Guna Sekhar: సమంతను అలా ఎంపిక చేశా.. ఆ విషయంలో పరిధి దాటలేదు: గుణ శేఖర్‌

సమంత ప్రధాన పాత్రలో దర్శకుడు గుణశేఖర్‌ తెరకెక్కించిన చిత్రం ‘శాకుంతలం’. ఈ సినిమా ఏప్రిల్‌ 14న విడుదలకాబోతున్న సందర్భంగా గుణశేఖర్‌ పలు విశేషాలు పంచుకున్నారు.

Published : 22 Mar 2023 19:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘రుద్రమదేవి’ అనంతరం ప్రముఖ దర్శకుడు గుణ శేఖర్‌ (Guna Sekhar) దర్శకత్వం వహించిన చిత్రం ‘శాకుంతలం’ (Shaakuntalam). సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గుణ శేఖర్‌ ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూలో ఇచ్చారు. ఈ సినిమా ఎందుకు చేయాల్సి వచ్చిందో.. కథానాయికగా సమంత (Samantha)నే తీసుకోవడానికి కారణమేంటో తెలిపారు.

‘‘రుద్రమదేవి’ తర్వాత కొన్నాళ్లపాటు ‘హిరణ్య కశ్యప’ ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో నిమగ్నమయ్యా. పాండమిక్‌ రావడంతో ఆ ప్రాజెక్టుకు విరామం ఇచ్చా. దానికంటే ముందు ఓ ప్రేమకథను తెరకెక్కించాలనుకున్నా.  ఆలోచిస్తుంటే శకుంతల, దుష్యంతుల కథ జ్ఞాపకమొచ్చింది. అదే సమయంలో నా కూతురు నీలిమ సినిమాని నిర్మించాలనుందని మనసులో మాట బయటపెట్టింది. ‘శాకుంతలం’ కథతోపాటు మరికొన్ని స్టోరీలు ఆమెకు వినిపించా. వాటిల్లో తనకు శాకుంతలం కథ బాగా నచ్చి, ‘ఈతరం ప్రేక్షకులకు ఇలాంటి స్టోరీ చెబితే బాగుంటుంది’ అని చెప్పింది. దాంతో నాకు ఆసక్తి పెరిగి పని మొదలుపెట్టా’’

‘‘వ్యాస మహర్షి రాసిన మహాభారతం ఆదిపర్వంలోని శకుంతల- దుష్యంతుల కథని ఆధారంగా చేసుకుని.. మహాకవి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం అనే నాటక రూపంలోకి తీసుకొచ్చారు. అది ఎంతో ప్రసిద్ధి చెందింది. నేను ఈ రెండింటినీ పరిగణలోకి తీసుకున్నా. స్టోరీ చెప్పేందుకు చిన్నదే అయినా ఎంతో ఆసక్తిగా సాగుతుంది. ఈ చిత్రంలో కథానాయికగా సమంత అయితే బాగుంటుందనే సలహాను నీలిమే ఇచ్చింది. అది విని సర్‌ప్రైజ్‌ ఫీలైన నేను ఆమె గతంలో నటించిన ‘రంగస్థలం’ సినిమాని పలుమార్లు చూస్తూ అందులోని తన పాత్రను గమనించేవాణ్ని. తర్వాత, శకుంతల పాత్రలో సమంత ఎలా ఉంటుందోనని ఊహించుకునేవాణ్ని. పర్‌ఫెక్ట్‌గా ఉంటుందని ఫిక్స్‌ అయి ఆమెను ఎంపిక చేశా. అభిజ్ఞాన శాకుంతలం నాటకంలో శకుంతలను శృంగార నాయికగా, గొప్ప వ్యక్తిత్వం ఉన్న నాయికగా చూపించారు. అయితే, నేను పరిధి దాటలేదు. కేవలం నాయిక వ్యక్తిత్వంపైనే దృష్టి పెట్టా’’ అని గుణశేఖర్‌ తెలిపారు. దుష్యంతుడిగా దేవ్‌ మోహన్‌ నటించిన ఈ సినిమాతోనే ప్రముఖ హీరో అల్లు అర్జున్‌ తనయ అర్హ తెరకు పరిచయమవుతోంది. ఈ పాన్‌ ఇండియా చిత్రంలో మోహన్‌బాబు, ప్రకాశ్‌రాజ్‌, సచిన్‌ ఖేడ్కర్‌ కీలక పాత్రలు పోషించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు