oscars 2023: అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి లాక్కున్నట్లు అనిపించింది.. గునీత్‌ మోంగా ఆవేదన

దేశవ్యాప్తంగా ఆస్కార్‌ సంబరాలు జరుపుకోవడానికి ‘నాటు నాటు’ పాట ఒక కారణమైతే మరొకటి ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’.

Published : 18 Mar 2023 06:55 IST

దేశవ్యాప్తంగా ఆస్కార్‌ సంబరాలు జరుపుకోవడానికి ‘నాటు నాటు’ పాట ఒక కారణమైతే మరొకటి ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’. ఆస్కార్‌ ఉత్తమ డాక్యుమెంటరీ లఘు చిత్రంగా నిలిచిన ఈ చిత్రానికి కార్తికి గోన్సాల్వెన్స్‌ దర్శకత్వం వహించగా, గునీత్‌ మోంగా నిర్మించారు. వేదికపై ఈ పురస్కారాన్ని అందుకునేటప్పుడు ఎంతో సంబరపడి పోయారు ఈ ఇద్దరూ. కానీ ఆస్కార అకాడెమీ చేసిన ఓ చర్య వల్ల గునీత్‌ మోంగాకు చేదు అనుభవం ఎదురైంది. సాధారణంగా ఆస్కార్‌ అందుకున్న తర్వాత 45 సెకన్లు మాట్లాడేందుకు ప్రతి ఒక్కరికీ ఛాన్స్‌ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా అంతకు మించి ఎక్కువ సమయం మాట్లాడితే వెంటనే ఆ స్పీచ్‌ను కట్‌ చేసి మ్యూజిక్‌ ప్లే చేస్తారు. అయితే గునీత్‌ మోంగా.. మాట్లాడటం ప్రారంభించకముందే సంగీతం ప్లే చేశారు. దీంతో ఆమె.. తను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పకుండానే వెనుదిరిగారు. ఈ విషయాన్ని ఆమె ఇండియాకి తిరిగి వచ్చాకా విలేకరులతో పంచుకున్నారు. ‘‘ఆస్కార్‌ వేదికపై నేను మైక్‌ తీసుకొని మాట్లాడబోతుంటే మ్యూజిక్‌ రావడంతో నేను చెప్పాలనుకున్నవి చెప్పలేకపోయా. గొప్ప క్షణాలను ఇచ్చినట్లే ఇచ్చి నా దగ్గరి నుంచి లాక్కున్నట్లు అనిపించింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ వీరి తర్వాత బెస్ట్‌ యానిమేటెడ్‌ షార్ట్‌ పురస్కారాలను అందుకున్న వారు 45 సెకన్ల కన్నా కాస్త ఎక్కువసేపే మాట్లాడినా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ‘నా తర్వాత వేరే వారికి చాలా సమయం ఇవ్వడం మాత్రం సరైన పద్ధతి అనిపించలేదు’ అని చెప్పారు మోంగా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని