తలకట్టు కనికట్టు... కోడి రామకృష్ణ

  ఎప్పుడూ తెల్లని దుస్తులు... దర్శకత్వం చేస్తున్నప్పుడు మాత్రం తలకో కట్టు. ఆ కట్టుతోనే కనికట్టు చేసి తన సినిమాల్ని విజయవంతం చేసుకున్నారాయన. హెడ్‌ బాండ్‌ లేని కోడి రామకృష్ణను ఊహించలేం. షూటింగ్‌ స్పాట్‌కి వచ్చిన ఆయన నుదుటి చుట్టూ ఓ కట్టు కడితే 

Published : 11 Jan 2021 19:46 IST

ఇన్‌స్పైర్‌ అవొచ్చు... ఇమిటేట్‌ చేయకూడదు. ఫ్రేమ్‌ మార్చొచ్చు... వేంకటేశ్వరుడి బొమ్మ మార్చకూడదు. కన్విక్షన్‌ మార్చకూడదు... డెకరేషన్‌ మార్చుకోవచ్చు. సెంటిమెంట్‌ మారకూడదు. డైనింగ్‌ టేబుల్‌ మీద తినే డిష్‌ మారకూడదు. డిష్‌ మాత్రం మన నేటివిటీకి తగ్గట్లు అదే ఆవకాయ, పప్పు, అన్నం ఉండాలి. - దర్శకుడు కోడి రామకృష్ణ.

ఎప్పుడూ తెల్లని దుస్తులు... దర్శకత్వం చేస్తున్నప్పుడు మాత్రం తలకో కట్టు. ఆ కట్టుతోనే కనికట్టు చేసి తన సినిమాల్ని విజయవంతం చేసుకున్నారాయన. హెడ్‌ బాండ్‌ లేని కోడి రామకృష్ణను ఊహించలేం. షూటింగ్‌ స్పాట్‌కి వచ్చిన ఆయన నుదుటి చుట్టూ ఓ కట్టు కడితే చాలు... ఆయనలోని దర్శకుడు అలర్ట్‌ అయిపోయినట్లే. సీన్‌ పేపర్‌ చూడడం...చక చకా చిత్రీకరించడం...అదీ ఆయన స్టైల్‌. దర్శకుడిగా కోడి రామకృష్ణకి ఎంత పేరు వచ్చిందో...అంతకు మించిన పేరు ఆయన తలకట్టుకి కూడా వచ్చింది. తలకట్టు లేకుండా బయటకి వెళ్లిన సందర్భాల్లో ప్రేక్షకులు ఆయనని గుర్తు పట్టేందుకు కాస్త అవస్థ పడేవారు. తీరా గుర్తు పట్టిన తరువాత వారు అడిగే మొదటి ప్రశ్న...తలకట్టు ఏమైనది సార్‌? అది పెట్టుకోండి... అంటూ సలహా కూడా ఇచ్చేవారట. వాళ్లు అలా ప్రశ్నించే సరికి తలకట్టుపై తనకే అసూయ కలిగేదని కోడి రామకృష్ణ పలుమార్లు చెప్పేవారు.

దర్శకత్వం వహించే మొదటి రెండు సినిమాల్లో తలకట్టు లేకుండానే ఆయన పనిచేశారు. తరువాత వేసవిలో మిట్ట మధ్యాహ్నం వేళ షూటింగ్‌ చేస్తుండగా... ఎండ వేడిమి తట్టుకోవడానికిగానూ ఓ వ్యక్తి సలహా మేరకు తలకి చుట్టుకోవడం... తర్వాతర్వాత సెంటిమెంట్‌గా మారిపోయిందని చెప్పుకునేవారు. తలకట్టు లేకుండా ఆయన్ని చూడడం...యూనిట్లో పనిచేసేవారికి కూడా అసౌకర్యంగా ఉండేదట. ఒత్తిడి చేసి మరీ తలకట్టును ప్రోత్సహించారట. ఇదీ... కోడి రామకృష్ణ తలకట్టు కథా కమామిషు.

130కి పైగా సినిమాలు

దర్శకుడు దాసరి నారాయణరావు శిష్యుడిగా చిత్ర రంగ ప్రవేశం చేసి...కోడి రామకృష్ణ గురువులాగే అనతికాలంలోనే సెంచరీ పూర్తి చేసి 130కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన తొలి చిత్రం ‘ఇంట్లో రామయ్య.. వీధిలో కృష్ణయ్య’. ఈ చిత్రంలో చిరంజీవి కథానాయకుడిగా నటించారు. మాధవి, పూర్ణిమ, పి.ఎల్‌.నారాయణ నటించిన ఈ చిత్రం ద్వారా రచయిత గొల్లపూడి మారుతీరావు నటుడిగా తెర పరిచయమయ్యారు. ఆ చిత్రం విజయవంతమైన తరువాత ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలతో బిజీగా మారిపోయారు. అన్ని రకాల చిత్రాలకూ దర్శకత్వం వహించడంతో ఆయన సిద్ద హస్తుడు. ఓ పక్క కుటుంబ చిత్రాలకి దర్శకత్వం వహిస్తూనే...మరోపక్క రాజకీయ చిత్రాలు, సామజిక స్పృహ కలిగిన చిత్రాలకి కూడా దర్శకుడిగా పనిచేశారు. అంతే కాదు.. ఎప్పటికప్పుడు అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను అంది పుచ్చుకుని గ్రాఫిక్స్‌లో కూడా భారీ చిత్రాలు తీసి ఔరా! అనిపించుకున్నారు.

వైవిధ్యానికి పెద్ద పీట

కోడి రామకృష్ణ వైవిధ్యానికి పెద్ద పీట వేశారు. తొలినాళ్లలో ‘తరంగిణి’, ‘ఆలయ శిఖరం’, ‘ముక్కు పుడక’, ‘మా ఇంటికి రండి’, ‘మంగమ్మగారి మనవడు’, ‘మా పల్లెలో గోపాలుడు’, ‘మూడిళ్ళ ముచ్చట’, ‘ముద్దుల కృష్ణయ్య’, ‘చల్లని రామయ్య చక్కని సీతమ్మ’, ‘మువ్వ గోపాలుడు’, ‘తలంబ్రాలు’, ‘శ్రీనివాస కళ్యాణం’, ‘ఇంటిదొంగ’, ‘దొంగ కాపురం’, ‘మనవాడొస్తున్నాడు’, ‘చుట్టాలబ్బాయి’, ‘ఆహుతి’, ‘దొరగారింట్లో దొంగోడు’, ‘అత్త మెచ్చిన అల్లుడు’, ‘ముద్దుల మావయ్య’, ‘బాల గోపాలుడు’, ‘సోగ్గాడి కాపురం’, ‘భలే దంపతులు’, ‘రావుగారింట్లో రౌడీ’, ‘మధురానగరిలో’, ‘తరంగాలు’, ‘అల్లరి పిల్ల’, ‘ఆస్తి మూరెడు ఆశ బారెడు’ లాంటి కుటుంబ చిత్రాలు విరివిగా తీశారు. అదే సమయంలో... ఆయన ‘సింహపురి సింహం’ , ‘పోరాటం’, ‘గూఢచారి నంబర్‌ 1’, ‘ఆడపులి’, ‘దానవుడు’, ‘మన్నెంలో మొనగాడు’, ‘ఉదయం’, ‘అంకుశం’, ‘20వ శతాబ్దం’, ‘విముక్తి’, ‘శత్రువు’, 'భారత్ బంద్', ‘భారతం’, ‘గ్యాంగ్‌ వార్‌’, ‘పోలీస్‌ లాకప్‌’, ‘ఆవేశం’, ‘లేడీ బాస్‌’, ‘అమ్మోరు’, ‘గాడ్‌ ఫాదర్‌’ ‘రధ యాత్ర’, ‘భారత రత్న’, ‘జెండా’, ‘త్రినేత్రం’, ‘నాయకుడు’లాంటి విభిన్న కథాంశాలతో చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ చిత్రంతో చిరంజీవికి దర్శకత్వం వహించి సినీ కెరీర్‌ ప్రారంభించిన కోడి రామకృష్ణ... ఆయనతో ‘రిక్షావోడు’ లాంటి కమర్షియల్‌ మూవీని కూడా చేశారు. ఆ తరువాత గ్రాఫిక్స్‌ నేపథ్యంగా అంజి సినిమాకి కూడా దర్శకత్వం వహించారు. అదే సమయంలో... దేవుళ్ళు, దేవతల చుట్టూ కల్పిత చిత్రాలకు దర్శకత్వం వహించి సంచలనం సృష్టించారు.

‘అరుంధతి’ బిగ్గెస్ట్‌ హిట్‌

కోడి రామకృష్ణ గ్రాఫిక్స్‌ మాయాజాలంతో సినిమా థియేటర్స్‌లో ఇంద్రజాలం సృష్టించారు. రొటీన్‌ చిత్రాలు కాకుండా తన చిత్రాల్లో ప్రత్యేకత ఉండేలా చూసుకునే తపనే కోడి రామకృష్ణకి ప్రేక్షక జనాదరణ పెద్ద ఎత్తున లభించింది. ‘అమ్మోరు’ లాంటి చిత్రంతో మొదలైన ఆయన గ్రాఫిక్‌ మాయాజాలం ‘అరుంధతి’ చిత్రానికి వచ్చేసరికి తారాస్థాయికి చేరుకుంది. సాంకేతికతతో పాటు అలౌకిక పాత్రల చుట్టూ తిరిగే కథలే కోడి రామకృష్ణ ముడిసరకులయ్యాయి. ‘అమ్మోరు’ చిత్రం సూపర్‌ హిట్‌ కాగా ‘దేవుళ్ళు’ చిత్రం చిన్నపిల్లలే ప్రధాన పాత్రలుగా తీసిన చిత్రం. ఆ సినిమా కూడా కోడి రామకృష్ణ ఖాతాలో పడ్డ మరో విజయం. కాగా గ్లామర్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న అనుష్క శెట్టి నాయికగా కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ‘అరుంధతి’ బిగ్గెస్ట్‌ హిట్‌గా నమోదు చేసుకుంది. అంతకు ముందు వెంకటేష్, సౌందర్య జోడిగా ‘దేవిపుత్రుడు’ కూడా విజయవంతమైన చిత్రమే.

పాలకొల్లు చిన్నోడు

కోడి రామకృష్ణ స్వస్థలం పాలకొల్లు. 1949 జులై 23న ఆయన జన్మించారు. తల్లి తండ్రులు చిట్టెమ్మ, నర్సింహా మూర్తి. ప్రాథమిక విద్య మొదలుకుని డిగ్రీ వరకూ ఆయన చదువంతా పాలకొల్లులోనే జరిగింది. ఓ పక్క చదువుకుంటూనే...మరో పక్క చిత్రకళాభిరుచితో మనుగడ సాగించారు. పగలు చదువు, రాత్రి అజంతా పెయింటింగ్స్‌లో కమర్షియల్‌ పెయింటింగ్స్‌ వేస్తుండేవారు. సినిమాలంటే కూడా కోడి రామకృష్ణకు మక్కువ ఎక్కువ. మధ్య మధ్యలో సినిమా ప్రయత్నాలు కూడా చేసేవారు. పాలకొల్లులోని లలిత కళాంజలి ద్వారా అనేక నాటకాలు వేసేవారు.

గురువు దాసరి

‘తాత మనవడు’ చిత్రానికి దర్శకత్వం వహించిన దాసరి నారాయణరావు దగ్గర దర్శకత్వ శాఖలో శిక్షణ పొందాలని కోడి రామకృష్ణ నిర్ణయించుకున్నారు. డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత వస్తే చూద్దామని దాసరి నారాయణరావు సూచించడంతో ...డిగ్రీ పూర్తి అయిన వెంటనే ఆ సంగతి ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అప్పట్లో దాసరి నారాయణరావు వరుస సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఎవరికీ వారే యమునా తీరే’, ‘మనుషుల్లో దేవుడు’, ‘స్వర్గం నరకం’ చిత్రాలకు కోడి రామకృష్ణను అసిస్టెంట్‌గా దాసరి తీసుకున్నారు. తన గురువు దాసరి నారాయణరావుని దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన నిర్మాత రాఘవ చిత్రం ద్వారానే తానూ దర్శకుడిగా మారాలని కోడి రామకృష్ణ అనుకునేవారు. దాంతో ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’తో దర్శకుడిగా మారారు. చిత్ర సీమకు చేసిన సేవలకు గుర్తుగా కోడి రామకృష్ణకి అనేక అవార్డులు, పురస్కారాలు లభించాయి. రఘుపతి వెంకయ్యనాయుడు పురస్కారాన్ని సైతం అందుకున్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని