Guna Sekhar: అప్పుడు మోహన్‌బాబు నా ఆఫర్‌ రిజెక్ట్‌ చేశారు: గుణశేఖర్‌

సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటించిన అపురూప దృశ్య కావ్యం ‘శాకుంతలం’ (Shaakuntalam). దేవ్‌ మోహన్‌, మోహన్‌బాబు, అల్లు అర్హ కీలకపాత్రలు పోషించారు. ఏప్రిల్‌ 14న ఇది విడుదల కానుంది. 

Published : 01 Apr 2023 14:34 IST

హైదరాబాద్‌: గతంలో నటుడు మోహన్‌బాబు (Mohan Babu) తన ఆఫర్‌ను రిజెక్ట్‌ చేశారని ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ (Guna Sekhar) అన్నారు. తాను తెరకెక్కించిన ఓ సినిమాలో కీలకపాత్ర కోసం మోహన్‌బాబుని సంప్రదించగా.. సున్నితంగా తిరస్కరించారని తెలిపారు. త్వరలో విడుదల కానున్న ‘శాకుంతలం’ (Shaakuntalam)లో దుర్వాస మహర్షి పాత్ర కోసం మోహన్‌బాబును ఎంచుకోవడంపై గుణశేఖర్‌ స్పందిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.

‘‘శాకుంతలం’కు మోహన్‌బాబు నా ఛాయిస్‌ కాదు. మహాకవి కాళిదాసు ఛాయిస్‌. ఎందుకంటే కాళిదాసు వర్ణన చదివిన తర్వాత.. దుర్వాస మహర్షి పాత్రకు నూటికి నూరు శాతం ఆయనే న్యాయం చేయగలడని అనిపించింది. గతంలో ‘రుద్రమదేవి’లో ఓ పాత్రకు అడిగితే ఆయన సున్నితంగా తిరస్కరించారు. దాంతో, ఆరోజు ఆయన్ని బలవంతం చేయలేదు. కానీ, ‘శాకుంతలం’ అనుకున్నాక.. ఆయన్ని కలిశాను. ‘సర్‌.. ఈసారి మీరు నో చెప్పలేని పాత్రతో వచ్చాను. ఒకవేళ మీరు చేయను అంటే ప్రత్యామ్నాయం ఎవరో మీరే చెప్పండి?’ అని అడిగాను. దానికి ఆయన ప్రాజెక్ట్‌ ఏమిటి? పాత్ర ఏమిటి? అని ప్రశ్నించగా.. ‘శాకుంతలం’లో దుర్వాస మహర్షి పాత్రని చెప్పా. వెంటనే ఆయన పెద్దగా నవ్వి.. ‘కోపిష్టి అని నా వద్దకు వచ్చావా?’ అని అడిగారు. దుర్వాసునిలో కోపం ఒక్కటే గుణం కాదు.. ఆయనో గొప్ప మహర్షి అని బదులిచ్చా. దానికి ఆయన.. ఈ పాత్ర నేనే చేస్తానంటూ అంగీకారం తెలిపారు’’ అని గుణశేఖర్‌ (Guna Sekhar) వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని