Published : 11 Jan 2021 18:57 IST

చిత్రసీమకు ‘గురువుగారు’!


 

సినిమాకి ‘కెప్టెన్‌ ఆఫ్‌ ది షిప్‌..’ దర్శకుడే అని అందరూ చెబుతారు. కానీ అదే నిజం అని చేతల్లో చూపించిన దర్శక శిఖరం... దాసరి నారాయణరావు. వెండితెరపై కథానాయకులుగా మెరుస్తూ ఓ ఇమేజ్‌ని ఏర్పాటు చేసుకొంటేనే స్టార్‌ అవుతారు కదా? తెర వెనక ఉంటూ మెగాఫోన్‌కే పరిమితమయ్యే దర్శకులకి ఆ స్థాయి గుర్తింపు ఎక్కడ సాధ్యం? ముమ్మాటికీ సాధ్యమే అంటూ ఓ స్టార్‌గా వెలిగిన దర్శకరత్నం... దాసరి. ఈరోజు ఆయన వర్ధంతి మే 30న. ఈ సందర్భంగా దాసరి గురించి కొన్ని విశేషాలు...

కథానాయకులకే కథానాయకుడిగా, తెరపై మెరిసే అగ్ర తారల్ని మించిపోయే స్థాయిలో ఆయన ఇమేజ్‌ కనిపించిందంటే దాసరి ప్రత్యేకత ఏమిటో చెప్పొచ్చు. అందుకే తెలుగు సినిమాని దాసరికి ముందు... దాసరి తరువాత అని విడదీసి చూస్తుంటారు. అప్పటిదాకా కథానాయకుల వెనకాలే కాన్వాయ్‌లు చూడటం తెలుసు. కానీ దాసరి విజయాల పరంపర తరువాత ఆయన మద్రాసు నుంచి హైదరాబాద్‌ వస్తున్నాడంటే విమానంలో డజను కార్లతో ఓ కాన్వాయ్‌ సిద్ధంగా ఉండేదంటే ఆ వైభవం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

మేరునగధీరుల్లాంటి ఎంత మంది దర్శకులున్నా... అపురూపమైన ఎన్నెన్నో చిత్రరాజాలు తీసినా... దర్శకుడికి స్టార్‌ హోదా తీసుకొచ్చి, కెప్టెన్‌ కుర్చీకి ఓ కొత్త కళని తీసుకొచ్చిన ఘనత మాత్రం నిస్సందేహంగా దాసరిదే. అందుకే ఆయన పరిశ్రమకి ‘గురువుగారు’ అయ్యారు. సినీ పరిశ్రమలో ఎవరికి ఏ సమస్య వచ్చినా గురువుగారి తలుపు తట్టడమే తెలుసు. కథానాయకులకే కథానాయకుడిగా, తెరపై మెరిసే అగ్ర తారల్ని మించిపోయే స్థాయిలో ఆయన ఇమేజ్‌ కనిపించిందంటే దాసరి ప్రత్యేకత ఏమిటో చెప్పొచ్చు.

అందుకే తెలుగు సినిమాని దాసరికి ముందు.

తెలుగు సినిమా కథని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుడు దాసరి. ఆయన సినిమాల్లో సామాన్యుడే కథానాయకుడు. వారి కష్టాలే కథలు. ఈతి బాధలే కథనం. అందుకే ఆయన సినిమాలు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొన్నాయి. మా సమస్యలతో సినిమాలు తీసే దర్శకుడు అంటూ దాసరిని అభిమానించడం మొదలుపెట్టారు. సమస్యలతో సినిమా అంటే డాక్యుమెంటరీలనే ఊహిస్తాం. కానీ వాటిలోనూ తనదైన శైలిలో వాణిజ్యాంశాల్ని జోడించి సినిమాలు తీశారు దాసరి. సమాజంలో అవినీతి, మహిళలపై చిన్నచూపు, అమ్మ ప్రాధాన్యత, బంధాలు, అనుబంధాలు... ఇలా జీవితాల్లోని కోణాల్నే వెండితెరపై స్పృశించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్‌లాంటి ఉద్ధండుల సినీ జీవితాల్ని మలుపు తిప్పేలా చిత్రాల్ని తీసిన ఘనత ఆయనది. తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ పలు చిత్రాలు తెరకెక్కించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొన్నారు. సినిమా నిర్మాణంతో పాటు, టెలివిజన్‌ రంగంలోనూ నిర్మాతగా, రచయితగా, దర్శకుడిగా రాణించారు.

పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లులో 1944 మే 4న సాయిరాజు, మహాలక్ష్మి దంపతులకి జన్మించిన దాసరి నారాయణరావు 1973లో హాస్యనటుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తరువాత రచయితగా, సహాయ దర్శకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, పంపిణీదారుడిగా ప్రతి విభాగంలోనూ రాణించారు. ఆయనకి ఇద్దరు కుమారులు తారక ప్రభు, అరుణ్‌ కుమార్‌తోపాటు ఒక కుమార్తె ఉన్నారు. సుదీర్ఘమైన దాసరి సినీ ప్రయాణంలో అడుగడుగునా తోడునీడగా నిలిచిన భార్య దాసరి పద్మ 2011లో మరణించారు.

* అడుగడుగునా కష్టాలే...

సామాన్యుడి జీవితాల్నే కథా వస్తువులుగా చేసి సినిమాల్ని తెరకెక్కించడానికి దాసరి జీవిత నేపథ్యం కూడా ఓ కారణమే అంటుంటారు చాలామంది. దాసరి నారాయణరావు ఏడో తరగతిలో ఉండగానే తండ్రి చేస్తున్న వ్యాపారంలో నష్టపోవడంతో కుటుంబాన్ని కష్టాలు చుట్టుముట్టాయి. దాంతో అయిష్టంగానే చదువుకి స్వస్తి చెప్పి ఓ వడ్రంగి దగ్గర కూలి పనిలో చేరారు. చదువుల్లో చురుకైన దాసరి కూలీ పని చేస్తుండడాన్ని గమనించిన క్లాసు టీచరు చేరదీసి, స్థానికంగా కొంతమంది నుంచి ఆర్థిక సహాయాన్ని సేకరించి ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి దాకా చదివించారు. ఆ తరువాత మళ్లీ చదువులు ఆగిపోవడంతో హైదరాబాద్‌ చేరుకొని చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు. తిరిగి నర్సాపురం వెళ్లి డిగ్రీ పూర్తి చేశారు. కాకినాడలో ఎస్‌.ఎన్‌.బ్రదర్స్‌ సంస్థలో చేశాక, అదే సంస్థకి చెందిన హైదరాబాద్‌ కార్యాలయంలో అసిస్టెంట్‌ మేనేజర్‌గానూ పనిచేశారు. తర్వాత హిందూస్థాన్‌ ఏరో నాటికల్స్‌లో ఛీప్‌ సూపరింటెండ్‌కి కార్యదర్శిగా పనిచేశారు.

* నాటకాలపై మక్కువతో...

చిన్నప్పట్నుంచే నాటకాలపైనా, సాహిత్యంపైనా మక్కువ పెంచుకొన్న దాసరి ఏడో తరగతిలోనే ‘నేనూ.. నా స్కూలు’ పేరుతో 15 నిమిషాల నాటిక రాశారు. 1962లో ప్రణాళికా ప్రచారంపై హైదరాబాదులో జరిగిన నాటక పోటీలో రాష్ట్ర ఉత్తమ నటుడిగా బహుమతి పొందారు. 1960వ దశకంలోనే శ్రీ క్షీరారామ ఆర్ట్స్‌ థియేటర్‌ స్థాపించి పలు ప్రదర్శనలిచ్చారు. ‘పన్నీరు-కన్నీరు’, ‘పద్మశ్రీ’, ‘యథార్థవాది’, ‘ఏప్రిల్‌ ఫూల్స్‌’, ‘నలిగిన రోజా’, ‘దేశం కోసం’ నాటకాలు రచించారు. దాసరి ప్రదర్శనల్ని చూసి హృషీకేష్‌ పిక్చర్స్‌ అధినేత వై.వి.కృష్ణయ్య ‘అందం కోసం పందెం’ చిత్రంలో ప్రధాన హాస్యనటుడి పాత్రని ఇచ్చారు. ఆ చిత్రం కోసం మద్రాసు వెళ్లడానికి హిందూస్థాన్‌ ఏరో నాటికల్స్‌లో రెండు నెలలు సెలవు అడిగితే ఇవ్వలేదు. దాంతో ఉద్యోగానికి రాజీనామా చేసి మద్రాసు వెళ్లిపోయారు. కేవలం ఆ పాత్రతోనే సరిపెట్టుకోకుండా ఆ చిత్రానికి సహాయ దర్శకుడిగా, ప్రొడక్షన్‌ మేనేజరుగా కూడా పనిచేశారు. దాసరి తపనని గమనించిన హృషీకేష్‌ పిక్చర్స్‌ మేనేజర్‌ నారాయణస్వామి ఇచ్చిన సలహాతో బి.ఎన్‌.రెడ్డి తీస్తున్న ‘రంగుల రాట్నం’కు రచయితగా పనిచేస్తున్న పాలగుమ్మి పద్మరాజు దగ్గర సహాయకుడిగా చేరారు. ఆయన దగ్గరే రచనకి సంబంధించిన మెలకువల్ని నేర్చుకొన్నారు. అదే సమయంలో టైపిస్టుగా, అకౌంటెంట్‌గా, హిందీ, తెలుగు ట్యూషన్‌ మాస్టర్‌గా కూడా పనిచేశారు.

* తొలి అవకాశం...

గౌరి ప్రొడక్షన్స్‌ భావనారాయణ తాను తీస్తున్న ‘పర్వతాలు పానకాలు’ చిత్రానికి రచయితగా దాసరికి తొలి అవకాశం ఇచ్చారు. అయితే ఆ సినిమా నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. ఆ తరువాత ‘మహమ్మద్‌ బిన్‌ తుగ్లక్‌’, ‘జగత్‌ కిలాడీలు’, ‘జగజ్జెట్టీలు’, ‘దేవాంతకులు’, ‘స్నేహబంధం’ సినిమాలకి కథకుడిగా, సంభాషణల రచయితగా వ్యవహరించారు. గౌరి ప్రొడక్షన్స్‌లోనే ‘మా నాన్న నిర్దోషి’ చిత్రానికి తొలిసారిగా సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఆపైన సావిత్రి, భీమ్‌సింగ్, వేదాంతం రాఘవయ్య, కె.వి.నందనరావు, లక్ష్మీదీపక్‌ల వద్ద దర్శకత్వ శాఖలో పనిచేశారు. భీమ్‌సింగ్‌ దగ్గర స్థిరపడ్డ సమయంలోనే ‘తాత మనవడు’ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం వచ్చింది. నిర్మాత కె.రాఘవ నిర్మించిన ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో దాసరి నారాయణరావు పేరు మార్మోగిపోయింది. ఆ తరువాత అవకాశాలు, విజయాలు వరుసకట్టాయి. 1973 నుంచి దర్శకుడిగా కొనసాగుతున్న ఆయన 151 చిత్రాల్ని తెరకెక్కించారు. సుమారు 60కి పైగా చిత్రాల్లో నటించారు. మాటల రచయితగా, పాటల రచయితగా దాసరికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 1978లో తారక ప్రభు ఫిలింస్‌ పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. మొట్ట మొదటగా జయసుధ కథానాయికగా ‘శివరంజని’ తెరకెక్కించారు. ఇక ఆ తరువాత వెనుదిరిగి చూసుకోలేదు. 53 చిత్రాల్ని నిర్మించారాయన. నటుడిగా కూడా దాసరి చిత్ర పరిశ్రమపై తిరుగులేని ప్రభావం చూపించారు. ‘ఈ పాత్రని మరొకరు చేయలేరని అనుకొన్న ప్రతిసారీ నేనే మేకప్‌ వేసుకొని కెమెరా ముందుకొస్తుంటా’ అని చెప్పేవారు దాసరి. ‘ఎమ్మెల్యే ఏడుకొండలు’, ‘పోలీసు వెంకటస్వామి’, ‘ఆత్మ బంధువు’, ‘మామ అల్లుడు’, ‘అమ్మ రాజీనామా’, ‘సూరిగాడు’, ‘మామగారు’, ‘రగులుతున్న భారతం’, ‘ఒసేయ్‌ రాములమ్మా’, ‘కంటే కూతుర్నే కను’, ‘మేస్త్రి’, ‘హిట్లర్‌’ తదితర చిత్రాల్లో దాసరి అత్యుత్తమ నటనని ప్రదర్శించారు. దాసరి సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో ఆణిముత్యాల్లాంటి పలు సినిమాలు తెరకెక్కించారు దాసరి. ‘తాత మనవడు’, ‘ఎవరికి వారే యమునా తీరే’, ‘రాధమ్మ పెళ్ళి’, ‘తిరుపతి’, ‘స్వర్గం నరకం’, ‘బలిపీఠం’, ‘భారతంలో ఒక అమ్మాయి’, ‘శివరంజని’, ‘గోరింటాకు’, ‘నీడ’, ‘సర్దార్‌ పాపారాయుడు’, ‘శ్రీవారి ముచ్చట్లు’, ‘మేఘసందేశం’, ‘శివరంజని’, ‘ప్రేమాభిషేకం’, ‘తాండ్రపాపారాయుడు’, ‘బొబ్బొలిపులి’, ‘ఎమ్మెల్యే ఏడుకొండలు’, ‘కంటే కూతుర్నే కను’, ‘తిరుగుబాటు’, ‘మజ్ను’, ‘అమ్మ రాజీనామా’, ‘ఒరేయ్‌ రిక్షా’, ‘ఒసేయ్‌ రాములమ్మా’ తదితర చిత్రాలు తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి. తాను తెరకెక్కించిన ‘బొబ్బిలిపులి’, ‘సర్దార్‌ పాపారాయుడు’ చిత్రాలే ఎన్టీఆర్‌ రాజకీయ రంగ ప్రవేశానికి బాటలు వేశాయని చెప్పేవారాయన. 1983లో దాసరి తెరకెక్కించిన ‘మేఘ సందేశం’ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి తొమ్మిది నంది పురస్కారాలు లభించాయి. కేంద్రప్రభుత్వం ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా రజత కమలం అందుకుంది. ఇదే చిత్రానికిగానూ ఉత్తమ సంగీత దర్శకుడిగా రమేష్‌ నాయుడు, ఉత్తమ గాయకుడిగా జేసుదాసు, ఉత్తమ గాయనిగా సుశీలకి జాతీయ పురస్కారాలు లభించాయి. 1999లో స్వయంగా నిర్మించి తెరకెక్కించిన ‘కంటే కూతుర్నే కను’ చిత్రానికి జాతీయ పురస్కారంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డు కూడా లభించాయి.

* పరిశ్రమనిండా శిష్యగణమే

చిత్ర పరిశ్రమలో దాసరిని ప్రేమతో ‘గురువుగారూ...’ అని సంబోధించేవాళ్లే ఎక్కువ. ఆ పిలుపుకు తగ్గట్టుగానే పరిశ్రమలో దాసరి శిష్యగణం కనిపిస్తుంటుంది. దర్శకుల్లోనూ, నటుల్లోనూ, నిర్మాతల్లోనూ... ఇలా ఎక్కడ చూసినా దాసరి శిష్యులే కనిపిస్తుంటారు. వందకిపైగా సినిమాలు చేసిన కోడి రామకృష్ణతోపాటు, రవిరాజా పినిశెట్టి, కె.మురళీమోహన్‌రావు, రేలంగి నరసింహారావు, ధవళ సత్యం, కె.ఎస్‌.రవికుమార్, సురేష్‌కృష్ణ, సత్యానాయుడు తదితర ప్రముఖులంతా కూడా దాసరి శిష్యులే. నటుల్లో మోహన్‌బాబు, అన్నపూర్ణమ్మ, ఈశ్వరరావు, ఆర్‌.నారాయణమూర్తి తదితర ప్రముఖులు కూడా దాసరి చిత్రాలతో పరిచయమైనవాళ్లే. వందల సంఖ్యలో నటీనటులు, సాంకేతిక నిపుణులకి అవకాశాల్ని కల్పించి జీవితాన్నిచ్చారు దాసరి. అందుకే ఆయనంటే పరిశ్రమలో అందరికీ గురుభక్తి. నటులుగా ఎంత ఎత్తుకి ఎదిగినా గురువుగారూ.. అంటూ దాసరి దగ్గరికి వెళ్లడం ఆయన శిష్యులకి అలవాటు. 

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని