్‌ పాలకొల్లులో మొదలైంది. క్లైమాక్స్‌ దృశ్యాలను ముఖ్యంగా బోట్‌ ప్రయాణ దృశ్యాలను అంతర్వేదిపాలెంలోను, తరువాత చిరంజీవి ఇంటిలోనూ చిత్రీకరించారు. సినిమా బ్లాక్‌ బస్టర్‌గా నిలిచి మారుతీరావుకు విలన్‌ గా మంచిపేరు తెచ్చిపెట్టింది. ఈ చిత్రాన్ని నిర్మాత పంజు అరుణాచలం మణివన్నన్‌ దర్శకత్వంలో ‘వీట్టుల రామన్‌ వెలియిల కృష్ణన్‌’ పేరుతో పునర్నిర్మించారు. అలాగే హిందీలో ‘ఘర్‌ మే రామ్‌ గలీ మే శ్యామ్’ పేరుతో పునర్నిర్మించారు..

అన్నపూర్ణా సంస్థలో...

‘ఇద్దరు మిత్రులు’ సినిమా నిర్మాణ సమయంలోనే నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు ‘కాలాతీత వ్యక్తులు’ అనే నవలను చదివారు. రచయిత్రి డా।। పి.శ్రీదేవిని పిలిపించి ఆ నవలను సినిమాగా తీస్తే ఎలా వుంటుందనే విషయాన్ని చర్చించారు. ఆ నవల కథాంశం సినిమాకు పనికిరాదని గ్రహించి, చదువుకుంటున్న ఆడపిల్లల సమస్యల నేపథ్యంలో ఒక కథను అల్లమని ఆమెతో చెప్పారు. ఆ సబ్జెక్టు చర్చల స్థాయిలో ఉండగానే శ్రీదేవి కాలం చెయ్యడంతో, త్రిపురనేని గోపీచంద్‌ చేత మాటలు, యద్దనపూడి సులోచనారాణి చేత స్క్రీప్లే రాయించి ‘చదువుకున్న అమ్మాయిలు’ సినిమా నిర్మించారు. అయితే, పూర్తి నిడివి నవలా చిత్రాన్ని తీయాలనే ఆలోచన దుక్కిపాటిని వదలలేదు. 1962లో ఆంధ్రప్రభ వారు శుభకృత్‌ సంవత్సర ఉగాది నవలలపోటీ నిర్వహిస్తే కోడూరి కౌసల్యాదేవి నవల ‘చక్రభ్రమణం’కి ప్రథమ బహుమతి లభించింది. న్యాయనిర్ణేతల సంఘంలో సభ్యుడుగా వ్యవహరించిన దుక్కిపాటి స్నేహితుడు గోపీచంద్‌ ఈ నవలను సినిమాగా తీస్తే నవలా చిత్రాన్ని తీయాలనుకుంటున్న ఆశయం కూడా నెరవేరుతుందని సలహాయిచ్చి, ఆ నవల హక్కులు కొనమన్నారు. దుక్కిపాటి నిర్ణయం తీసుకోవటంలో జాప్యం జరిగింది. ఈలోగా ఆ నవల మార్కెట్లో విడుదలై విపరీతమైన జనాదరణ పొందింది. పాఠకులు దానిని సినిమాగా తీస్తే ఏయే నటీనటులు ఆయా పాత్రలకు సరిపోతారో సూచిస్తూ అన్నపూర్ణా సంస్థకు అసంఖ్యాకంగా ఉత్తరాలు రాశారు. అప్పుడు దుక్కిపాటి రాజమండ్రి వెళ్లి ఆ నవల హక్కుల్ని కొని, కౌసల్యాదేవినే సినిమాకి సంభాషణలు రాయవలసిందిగా కోరారు. ఇరవై యేళ్ళుకూడా నిండని ఆమెను మద్రాసు పంపడం ఇష్టం లేదని ఆమె తల్లిదండ్రులు తేల్చిచెప్పడంతో, ఆచార్య ఆత్రేయతో మాటలు రాయించారు. సగటు ప్రేక్షకుడికి అర్ధమయ్యేలా ఉండాలని కౌసల్యాదేవే ఈ సినిమాకి ‘డాక్టర్‌ చక్రవర్తి’ అనే పేరును సూచించారు. చక్రభ్రమణం నవల ధారావాహికంగా వెలువడినప్పుడు ఆంధ్రప్రభలో సబ్‌-ఎడిటరుగా పనిచేసిన మారుతీరావుకు ఆ నవల గురించి సంపూర్ణ అవగాహన వుండటం చేత, స్క్రీన్‌ప్లే బాధ్యతలు అతనికి అప్పజెప్పారు. నిజానికి స్క్రీన్‌ప్లే రచనలో కె.విశ్వనాథ్‌, ఆదుర్తి, దుక్కిపాటి కూడా పాలుపంచుకున్నా, మారుతీరావు ప్రతిభను ప్రోత్సహించాలని టైటిల్‌ కార్డులో ఆయన పేరు మాత్రమే వేశారు. అప్పట్లో హైదరాబాదు ఆకాశవాణిలో పనిచేస్తున్న మారుతీరావు సినీ ప్రస్థానం ఈ సినిమాతోనే మొదలైంది. ఈ సినిమా 1963లో విడుదలై విజయవంతంగా ఆడింది.

తల్లిదండ్రులు తమ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి, తమ ఆశయాలకు అనుగుణంగా వారిని సమాజం మెచ్చేలా మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని తాపత్రయపడుతుంటారు. అయితే పిల్లలకు కూడా సొంత అభిప్రాయాలుంటాయి. అవి సంఘర్షణకు దారి తీస్తుంటాయి. తమ మాట నెగ్గించుకోవాలని పెద్దలు, తమ వ్యక్తిత్వం నిలుపుకోవాలని పిల్లలు పోటీపడుతుంటారు. ఈ సంఘర్షణల మధ్య ఆస్తులు, అంతస్తులు బలీయమైన శక్తులుగా పనిచేస్తాయి. అవి అంత త్వరగా లొంగవు. కానీ, వీటన్నిటికంటే అంతఃకరణ, ఆత్మగౌరవం ప్రధానమని తెలియజెప్పిన గొప్ప చిత్రాన్ని అన్నపూర్ణా పిక్చర్స్‌ వారు ‘ఆత్మగౌరవం’ పేరుతో 1966లో నిర్మించారు. ‘డాక్టర్‌ చక్రవర్తి’ చిత్రం తరువాత అన్నపూర్ణా వారు నిర్మించిన చిత్రమిది. కథ తయారయ్యాక, సంభాషణలను భమిడిపాటి రాధాకృష్ణతో కలిసి మారుతీరావు రాశారు. ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి, గొల్లపూడి మారుతీరావు కలిసి ‘ఆత్మగౌరవం’ సినిమాకు కథను సమకూర్చారు. సులోచనారాణి ఆ సినిమా అనుకరణకు గొల్లపూడికి సహకరించింది. 1964లో ‘నంది’ బహుమతులను ప్రవేశపెట్టిన తర్వాత 1966లో ‘ఆత్మగౌరవం’ చిత్రానికి కాంస్య నంది లభించగా, ఉత్తమ కథా రచనకు గొల్లపూడి మారుతీరావు, యద్దనపూడి సులోచనా రాణిలకు సంయుక్తంగా ‘నంది’ బహుమతి లభించింది.

ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ ఎం.వి.రఘు 1988లో ‘కళ్ళు’ సినిమాకు దర్శకత్వం వహించారు. అంధుల జీవితాల నేపథ్యంలో నిర్మించిన ఈ చిత్రానికి మారుతీరావుకథ, మాటలు సమకూర్చగా శివాజీరాజా, చిదంబరం, రాజేశ్వరి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం విభాగాలలో నంది బహుమతులు లభించాయి. ఇండియన్‌ పనోరమాలో ప్రదర్శనకు నోచుకున్న ఈ చిత్రానికి మారుతీరావుతో సహా ముప్పై బహుమతులకు పైగా వచ్చాయి. 1990లో వచ్చిన శ్రీ గాయత్రీ కళాచిత్ర వారి ‘మాస్టారు కాపురం’ సినిమాకు కూడా గొల్లపూడి సంభాషణలు సమకూర్చారు. రాజేంద్రప్రసాద్, గాయత్రి జంటగా నటించిన ఈ చిత్రానికి కూడా మారుతీరావుకు నంది బహుమతి దక్కింది. అందులో జార్జి పాత్రను మారుతీరావు పోషించారు. ఈ చిత్రాలు కాకుండా ‘దొరబాబు’, ‘రైతుకుటుంబం’, ‘ఓ సీత కథ’, ‘అన్నదమ్ముల అనుబంధం’, ‘శుభలేఖ’ వంటి సినిమాలకు మారుతీరావు రచయితగా పనిచేశారు. రావి కొండలరావు దర్శకత్వంలో నిర్మించిన ‘కన్యాశుల్కం’ టెలివిజన్‌ సీరియల్‌లో మారుతీరావు గిరీశం పాత్రను పోషించి మెప్పించారు. ఈ ధారావాహికకు తొమ్మిది విభాగాలలో నంది బహుమతులు లభించాయి.

మరిన్నివిశేషాలు...

* 1992 మారుతీరావు చిన్న కుమారుడు శ్రీనివాస్‌ తొలిప్రయత్నంగా ‘ప్రేమపుస్తకం’ అనే సినిమా నిర్మించి దర్శకత్వం వహిస్తూ ప్రమాద వశాత్తు సముద్రంలో పడి మరణించాడు. ఆ చిత్రాన్ని మారుతీరావు పూర్తి చేశారు. మారుతీరావు తన కుమారుని జ్ఞాపకార్థం ఒక జాతీయ అవార్డును నెలకొల్పారు. తద్వారా ప్రతి ఏటా ఒక దర్శకునికి ఈ అవార్డు కింద లక్షా యాభైవేల రూపాయలు పారితోషికంతోబాటు, బంగారు జ్ఞాపికను బహూకరించడం మొదలెట్టారు. ఆ సందర్భంగా సినిమాకు సంబంధించిన యేదేని విషయం మీద ఉపన్యాసం చేసిన వారికి గౌరవసూచకంగా పదిహేను వేలరూపాయలు ‘శ్రీనివాస్‌ మెమోరియల్‌ లెక్చర్‌’ పేరుతో బహూకరిస్తున్నారు. సునీల్‌ దత్, నసీరుద్దీన్‌ షా, మృణాల్‌ సేన్, శ్యామ్‌ బెనగల్, జావేద్‌ అఖ్తర్, అనుపమ్‌ ఖేర్‌ మొదలైన వారు ఈ అవార్డును అందుకున్నారు. మారుతీరావు కుమారులిద్దరూ ట్రావెల్‌ ఏజెన్సీ నడుపుతున్నారు.

* 2002లో మారుతీరావుకు రాజాలక్ష్మీ ఫౌండేషన్‌ అవార్డు దక్కింది. ‘కళ్ళు’ నాటకానికి ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఈ నాటకాన్ని అన్ని భారతేయ భాషల్లోకి నేషనల్‌ బుక్‌ ట్రస్టు వారు అనువదింపజేశారు. ఈ నాటకం ఉస్మానియా విశ్వవిద్యాలయ ఎం.ఎ. (తెలుగు) విద్యార్థులకు పాఠ్యపుస్తకంగా నిర్దేశించారు. ఉత్తమ హాస్యరచనకు మారుతీరావుకు ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ వారి ‘సర్వారాయ మెమోరియల్‌’ అవార్డు కింద బంగారు పతకాన్ని ప్రదానం చేశారు. రామాయణంలో భాగవతం సినిమాలో ఉత్తమ నటుడిగా శంకర్‌ దయాళ్‌ శర్మచే పురస్కార ప్రదానం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘కళారత్న’ అవార్డును కూడా ప్రదానం చేసింది. జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థలో సభ్యునిగా మారుతీరావు వ్యవహరించారు. 1978లో మద్రాసులో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఆకాశవాణి తరఫున సమీక్షకునిగా మారుతీరావు వ్యవహరించారు.

- ఆచారం షణ్ముఖాచారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని