Published : 11 Jan 2021 15:56 IST

భాగ్యనగర సినీ భగీరథుడు... అక్కినేని

(అక్కినేని జయంతి సందర్భంగా .. ఆయన నటించిన చిత్రాల గురించి)

1945లో పూర్తిస్థాయి నటుడిగా ‘మాయాలోకం’లో విహరించిన అక్కినేని, పల్లెటూరి నేపధ్యంలో నటించిన మొదటి చిత్రం దర్శక నిర్మాత బి.ఏ.సుబ్బారావు నిర్మించిన ‘పల్లెటూరిపిల్ల’గా చెప్పవచ్చు. అక్కినేనికి ఇది 12వ చిత్రం కాగా, ఎన్‌.టి.ఆర్‌తో కలిసి నటించిన మొదటి మల్టీ స్టారర్‌ చిత్రం. ఎన్‌.టి.ఆర్‌కి కూడా కథా నాయకుడిగా(జయంత్‌) ఇది తొలి చిత్రమే. 27-4-1950న విడుదలైన ఈ చిత్రానికి మూలం షెరిటన్‌ రాసిన ‘ఫిజారో’ అనే ఆంగ్ల నాటకం. ఇందులో అక్కినేని పాత్ర పేరు వసంత్‌. ఈ పాత్రకు మొదట కల్యాణం రఘురామయ్యను తీసుకుందామనుకుంటే, అందులో పోరాట సన్నివేశాలున్నందున తను చెయ్యలేనని చెబితే, అక్కినేనికి ఆ అవకాశం దక్కింది. ప్రధాన పాత్ర ఎన్‌.టి.ఆర్‌దే అయినా టైటిల్స్‌లో అక్కినేని పేరే మొదట కనబడుతుంది. పసిబిడ్డను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయే త్యాగమూర్తి పాత్రలో అక్కినేని అద్భుతంగా నటించారు. అక్కినేని బుల్‌ ఫైట్‌ సన్నివేశంలో ఎంతో సహజంగా నటించారు. తెలుగులో విజయవంతమైన ఈ చిత్రాన్ని జెమిని వాసన్‌ ‘ఇన్సానియత్‌’ పేరిట దిలీప్, దేవానంద్, బీనారాయ్‌లతో నిర్మిస్తే అక్కడా ఈ సినిమా విజయాన్ని సాధించింది. అక్కినేని ఎన్‌.టి.ఆర్‌తో కలిసి నటించిన మరో పల్లెటూరి కథా చిత్రం ఎల్‌.వి.ప్రసాద్‌ దర్శకత్వం వహించిన సి.వి.రంగనాథ్‌ దాస్‌ నిర్మించిన ‘సంసారం’. ఎన్‌.టి.ఆర్‌కి తమ్ముడిగా, పల్లెటూరి రైతు పాత్రలో ప్రవేశం చేసి, పట్నవాసంలో నాగరికత నేర్చుకున్న యువకునిగా అక్కినేనిని నటన సాంఘిక పాత్రల్లో అతని స్థానాన్ని సుస్థిరం చేసింది. 29-12-1950న విడుదలైన ఈ చిత్రం రజతోత్సవం చేసుకుంది. 1954లో వచ్చిన తాతినేని ప్రకాశరావు చిత్రం ‘నిరుపేదలు’లో పల్లెటూరి యువకునిగా ఉంటూ కరువు-కాటకాలవలన పతనానికి వలస వెళ్లి రిక్షా కార్మికునిగా మారే పాత్రలో అక్కినేని నటించారు. ఈ చిత్రం 5 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకొంది. అదే సంవత్సరం తాతినేని ప్రకాశరావు మరో చిత్రం ‘పరివర్తన’ కూడా విడుదలైంది. ఇందులో కూడా ఎన్‌.టి.ఆర్, అక్కినేని ఇద్దరూ నటించారు.

                                                                                                    స్వాతంత్య్రం వచ్చిన తరువాత జమీందారీ విధానాలపట్ల సమాజంలో భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. కొందరు అభ్యుదయ వాదులు ఈ సమస్యల నేపథ్యంలో సినిమాలు నిర్మించారు. సారథి ఫిలిమ్స్‌ పతాకంపై సి.వి.ఆర్‌.ప్రసాద్‌ తాపీ చాణక్య దర్శకత్వంలో నిర్మించిన ‘రోజులు మారాయి’ చిత్రం ఆ కోవలోనిదే. అక్కినేని, షావుకారు జానకి నటించిన ఈ చిత్రం గ్రామీణ వాతావరణంలో దున్నేవాడిదే భూమి అనే నేపథ్యంలో సాగుతుంది. అన్యాయాన్ని ఎదిరించే నవతరం ప్రతినిధిగా, బడుగు రైతులకు అండగా ఉంటూ ఆదర్శ రైతుబిడ్డగా అక్కినేని ఎంతో సహజంగా నటించారు. కలెక్టరు గ్రామానికి వచ్చి బంజరు భూముల్ని పేద రైతులకు పంచే సందర్భంగా వచ్చే ‘ఏరువాక’ పాట త్రిపురనేని గోపిచంద్‌ దర్శకత్వంలో తీయాలనుకున్న ‘పాలేరు’ అనే సినిమా కోసం తయారు చేసింది. ఆ చిత్ర నిర్మాణం ఆగిపోవడంతో ఈ పాటను సందర్భోచితంగా వాడుకున్నారు. హైదరాబాదులో రజతోత్సవం చేసుకున్న తొలి తెలుగు సినిమా ‘రోజులుమారాయి’. దున్నేవాడికే భూమి అనే ఈ సినిమా నినాదంతోనే పేద రైతుల ఉద్యమానికి ప్రేరణ కలిగింది. అంతేకాదు రాష్ట్ర రాజధానిలోనే చిత్ర నిర్మాణం జరగాలని యార్లగడ్డ రామకృష్ణ ప్రసాద్‌ సారథి స్టూడియో నిర్మాణానికి నడుం బిగించారు.

                                                                                           దుక్కిపాటి మధుసూదనరావు నిర్మాతగా అన్నపూర్ణా సంస్థను నెలకొల్పి కె.వి.రెడ్డి దర్శకత్వంలో నిర్మించిన ‘దొంగరాముడు’ సినిమాలో గ్రామీణ వాతావరణాన్ని సృష్టించినా అక్కినేనిది పూర్తి స్థాయి గ్రామీణ పాత్రకాదు. 11-1-1957లో వచ్చిన సొంతచిత్రం ‘తోడికోడళ్ళు’లో చదువుకున్న ఆదర్శ రైతుగా అక్కినేని భూమిక నిర్వహించిన విధానం గొప్పగా వుంటుంది. శరత్‌ నవల ‘నిష్కృతి’ ఆధారంగా నిర్మించిన ఈ చిత్రానికి తొలిసారి ఆదుర్తి సుబ్బారావు అన్నపూర్ణ సంస్థకు దర్శకత్వ బాధ్యతలు నిర్వహించి, తదుపరికాలంలో ‘పూలరంగడు’ చిత్రం దాకా ఆ పరంపరను కొనసాగించారు. బంధుత్వాలలోని అనుబంధాల లోతులను చూపిన ఈ చిత్రంలో అక్కినేని నటించిన సత్యం పాత్ర, అనివార్య పరిస్థితుల్లో పల్లెటూరు వచ్చి, రైతుల పక్షాన పోరాడి సహకార సేద్యానికి నాంది పలకడం, ఆశయసిద్ధి సాధించడం వంటి మంచి పనులు చేసే పాత్ర. సహజంగానే అక్కినేని ఈ పాత్రలో జీవించారు. ఈ చిత్రాన్ని తమిళంలో ‘ఎంగవీట్టు మహాలక్ష్మి’గా ఏకకాలంలో నిర్మించారు. ప్రముఖ దర్శకుడు శ్రీధర్‌ ఈ చిత్రంతోనే సంభాషణల రచయితగా పరిచయమయ్యాడు. ఈ చిత్రానికి రాష్ట్రపతి యోగ్యతా పత్రం లభించింది. తరువాత వచ్చిన ‘ఆడపెత్తనం’(1958), ‘మాంగల్య బలం’(1959) చిత్రాల్లో గ్రామీణ వాతావరణం కనిపించినా అది పూర్తి స్థాయిలో వుండదు. ఇక తెలుగు సినిమాల్లో యాంటీ హీరో పాత్రలకు బలమైన పునాది ఏర్పాటుచేసిన సినిమా ‘నమ్మినబంటు’. హీరో అంటే సద్గుణ సంపన్నుడని, నీతికి కట్టుబడేవాడనే పడికట్టు లక్షణాలకు ఎదురువెళ్లిన సినిమా ‘నమ్మినబంటు’. ఇందులో హీరో ఒక భూస్వామికి నమ్మినబంటు. అంటే అన్యాయానికి కొమ్ముకాసే పాత్ర. అక్కినేనికి ఈ పాత్ర కత్తిమీద సామువంటిది. అందరిలో ఒక్కడిగా, అందరికీ ఒక్కడిగా నమ్మినవారిని ఆదుకొనే తత్వంగల పాత్ర. అటువంటి ‘నమ్మినబంటు’ని సావిత్రి మంచి మార్గంలో పెట్టి, సంస్కరించే సోషలిస్టు భావాలను ప్రతిబింబించే పాత్ర. 7-1-1960న విడుదలైన ఈ చిత్రాన్ని స్పెయిన్‌లోని శాన్‌ సెబాస్టియన్లో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించారు. ఈ చిత్రంలో రామలక్ష్మణులనే ఎద్దులు చేసే విన్యాసాలు అక్కడ విశేషంగా ఆకర్షించాయి. ఎందుకంటే స్పెయిన్‌లో ‘బుల్‌ఫైట్‌’ జాతీయ క్రీడ కావటం. ఈ చిత్రానికి ఆ ఏడాది ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా రాష్ట్రపతి రజిత పతకం లభించింది. ఈ సినిమాను రష్యా, మలేషియా, రంగూన్‌ (మియన్మార్‌) దేశాల్లో కూడా ప్రదర్శించారు. ఈ సినిమా 5 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకొంది.

                                                                         అన్నపూర్ణా వారి ‘పూలరంగడు’ సినిమా కూడా గ్రామీణ వాతావరణంలో తీసిందే. అక్కినేనిది ఇందులో జట్కా నడిపే రంగడి పాత్ర. ఎంత కష్టం తలెత్తినా పూలరంగడుగానే తిరిగే మనస్తత్వంగల పాత్ర అక్కినేనిది. ప్రళయం వచ్చినా లొంగడని, ప్రాణం పోయినా జయిస్తాడనీ ఎస్టాబ్లిష్‌ చేసే పాత్తల్రో అద్భుతంగా నటించారు అక్కినేని. ఈ చిత్రం 24-11-1967న విడుదలై 13 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకొంది. ఈ పాత్ర ప్రేరణతోనే ప్రముఖ నిర్మాణ సంస్థ జగపతి పిక్చర్స్‌ అధినేత వి.బి.రాజేంద్రప్రసాద్‌ స్వీయ దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణంలో ‘దసరా బుల్లోడు’ సినిమా తీశారు. తన స్వగ్రామంలో తారసపడిన కొందరు వ్యక్తులతో వాస్తవంగా జరిగిన సంఘటనల ప్రేరణతో అల్లిన కథ ఈ సినిమా. జగపతి ఆస్థాన దర్శకుడు వి.మధుసూదనరావు ఇతర చిత్రాలతో బిజీగా ఉండటంతో, రాజేంద్రప్రసాద్‌ని దర్శకత్వం చేపట్టమని అక్కినేని ప్రోత్సహించడంతో ఆయన సాహసించి తీసిన ఈ సినిమా 25 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకొని బ్లాక్‌ బస్టర్‌ మూవీగా నిలిచింది. తిరుపతిలో ఈ సినిమా ఒకే హాల్లో సంవత్సరంపాటు నడిచింది. అమెరికాలో ప్రదర్శింపబడిన మొదటి తెలుగు చిత్రం కూడా ఇదే అవుతుంది! ఈ సినిమాతోనే ‘అక్కినేని స్టెప్పులు’ అనే పదం ఊపందుకుంది. అక్కినేనికి ‘దసరాబుల్లోడు’ 146వ చిత్రం. ఆయన ఆహార్యం కూడా ఇందులో ప్రత్యేకంగా వుంటుంది. ఈ చిత్రంతోనే సినిమాల్లో స్టెప్పులు మొదలై పాటల చిత్రీకరణ స్వరూపమే మారిపోయింది. 1962లో వచ్చిన ‘కలిమిలేములు’, తరువాత కాలంలో వచ్చిన ‘మూగమనసులు’, ‘గోవుల గోపన్న’, ‘భలే రంగడు’, ‘పవిత్ర బంధం’, ‘సుపుత్రుడు’, ‘రైతుకుటుంబం’, ‘మంచిరోజులు వచ్చాయి’, ‘దత్తపుత్రుడు’, ‘పల్లెటూరి బావ’, ‘ఊరంతా సంక్రాంతి’ వంటి చిత్రాల్లో అక్కినేని అడపాదడపా గ్రామీణ వాతావరణం ప్రతిబింబించే పాత్రలెన్నో చేశారు. ‘మూగమనసులు’ చిత్రాన్ని గురించి చెప్పుకోవాలంటే సమయమూ చాలదు..స్థలమూ చాలదు. జానపద చిత్రాల హీరో అక్కినేని అని ముద్రపడబోతున్న రోజుల్లో అక్కినేని జాగ్రత్తపడి, సాంఘికాలకు మారి, ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని ప్రేక్షకులకు చూపిస్తూ, తన సుదీర్ఘ సినీ ప్రస్థానాన్ని 70 ఏళ్ళకు పైగా నిలుపు కోగాలిగారు.

                                                                                                       తెలుగు చలనచిత్ర చరిత్రలో మొదటి పూర్తి నిడివి నవలా చిత్రం వినోదా వారి ‘దేవదాసు’. అక్కినేని నట జీవితాన్ని మలుపుతిప్పి అతనికి ఖ్యాతి తెచ్చిన సినిమా ఇది. అక్కినేని నటనా పటిమ తెలియాలంటే ఈ చిత్రంలో నటించక ముందు జరిగిన విశేషం కూడా తెలుసు కోవలసిన అవసరం వుంది. ‘సంసారం’ (1950) సినిమా తరువాత అక్కినేనికి అన్నీ జానపద చిత్రాలే వచ్చాయి. ‘తిలోత్తమ’, ‘సౌదామిని’, ‘మాయలమారి’, ‘ స్త్రీసాహసం’, ‘మంత్రదండం’ సినిమాలు 1951లో విడుదలై వరసగా దెబ్బతిన్నాయి. 1952లో భరణీ వారి ద్విభాషా చిత్రం ‘ప్రేమ’ (కాదల్‌)లో నటించినా పెద్దగా విజయవంతం కాలేదు. దాంతో అక్కినేని పనైపోయిందని చిత్రవర్గాలు అంచనా వేశాయి. 1953లో రెండు మంచి చిత్రాలో నటించే అవకాశం వచ్చింది. ఒకటి ‘పరదేశి’ చిత్రంలో శివాజీ గణేషన్‌ తండ్రిగా ముసలిపాత్ర. దానిని ఒక సాహస యాత్రగా భావించారు అక్కినేని. కడలి తరంగం పడిలేస్తుంది. అక్కినేని కూడా అదే చేశారు. చిత్రసీమలో చెలరేగిన అసంతృప్తిని తుడిచివేసే అవకాశం అది. రెండవ అవకాశం నిర్మాత డి.ఎల్‌.నారాయణ ‘దేవదాసు’ చిత్రాన్ని తీసేందుకు ముందుకు రావడం. చక్రపాణి శరత్‌ నవలను తెలుగులో అనువాదం చెయ్యకుంటే ‘దేవదాసు’ ఎవరో బహుశా మనకు తెలిసేది కాదేమో! తెలుగులో వచ్చిన మొదటి విషాద ప్రేమకథా చిత్రం భరణీ పతాకంపై భానుమతి ‘లైలా మజ్నూ’ (1949). చిత్రంలో ఖైస్‌గా అక్కినేనిని ఎంపిక చేసినప్పుడు కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయి. ఆ చిత్రం అక్కినేనికి మంచి పేరు తెచ్చిపెట్టింది. అక్కినేనికి గుండె ధైర్యం మెండు. అతనిపై వచ్చిన ప్రతి విమర్శా ఆయనకు అనుక్షణం గుర్తుకొస్తూనే వుండేది. ఆ కసితోనే ‘దేవదాసు’ పాత్రను ఆకళింపు చేసుకున్నారు. చక్రపాణితో, దర్శకుడు వేదాంతం రాఘవయ్యతో, మద్దిపట్ల సూరితో ‘దేవదాసు’ పాత్ర గురించి విస్రృతంగా చర్చించారు. మల్లాది రామకృష్ణశాస్త్రి సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఆ పాత్ర స్వభావాన్ని లోతుగా విశ్లేషిస్తూ ఆకళింపు చేసుకున్నారు. అయితే చిత్ర సంగీత దర్శకుడు, చిత్ర భాగస్వామి అయిన సి.ఆర్‌.సుబ్బురామన్‌ అకాల మరణం చెందడంతో చిత్ర నిర్మాణం కొంతకాలం అటకెక్కింది. అయినా డి.ఎల్‌. సంకల్పబలంతో ముందంజ వేశారు. దర్శకుడు వేదాంతం రాఘవయ్య ‘మాయాలోకం’(1945) చిత్రంలో అక్కినేనికి తాతగా నటించి ఉండడంతో ఆ చనువుతో ‘దేవదాసు’ పాత్ర చిత్రీకరణ సులువైంది. తాగుడు సన్నివేశాల చిత్రీకరణకు చాలా ముడి ఫిలిం వృధా అయింది. అక్కినేని తన చేతులమీద నరాలు, బొమికలు చిక్కినట్టు కనిపించేందుకు చేతివేళ్ళ సందులో ్లకూడా మేకప్‌ అద్దించుకున్నారు దేవదాసు తాగుబోతై ఆరోగ్యం నాశనం చేసుకున్న సన్నివేశాల్లో నటించేందుకు అక్కినేని రాత్రివేళల్లో షూటింగు పాల్గొన్నారు. నిద్రాభావం చేత కళ్ళు అరమూతలు పడాలని అలా చేశారు. భగ్నప్రేమ ప్రాధమిక కథాంశంగా తెలుగులో వచ్చిన మొదటి సాంఘిక చిత్రం ‘దేవదాసు’. భగ్నప్రేమికుడి పాత్రపై అక్కినేని ఇప్పటికీ చెరగని ముద్ర వేశారనటానికి 1971లో వచ్చిన మరో నవలా చిత్రం ‘ప్రేమనగర్‌’, ‘ప్రేమాభిషేకం’ సినిమాలే సాక్ష్యం. అక్కినేని మాటల్లో చెప్పాలంటే ‘దేవదాసు’ సినిమా నాకో పి.హెచ్‌.డి లాంటిది. నా లోపాలు తెలుసుకుని నటించడమే దీనికి కారణం. ‘దేవదాసు’ స్వభావానికి సరిపోనని సినీ పండితులెందరో హెచ్చరిస్తున్నా దర్శకులు రాఘవయ్య పట్టుదలతో ఆ పాత్రను నాతో చేయించారు. అందరూ అనుకున్నట్టు దేవదాసు పిరికివాడు కాడు. కేవలం తండ్రిమాట జవదాటలేని ఆశక్తుడు మాత్రమే’

                                                     దేవదాసు’ తరవాత వచ్చిన అక్కినేని స్వంతచిత్రం ‘తోడికోడళ్ళు’ (1957) కూడా శరత్‌ నవల ఆధారంగా నిర్మించినదే ఐనా పూర్తి నిడివి నవలా చిత్రం కాదు. భరణీ సంస్థ 1961లో నిర్మించిన ‘బాటసారి’ ‘బడీదీది’ అనే పూర్తి స్థాయి శరత్‌ నవలా చిత్రం. తనకు నచ్చిన సినిమాల పేర్లు చెప్పమని అక్కినేనిని అడిగితే మొదట చెప్పేది ‘బాటసారి’ సినిమా గురించే. ఆ సినిమాలో అక్కినేని పోషించిన సురేంద్రనాథ్‌ పాత్ర ప్రేమపాటలు పాడని ఒక మితభాషి పాత్ర. ఏ లోకంలోనో విహరిస్తూ, ఎక్కడో ఆలోచిస్తూ అన్నపానీయాల విషయమే గుర్తులేని అద్భుత పాత్ర. ఈ నవల కూడా చక్రపాణి తెనిగించిందే. ఈ చిత్ర షూటింగుకు వెళ్తూ అక్కినేని ముందుగా విజయా స్టూడియోలో చక్రపాణిని కలిసి పాత్ర స్వభావాన్ని గురించి చర్చించి షూటింగులో పాల్గొనేవారు. చర్చలోని ముఖ్యాంశం.. మాధవిని సురేంద్ర ఒక అక్కగా ప్రేమిస్తున్నాడా, తల్లిగా అభిమానిస్తున్నాడా, లేక ప్రేయసిగా ఆరాధిస్తున్నాడా అనేది. అలా చక్రపాణి చెప్పిన మనోభావాలను తు.చ తప్పకుండా అక్కినేని ఆచరణలో పెట్టేవారు. మాధవి పరాయి స్త్రీ అనే భావం తెలియని అమాయకత్వంలో ఆమె ఎదుట పడబోయి భంగపడే సన్నివేశంలో అక్కినేని నటన పరాకాష్టకు చేరుకుంటుంది. తను సురేంద్రని మనసులో ఆరాధిస్తున్నా, విధవరాలవటం చేత ప్రేమను వ్యక్తం చెయ్యలేని స్థితిలో వున్న మాధవికి తనవలన అన్యాయం జరిగిందని తెలుసుకొని, అనారోగ్యాన్ని లెక్కచెయ్యకుండా గుర్రం మీద వస్తూ కళ్ళజోడు పోగొట్టుకొని, మసక చూపుతో మాధవిని కలిసి, ఆమె క్షమాపణ కోరి ఆమె చేతుల్లోనే తుది శ్వాస విడిచే సన్నివేశంలో అక్కినేని నటనకు జోహార్లు అర్పించకుండా ఏ ప్రేక్షకుడూ ఉండలేడు. ‘బాటసారి’ చిత్రం మూగప్రేమకు సాక్ష్యం.. నిష్కళంక అనుబంధాలకు దర్పణం.
 
                               
ఆంధ్రప్రభ వార పత్రిక పోటీల్లో ప్రధమ బహుమతి పొంది, ధారావాహికంగా ప్రచురితమైన కోడూరి కౌసల్యాదేవి నవల ‘చక్రభ్రమణం’ ‘డాక్టర్‌ చక్రవర్తి’ రూపంలో 1964లో వచ్చిన అక్కినేని మరో నవలా చిత్రం. న్యాయ నిర్ణేతల కమిటీలో సభ్యుడిగా వున్న త్రిపురనేని గోపీచంద్‌ ఈ నవలను సినిమాగా తీస్తే బాగుంటుందని దుక్కిపాటి మధుసూదనరావుకు సూచించి హక్కులు కొనమంటే, నిర్ణయం తీసుకోవడంలో జరిగిన జాప్యం వల్ల నవల మార్కెట్‌లోకి వచ్చేసింది. పాఠకుల నుంచి అన్నపూర్ణా సంస్థకు దాన్ని సినిమాగా తీయమని ఎన్నో ఉత్తరాలు అందాయి. దుక్కిపాటి ఆలస్యం చెయ్యకుండా హక్కులు కొని కోడూరి కౌసల్యాదేవినే సంభాషణలు రాయమన్నారు. రాజమండ్రిలో వున్న అవివాహితైన కౌసల్యను మద్రాసుకు పంపడం తండ్రికి ఇష్టంలేక పోవడంతో ఆచార్య ఆత్రేయ మాటలు రాసి, గొల్లపూడి మారుతీరావు చేత సినేరియో తయారు చేయించారు. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించారు. చనిపోయిన చెల్లెలు సుధను మాధవిలో చూసుకుంటూ ఆమెను ఆరాధించే చక్రవర్తిగా, ఒక డాక్టరుగా ఆమెను బ్రతికించే బాధ్యతగల వ్యక్తిగా అక్కినేని నటన అపూర్వం.. అనితర సాధ్యం. అక్కినేని నటనానుభవంలో కనిపించే లక్షణాల్లో మొదటిది పాత్రలో పరకాయ ప్రవేశం చెయ్యగల ప్రతిభ, పాత్ర ఔచిత్యాన్ని తెలుసుకొని నటించటం రెండోది. నవలలో వర్ణించే ఇమేజ్‌కి భంగం కలగకుండా పాత్రే కనిపించేలా నటించటం ఈ చిత్రంలో అక్కినేని సాధించిన విజయం. అక్కినేనిని అనుక్షణం నీడలా వెంటాడే రొమాంటిక్‌ ఇమేజ్‌ ఎక్కడా ఈ చిత్రంలో కనపడనీయకుండా అక్కినేని నటించి చిత్ర విజయానికి సహాయపడ్డారు. కోడూరి కౌసల్యాదేవి మరో నవలా చిత్రం ‘ప్రేమనగర్‌’. అత్యంత విజయవంతమైన తెలుగు నవలాచిత్రాల్లో ‘ప్రేమనగర్‌’కి సముచిత స్థానం వుంది.

రామానాయుడు సినీరంగంలో   నిలదొక్కుకోవడానికి ఉపయుక్తమైన ఈ చిత్రం 1971లో విడుదలైంది. నాగేశ్వరరావు వుంటే ఏ నవలాచిత్రమైనా బాగా నడుస్తుందనే నానుడికి ‘ప్రేమనగర్‌’ సినిమా ఒక ప్రామాణికం. ఈ సినిమాలో అక్కినేని పాత్ర కల్యాణ్‌ కేంద్ర బిందువు. రాచరికపు ప్రమాణాలకు లోబడి తల్లిదండ్రుల ప్రేమకు దూరంగా ఆయా సంరక్షణలో పెరగటంచేత, అదుపుతప్పి దురలవాట్లకు లోనౌతాడు. కానీ ‘చెడిపోయిన వాళ్ళను చేరదీశానే గాని ఎవ్వరినీ చెరపలేదు’ అంటూ తన వ్యక్తిత్వాన్ని ఎస్టాబ్లిష్‌ చేస్తాడు కల్యాణ్‌. పరచింతన లేని భోగలాలసుడుగా, హాస్యప్రియుడుగా, రసార్ద్ర హృదయుడుగా, పిరికితనంలేని పెద్దమనిషిగా, దేహ వాంఛలకన్నా అతీత భావన కలిగిన మహోన్నతుడుగా అన్ని ఫ్రేముల్లోనూ అక్కినేని నటనా కౌశలం ‘ప్రేమనగర్‌’ చిత్రంలో పుష్కలం. తరతరాలుగా అహంకారంతోబాటు జీర్ణించుకుపోయిన వంశ గౌరవానికి భంగంరాకుండా నటించే ప్రతిభ అక్కినేనికే సొంతం. మహా నటుడుగా విశ్వరూపం ప్రదర్శించిన అక్కినేని నవలా చిత్రం ప్రేమనగర్‌.

                                                                             1976లో వచ్చిన అక్కినేని 172వ చిత్రం ‘సెక్రెటరి’ సినిమా ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి నవలా చిత్రమే. ప్రేమనగర్, సెక్రెటరి చిత్రాలు రెండూ కమర్షియల్‌ సూత్రాలతోనే నడిచేవి. సినిమాలుగా వాటిని మలిచినప్పుడు కమర్షియల్‌ అంశాలు వున్నాయి కనుకనే విజయవంతమయ్యాయి. దర్శకుడు కె.ఎస్‌.ప్రకాశరావు చిత్రీకరణ విధానంలో వ్యాపార లక్షణాలు ఎక్కువగా వుండవు. పాత్రోచితమైన ఆలోచనా విధానాలనే సమర్ధించే వ్యక్తిత్వం అతనిది. ‘ప్రేమనగర్‌, సెక్రెటరీ’ చిత్రాలేకాక ‘కన్నతల్లి’, ‘బందిపోటుదొంగలు’ వంటి చిత్రాల్లో అక్కినేని, ప్రకాశరావు సారధ్యంలో నటించారు. ‘సెక్రెటరి’ నవల అంతకుముందే జ్యోతి మాసపత్రికలో సీరియల్‌గా వచ్చింది. బామ్మ తప్ప మరెవరూ దిక్కులేని ఒక మధ్యతరగతి అమ్మాయి జయంతి(వాణిశ్రీ) కథ ఈ సినిమా. వనితలు, స్నేహితులు ఇష్టపడే రాజశేఖర్‌ అనే ధనవంతుని పాత్రలో అక్కినేని జీవించారు. సరళంగా, హాయిగా సాగిపోతుందీ సినిమా. యద్దనపూడి సులోచనారాణి మరొక నవల విజేత ఆధారంగా ‘విచిత్రబంధం’ సినిమా వచ్చింది. ‘ఆత్మీయులు’, ‘బంగారుకలలు’ సినిమాలు కూడా యద్దనపూడి కలం నుంచి జాలువారినవే! తెలుగు చలన చిత్ర చరిత్రలో నవలాధారిత చిత్రాలు ఎక్కువగానే వచ్చాయి. వాటిలో మొదటి తరం నవలానాయకుడు అక్కినేనే. నవలా నాయకుడంటే అక్కినేని నాగేశ్వరరావుకే ప్రధమస్థానం.

                                                                                           తెలుగు సినిమా నిర్మాణరంగాన్ని హైదరాబాదుకు తరలించాలని మద్రాసునుంచి మకాం మార్చిన అక్కినేని సంస్కారాన్ని గౌరవిస్తూ, నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి కొన్ని మౌలిక సదుపాయాలు, సబ్సిడీలు కల్పించడంతోబాటు ఉత్తమ చిత్రాలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో 1965లో నంది బహుమతులను ప్రవేశపెట్టారు. అలా 1964 సంవత్సరంలో విడుదలైన చిత్రాల్లో మూడు ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి వాటికి నంది బహుమతుల ప్రదానం చేసి ప్రభుత్వం ఆదర్శంగా నిలిచింది. ఆ సంవత్సరం అన్నపూర్ణ సంస్థ నిర్మించిన ‘డాక్టర్‌ చక్రవర్తి’ సినిమాకు ఉత్తమచిత్ర పురస్కారమందింది. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన సూచనకు అక్కినేని స్పందించి ప్రయోజనాత్మక చిత్రాలను లాభాపేక్ష లేకుండా నిర్మించాలని తలపెట్టి, ఆదుర్తి సుబ్బారావును కలుపుకొని ‘చక్రవర్తి చిత్ర’ పేరిట నూతన చలనచిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పారు. ఈ సంస్థ రెండు ఆణిముత్యాలలాంటి చిత్రాలను అందించింది. ఒకటి ‘సుడిగుండాలు’ మరొకటి ‘మరోప్రపంచం’. ఇవికాక తన స్వంత బ్యానర్‌లో ‘జైజవాన్‌’ చిత్రాన్ని కూడా నిర్మించి మార్గదర్శకులయ్యారు. యువత పెడదారిపట్టడానికి గల కారణాలను పరిశీలించి, వారిని మార్చడమే ధ్యేయంగా ‘సుడిగుండాలు’ చిత్రాన్ని నిర్మించారు అక్కినేని, ఆదుర్తి. ఈ చిత్రంలో అక్కినేనిది ఉదాత్తమమైన న్యాయమూర్తి పాత్ర. సినిమాలో తన కొడుకు ఈతకని స్నేహితునితో వెళ్లి తిరిగిరాకపోవడం న్యాయమూర్తికి ఆదుర్దా కలిగిస్తుంది. కానీ ఆ ఆదుర్దాని సంభాషణలు లేకుండా ముఖ కవళికల్లోనే నటించి చూపుతారు. అలాగే ఒక మంచి తీర్పు చెప్పినప్పుడు పొందే తృప్తిని, మనోభావాల్ని కళ్ళతోనే వ్యక్తీకరిస్తారు. ఆ అబ్బాయి స్విమ్మింగ్‌ పూల్లో విగతజీవుడై వున్నప్పుడు అక్కినేని చూపే మూగ బాధ సినిమా చూస్తేనే తెలుస్తుంది. తన బాబుని అతని స్నేహితుడే గొంతు నులిమి చంపినట్టు తెలుసుకొని పుత్రశోకంతో అల్లాడిపోయే పైకి కనుపించని అక్కినేని నటన; న్యాయమూర్తిగా తన బాబు స్నేహితునికి శిక్ష విధించి, ఒక వ్యక్తిగా అతడిని వురికంబమెక్కకుండా కాపాడాలని, ఆ హత్యకు ప్రేరేపించిన కారణాలను కనుక్కొని సమాజానికి సందేశమివ్వాలని అతడు పడే బాధ వర్ణనాతీతం. ‘నేరస్తులను అసహ్యించుకోకు.. నేరాలను అసహ్యించుకో’ అని పూజ్య బాపూజీ చెప్పిన మాటల్ని గుర్తుచేసుకుంటూ అక్కినేని నటించినప్పుడు చూపే హావభావాలు ఆయన నటనకు పరాకాష్ట అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ సినిమాకి ప్రభుత్వం స్వర్ణ నందిని బహూకరించింది. అంతే.. అటు ప్రభుత్వం దగ్గర నుంచిగానీ.. ఇటు ప్రజల దగ్గర నుంచిగానీ ప్రోత్సాహం రాకపోవడంతో ‘మరోప్రపంచం’ సినిమాతీసి ఇద్దరూ తదుపరి ప్రయత్నాలు మానుకొన్నారు.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని