Published : 11 Jan 2021 19:51 IST

ఒకే మార్గం...ఒకే లక్ష్యం...పరచూరి బ్రదర్స్‌

రెండు శరీరాలు... ఒకే ప్రాణం...
రెండు హృదయాలు... ఒకే స్పందన...
రెండు మెదళ్ళు... ఒకే ఆలోచన...
రెండు కలాలు... ఒకే సృజన...ఒకే మార్గం...ఒకే లక్ష్యం...పరచూరి బ్రదర్స్‌

ఔను... వారిద్దరి దేహాలు వేరయినా ఆత్మ ఒకటే. చేపట్టిన వృత్తి ఒకటే. చేరుకోవాలన్న లక్ష్యం ఒక్కటే. తెలుగు చిత్ర సీమలో 350కి పైగా చిత్రాలకు కధలు, మాటలు అందించిన రచయితల ద్వయం పేరు... పరచూరి బ్రదర్స్‌. ఒంటి పేర్లతో కాకుండా కేవలం ఇంటి పేరుతోనే లబ్ధ ప్రతిష్ఠులైన ఆ రచయితల సృజనకి సంబంధించి ఒక చిత్రానికి ఎవరు ఎంత మేర తమ కాంట్రిబ్యూషన్‌ ఇచ్చారో... తేల్చి చెప్పడం... మనకే కాదు ఆ రచయితల ద్వయానికి కూడా అంతు పట్టని కథే. ఇద్దరు వ్యక్తులుగా పైకి కనిపించినా... రచయితలుగా ఒకే పేరుతో ప్రతిష్ట సంపాదించుకున్నారు కనుక... ఎవరి గురించి మాట్లాడబోయినా మరొకరి ప్రస్తావన తప్పనిసరవుతుంది. అంతలా ఒక్కరుగా ఆ ఇద్దరూ మమేకమై పోయారు. వ్యక్తిగత గుర్తింపు కన్నా మిన్నగా జంట గుర్తింపునే కోరుకున్నారు. అదే బాటలో నడిచారు. ఇంకా...నడుస్తూనే ఉన్నారు.

నామ త్యాగం..
జంటగా కళా సేవ చేసినవారిలో చాలామంది ఆ తర్వాత్తర్వాత విడిపోయి ఎవరికివారు యమునా తీరే అన్న చందంగా వ్యవహరించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. సృజనాత్మక భేదాలు, వ్యక్తిగత ఈర్ష్యాద్వేషాలు, వివిధ భావోద్వేగాలతో విడిపోతుంటారు. వీటన్నిటికీ అతీతంగా పరచూరి బ్రదర్స్‌ ఇప్పటికీ ఒక్కటిగా ఉండడమే... జంట రచయితలుగా వారి విజయ రహస్యమంటారు. రవీంద్రభారతిలో జరిగిన ఒకనొక సభలో ప్రసిద్ధ కవి డాక్టర్‌ సి. నారాయణ రెడ్డి మాట్లాడుతూ... అన్నదమ్ముల కోసం ఎంతో మంది ఆస్తులు త్యాగం చేశారు. భూములు త్యాగం చేశారు. కానీ, పరుచూరి బ్రదర్స్‌ మాత్రం నామ త్యాగం చేశారు అంటూ అభినందించారు.

పరచూరి బ్రదర్స్‌లో ఒకరైన... పరచూరి వెంకటేశ్వరరావు పుట్టిన రోజు 21 జూన్‌. నాటక రచయిత, నటుడు, సంభాషణల రచయిత, దర్శకుడు... ఇలా అనేక రకాలుగా సినిమా సేవకు వెంకటేశ్వరరావు అంకితమయ్యారు. సన్నివేశానికి తగ్గట్లు మాటల తూటాలు పేల్చడం, హీరోలకు వ్యక్తితం ఉన్న పవర్‌ ఫుల్‌ పాత్రల్ని రూపొందించడం... ఉత్కంఠ గొలిపే కధాకధనాలతో ప్రేక్షకులని కదలనీయకుండా చేయడం... ఈ జంట కలానికి ఉన్న ప్రత్యేకత. సినీరచనలో ఉన్న దమ్ముని అన్నదమ్ములు చూపించారు.

ఇండస్ట్రీకి వెంకీ...గోపీ..

ఇండస్ట్రీ ఈ ఇద్దరు అన్నదమ్ములని వెంకీ, గోపి... అంటూ ఆత్మీయంగా పిలుచుకుంటుంది. వెంకటేశ్వరరావులోని ముక్కుసూటి తనం ప్రత్యేకత. ఉన్న మాట మనసులో దాచుకోకుండా పైకి వ్యక్తం చేసే తత్త్వం ఆయనది. గుంభనగా ఉండడం చేతకాదంటారు. అదే సమయంలో... పిలిస్తే కోపం ఇట్టే వచ్చేస్తుందంటారు. మంచితనం...మానవత్వం పోత పోసిన నిలువెత్తు మనిషి ఆయన. ఇండస్ట్రీకి పరచూరి గోపాల కృష్ణ కంటే ముందుగానే వచ్చిన వెంకటేశ్వరావు తర్వాత సోదరుడితో కలిసి అనేక సంచలనాలు కారణమయ్యారు.

మొదట్లో ఎర్ర సినిమాలు..

కెరీర్‌ బిగినింగ్‌లో పరచూరి బ్రదర్స్‌ ఎన్నో విప్లవాత్మక సినిమాలకు రచన చేశారు. చలిచీమలు, మరో మలుపు, ఈ చరిత్ర ఏ సిరాతో?, ఇది కాదు ముగింపు, రోజులు మారాయి... అనే సినిమాల్లో పెద్ద పెద్ద స్టార్లు లేకున్నా జనాదరణ పాత్రమయ్యాయి. తక్కువ బడ్జెట్, అందుబాటులో ఉన్న లొకేషన్స్, అభిరుచిగల నటీనటులు... ఇవీ ఈ సినిమాలకు ప్రధాన ఆకర్షణలు. అగ్ర హీరోల సినిమాలతో పోటీ పడుతూ విజయ ఢంకా మోగిస్తూ ముందుకు సాగుతుంటే... ఇండస్ట్రీ కన్ను ఈ రచయితల మీద పడింది. అంతే...ఇక ఈ రచయితలకు అహర్నిశలూ పనే. ఇండస్ట్రీలో బిజీ రచయితలుగా మారిపోయారు. 1978 జులై 7న విడుదలైన చలి చీమలు చిత్రంతో వీరి ఎంట్రీ జరిగింది. 1979లో కలియుగ మహాభారతం, ఛాయ, సీతే రాముడైతే, 1980లో బడాయి బసవయ్య, సమాధి కడతాం చందాలివ్వండి., మానవుడే మహనీయుడు, 1981లో భోగభాగ్యాలు, మరో కురుక్షేత్రం లాంటి సినిమాలకు రచనలు చేస్తూ వచ్చారు. 1982లో ఎన్టీఆర్, శ్రీదేవి, జయప్రద నటించిన అనురాగ దేవత సినిమాకు సంభాషణలు సమకూర్చారు. ఆ తర్వాత నాదేశం సినిమాకు కూడా రచన చేశారు. 1982లో ఈనాడు సినిమాకి పనిచేసారు. 1983లో ముందడుగు సినిమాతో కమర్షియల్‌గా ఓ ముందడుగు పడింది. డి. రామానాయుడు నిర్మాతగా, కె. బాపయ్య దర్శకతంలో కృష్ణ, శోభన్‌ బాబు, జయప్రద, శ్రీదేవి నటించిన ఈ చిత్రానికి పరచూరి బ్రదర్స్‌ కథ, మాటలు అందించారు. 1983లో ఈ సినిమా విడుదలయింది. ఈ దేశంలో ఒకరోజు, చట్టానికి వెయ్యి కళ్ళు, చండశాసనుడు, సిరిపురం మొనగాడు, ప్రజారాజ్యం కాలయముడు...ఇలా రాస్తూ పోతుండగా 1983లో చిరంజీవి ఖైదీకి కథ, మాటలు అందించారు. అప్పటి ఖైదీతో పాటు ఖైదీ నంబర్‌ 150కి కూడా పరచూరి బ్రదర్స్‌ పనిచేశారు. చిరంజీవి లేటెస్ట్‌ సినిమా సైరాకి కూడా పరచూరి బ్రదర్స్‌ కథని అందించారు.

ఓ పుట్టిన రోజునాడు నీడ దొరికింది..
చలి చీమలు చిత్రం తర్వాత ఎన్టీఆర్‌ పరుచూరి కోసం వెతకడం మొదలెట్టారు. ఆఖరికి వెంకటేశ్వరావుని ఎన్టీఆర్‌ మనుషులు కనుగొన్నారు. వెంటనే... ఆయన్ని ఎన్టీఆర్‌ దగ్గరికి తీసుకెళ్లారు. అప్పుడు... ఆయన గొడుగు నీడలో ఉన్నారు. పరచూరి వెంకటేశ్వరావు మాత్రం ఎండలో నిల్చున్నారు. అది గమనించిన ఎన్టీఆర్‌ నీడలోకి రండి... అంటూ సూచించారు. ఆ సూచనకే పులకించిపోయారు వెంకటేశ్వరావు. కారణం... ఎండ నుంచి నీడలోకి రమ్మనే అర్థం పైకి కనిపిస్తున్నా... ఇండస్ట్రీలో ఎన్టీఆర్‌ నీడ కూడా లభించబోతోందనే అంతర్లీన సంకేతం అందులో ఉందని వెంకటేశ్వరరావు భావించారు. కాలక్రమేణా ఆ భావమే నిజమైనది. తర్వాత్తర్వాత ఎన్టీఆర్‌ నటించిన ఎన్నో విజయవంతమైన సినిమాలకు ఈ రచయితల ద్వయం రచన చేశారు.

దర్శకులుగా..
దర్శకులుగా కూడా ఈ రచయితల ద్వయం అనేక సినిమాలు రూపొందించారు. కాయ్‌ రాజా కాయ్, శ్రీ కట్న లీలలు, భలే తమ్ముడు, రేపటి స్వరాజ్యం, ప్రజాస్వామ్యం, మా తెలుగు తల్లి, సర్పయాగం, మరో క్విట్‌ ఇండియా, సింగన్న చిత్రాలకు దర్శకత్వం వహించారు. నటులుగా పలుచిత్రాల్లో మంచి పాత్రలు వేశారు. 1993లో ఆశయం సినిమాలో నటించిన పరచూరి వెంకటేశ్వరరాఫుకి బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్టర్‌గా అవార్డు లభించింది.

ఉత్తమ కథా రచయితలుగా నందులతో పురస్కారం..
1986లో ప్రతిధ్వని సినిమాకి కథని అందించినందుకు ఉమ్మడి రాష్ట్ర నంది పురస్కారం లభించింది. 1990లో కర్తవ్యం సినిమాకి మరో నంది నడిచి రాగా ...చెన్నయ్‌ లోని కళాసాగర్‌ అవార్డు కూడా వరించి వచ్చింది. 1993లో ఆశయం సినిమాకి కథ అందించినందుకు నంది అవార్డుతో పాటు సినీ గోయర్స్‌ అవార్డు కూడా లభించింది. 1990లో కొదమ సింహం సినిమాకి బెస్ట్‌ స్క్రీన్‌ప్లే రైటర్స్‌గా వంశీ బర్కలీ పురస్కారం లభించింది. బెస్ట్‌ ఫిలిం డైరెక్టర్‌గా ప్రజాస్వామ్యం సినిమాకి మరోసారి నంది పురస్కారాన్ని పరచూరి బ్రదర్స్‌ అందుకున్నారు. బెస్ట్‌ డైలాగ్‌ రైటర్స్‌గా ఈనాడు చిత్రానికి సితార అవార్డు, ప్రజాస్వామ్యం సినిమాకి రసమయి అవార్డు, కర్తవ్యం, పీపుల్స్‌ ఎన్‌ కౌంటర్‌ సినిమాలకి కళాసాగర్‌ అవార్డు, సుందరకాండ సినిమాకి లలిత కళాసాగర్‌ అవార్డు, కుంతీ పుత్రుడు సినిమాకి వంశీ బర్కలీ అవార్డు, మేజర్‌ చంద్రకాంత్‌ కి కళాసాగర్‌ అవార్డు, గణేష్‌ చిత్రానికి నంది అవార్డు, సమరసింహారెడ్డికి యువకళావాహిని, అప్‌ సినీ గోయర్స్‌ అవార్డు...ఇలా అనేకానేక సాంస్కృతిక సంస్థలు పరచూరి బ్రదర్స్‌ సినిమా రంగానికి చేసిన సేవలకు గుర్తుగా సన్మానించాయి.

బుల్లితెరపై కూడ పరచూరి సృజన
బుల్లి తెర పై కూడా పరచూరి బ్రదర్స్‌ సృజన అందించారు. సంభవామి పదేపదే, శశిరేఖ పరిణయం, ప్రజావేదిక, సతీ సావిత్రి...ఇలా అనేక సీరియల్స్, కార్యక్రమాలకు ప్రతిభ అద్దారు.

ఈ తరం అగ్రహీరోలకు పెద్దనాన్నలు
ఇప్పట్లో అగ్ర హీరోలైన ప్రభాస్, జూనియర్‌ ఎన్టీఆర్, కళ్యాణ్‌ రామ్‌ లకు పరచూరి బ్రదర్స్‌ పెద్దన్నన్నలు. కృషంరాజు, హరికృష్ణలతో ఉన్న అనుబంధం కారణంగా వాళ్లంతా ఈ ఇద్దర్నీ పెద్దనాన్నలుగా పిలుస్తూ ఆప్యాయత పంచుతారు.

- పి.వి.డి.ఎస్‌. ప్రకాష్‌
 

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని