Shakuntalam: అప్పటి నుంచే నా సినిమాల్లో నిజమైన బంగారు ఆభరణాలు వాడుతున్నా: గుణశేఖర్‌

‘శాకుంతలం’ సినిమాలోని పాత్రల కోసం నిజమైన బంగారు ఆభరణాలు వాడినట్లు గుణశేఖర్‌ తెలిపారు. రూ.14 కోట్ల విలువ చేసే ఆభరణాలు వినియోగించినట్లు చెప్పారు.

Published : 23 Mar 2023 15:12 IST

హైదరాబాద్‌: గుణశేఖర్‌ (Gunasekhar) దర్శకత్వంలో సమంత (Samantha) ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘శాకుంతలం’ (Shakuntalam). ఈ సినిమాలో సమంత లుక్‌కు సంబంధించిన కొత్త ఫొటోలను చిత్రబృందం రిలీజ్‌ చేసింది. వజ్రాభరణాలతో హీరోహీరోయిన్లు మెరిసిపోతున్న ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఈ సందర్భంగా ‘శాకుంతలం’లో వాడిన ఆభరణాల వివరాలను దర్శకుడు గుణశేఖర్‌ తెలిపారు. ‘దాన వీర శూర కర్ణ’ స్ఫూర్తితో తన చిత్రాల్లో నిజమైన ఆభరణాలు మాత్రమే వాడుతున్నట్లు చెప్పారు.

‘‘శాకుంతలం’లో ప్రధాన పాత్రధారుల కోసం రూ.14 కోట్లు విలువ చేసే బంగారు, వజ్రాభరణాలు వాడాం. ఇందు కోసం సుమారు 15 కిలోల బంగారం వినియోగించాం. ‘దాన వీర శూర కర్ణ’ (Daana Veera Soora Karna)లో ఎన్టీఆర్‌ వాడిన బంగారు కిరీటం స్ఫూర్తితో నా చిత్రాల్లోనూ నిజమైన బంగారు ఆభరణాలే వాడుతున్నాం. ఈ సినిమాలో శకుంతల, దుష్యంతుడు, మేనక పాత్రలకు  ప్రముఖ డిజైనర్‌ నీతూ లుల్లా సారథ్యంలో ఆభరణాలను తయారు చేశారు. వసుంధర జువెలర్స్‌ 7 నెలలు శ్రమించి వీటిని తీర్చిదిద్దారు. ఇక కథానాయిక సమంత కోసం 14 రకాల ఆభరణాలను తయారు చేయించాం’’ అని గుణశేఖర్‌ తెలిపారు. పూర్తిగా చేతితో తయారు చేసిన ఆభరణాలు సినిమాలోని పాత్రలకు మరింత అందాన్ని, రాజసాన్ని తీసుకొచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు. 

కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా రూపొందిన ‘శాకుంతలం’ ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో శకుంతల పాత్రను సమంత పోషించగా.. దుష్యంతుడి పాత్రలో దేవ్‌ మోహన్‌ (Dev Mohan)నటించారు. భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న  ఈ సినిమాలో మోహన్‌ బాబు, గౌతమి తదితరులు కీలక పాత్రలు పోషించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని