Oscars 2023: మూడోసారి ‘ఆస్కార్‌’ అందుకొని చరిత్ర సృష్టించిన దర్శకుడు

ఆస్కార్‌ అవార్డును ఏకంగా మూడు సార్లు గెలుచుకొని చరిత్ర సృష్టించారు దర్శకుడు గిలెర్మో దెల్‌ టోరో (Guillermo Del Toro). ఆయన ప్రతిభకు ప్రశసంలు వెల్లువెత్తుతున్నాయి.

Updated : 13 Mar 2023 19:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్‌ అవార్డు (Oscar Awards)ను గెలుచుకోవాలని సినీ రంగంలోని వారంతా ఉవ్విళ్లూరుతుంటారు. జీవితంలో ఒక్కసారైనా ఆ అవార్డును ముద్దాడాలనుకుంటారు. ఒకే వ్యక్తికి మూడు సార్లు ఆస్కార్‌ అవార్డు వరిస్తే.. ఆ ఆనందం మాటల్లో చెప్పలేరు. ప్రస్తుతం అలాంటి అనుభూతిని ఆస్వాదిస్తున్నారు ప్రముఖ దర్శకుడు గిలెర్మో దెల్‌ టోరో (Guillermo Del Toro).

95వ ఆస్కార్‌ అవార్డు వేడుకల్లో బెస్ట్‌ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో ‘పినాకియో’ (Pinocchio) సినిమా అవార్డును దక్కించుకుంది. ఈ చిత్ర దర్శకుడు గిలెర్మో దెల్‌ టోరో (Guillermo Del Toro) తన జీవితంలో మూడోసారి ఆస్కార్‌ వేదికపైకి వచ్చి అవార్డును తీసుకున్నారు. గతంలో గిలెర్మో దెల్‌ టోరో తెరకెక్కించిన ‘ది షేప్‌ ఆఫ్‌ వాటర్‌’ (The Shape of Water) చిత్రానికిగాను ఆయన రెండు ఆస్కార్‌ అవార్డులను అందుకున్నారు. 2017లో విడుదలైన ఈ సినిమా ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు విభాగాల్లో ఆస్కార్‌ గెలుపొందింది. ‘బెస్ట్‌ పిక్చర్‌’, ‘బెస్ట్‌ డైరెక్టర్‌’, ‘బెస్ట్‌ యానిమేటెడ్‌ ఫిల్మ్‌’ విభాగాల్లో  పురస్కారం అందుకున్నారు.

ఈ ఏడాది.. లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌ ఆస్కార్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో (oscars 2023) ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’ (Everything Everywhere All at Once) సినిమా ఏకంగా ఏడు అవార్డులను సొంతం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. భారత్‌ నుంచి ‘ది ఎలిఫింట్‌ విస్పరర్స్‌’ బెస్ట్‌ షార్ట్‌ ఫిల్మ్‌గా.. ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్‌ను సొంతం చేసుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని