ప్రభుత్వ జోక్యంతోనే టికెట్‌ ధరల సమస్య.. అక్కడ థియేటర్‌కు రూ.కోటి లంచం ఇవ్వాలి!

గుణ్ణం గంగరాజు పేరు వినగానే మంచి అభిరుచి గల దర్శకుడని గుర్తు చేసుకుంటారు. సహజత్వానికి దగ్గరగా, వాస్తవికతకు అద్దం పట్టే ఆయన సినిమాలను ప్రజలు మెచ్చుకున్నారు. 32 నంది అవార్డులు, రెండు జాతీయ అవార్డులు ఆయనను వరించాయి. 

Updated : 22 Aug 2022 15:58 IST

అమృతం సీరియల్‌ను ఆడియో నవలగా తీసుకొస్తున్నా..: దర్శకుడు గుణ్ణం గంగరాజు

ఇంటర్నెట్‌ డెస్క్‌: గుణ్ణం గంగరాజు (Gunnam Gangaraju) పేరు వినగానే మంచి అభిరుచి గల దర్శకుడని గుర్తు చేసుకుంటారు. సహజత్వానికి దగ్గరగా, వాస్తవికతకు అద్దం పట్టే ఆయన సినిమాలను ప్రజలు ఆదరించారు. 32 నంది అవార్డులు, రెండు జాతీయ అవార్డులు ఆయనను వరించాయి. ‘లిటిల్‌ సోల్జర్స్‌’ చూసినపుడు పిల్లల అల్లరిని మనసారా ఆస్వాదిస్తాం.. ‘అమృతం’ సీరియల్‌ చూసి మెచ్చుకోని తెలుగువారుండరు.. కామెడీ నుంచి సీరియస్‌గా మారి వ్యక్తి స్వేచ్ఛ, స్వాతంత్య్రంపై ఆంగ్లంలో నవల రాస్తున్నారు.. గుణ్ణం గంగరాజు ఈటీవీ చెప్పాలని ఉంది.. కార్యక్రమానికి అతిథిగా వచ్చారు. తన సినీ విశేషాలను వివరించారు.

బ్యాంకులో ఉద్యోగం వదిలేసి సినిమా ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు..?

గంగరాజు: నా విద్యాభ్యాసం కాకినాడలో మొదలయ్యింది. ఐదేళ్ల వయసులోనే హాస్టల్‌లో పెట్టారు. తర్వాత అమ్మకూడా వచ్చింది. పదేళ్ల వయసులో హైదరాబాద్‌కు వచ్చేశాం. చదువు అయిపోయిన తర్వాత బ్యాంకులో కొలువు దొరికింది. సినిమాలపై ఆసక్తి నన్ను నిరంతరం వెంటాడుతూనే ఉండేది. ఎలాగైనా ఇండస్ట్రీలోకి రావాలనుకున్నా. అయితే, ఉద్యోగం వదిలేసిన తర్వాత భవిష్యత్తు ఎలా అనే భయం వేసింది. ‘లిటిల్‌ సోల్జర్స్‌’ కథ 12 ఏళ్ల క్రితమే అనుకున్నా. ఎవరిని కలవాలో తెలియదు. చాలా జాప్యం జరిగింది.

లిటిల్‌ సోల్జర్స్‌తో పేరు వచ్చినా డబ్బు బాగా పోయినట్టు తెలిసింది..?

గంగరాజు: షూటింగ్‌ చాలా రోజులు పట్టింది. ఇన్ని రోజులు బెన్‌హర్‌ సినిమా తీస్తున్నారా అని ఇతర డైరెక్టర్లు అనేవారు. సినిమా వందరోజులు ఆడినా డబ్బు మాత్రం పోయింది.

ఒక సినిమా తర్వాత మరో సినిమాకు గ్యాప్‌ ఎక్కువగా ఎందుకు తీసుకున్నారు..?

గంగరాజు: నేను తీసుకోలేదు. ఇచ్చారు. ఎవరూ కూడా నా సినిమా చూసి బాగుందని కొత్త సినిమా ఇవ్వలేదు. నేనే కథ రాసుకొని మళ్లీ నేనే సినిమా తీసుకునే వాడిని.

అమృతం సీరియల్‌ ఆలోచన ఎలా వచ్చింది..?

గంగరాజు: చందు కామెడీ సీరియల్‌ చేయాలనుకున్నారు. టీవీ గురించి అంతగా మాకు తెలియదు. ఏడు ఎపిసోడ్స్‌ తీసిన తర్వాత ఏ ఛానల్‌ అయినా తీసుకుంటుందని తీసుకెళ్లాం. ఎవరూ తీసుకోలేదు. చాలా ఖర్చు పెట్టి చేశాం. చాలా బాధ అనిపించింది. జెమినిలో స్లాట్‌ తీసుకున్నాం. రెండేళ్లు కష్టాలు అనుభవించాం. తర్వాత డబ్బులు వచ్చాయి. ఆరేళ్లపాటు నాన్‌స్టాప్‌గా కొనసాగింది. 

సీతారామశాస్త్రితో మీకున్న అనుభవాలు, జ్ఞాపకాలు చెబుతారా..?

గంగరాజు: ఇద్దరి వయసు దాదాపుగా సమానమే. ఇద్దరిదీ కాకినాడే. ఇద్దరం ఒకే ఏడాది పెళ్లి చేసుకున్నాం. తనతో మాట్లాడుతుంటే సమయం తెలియదు. ఆయనో గొప్ప జ్ఞాని.

రసూల్‌తో మీకున్న అనుబంధం గురించి చెప్పండి..?

గంగరాజు: కొత్తవాళ్లు..చిన్న పిల్లలతో సినిమా రసూల్‌ చేస్తాడో లేదో అనుకున్నాం. కానీ, అంగీకరించారు. ఆయన ఆ సినిమాకు ప్రాణం పెట్టారు. కావ్య ఇంగ్లాండ్‌ నుంచి వస్తుందనేసరికి బబ్లీగా ఉంటుందని అనుకున్నాం. కానీ పీలగా ఉంది. పాత్రకు సరిపోదనుకుంటే..రసూల్‌ పట్టుబట్టి తీసుకున్నారు. 

కావ్యకు భాష రాకపోయినా తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకొని జాతీయ అవార్డు సాధించడంతో మీ పాత్ర ఎంతో ఉంది..?

గంగరాజు: అప్పటికి కావ్యకు మూడేళ్ల మూడు నెలలు. తెలుగు ఒక్కముక్క రాదు. అయినా సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకుంది.

మీకు, రాంగోపాల్‌వర్మకు చక్కని స్నేహబంధం ఉందని విన్నాం. దాని గురించి చెప్పండి..?

గంగరాజు: ‘శివ’ సమయంలో రాముని కలిశా. ముందుగా వాళ్లన్నయ్యకు యాడ్‌ చేశాం. ఆ సమయంలో రాము సహాయం చేయాలని కోరారు. అలా కలుసుకున్నాం. 

యాడ్‌ ఏజెన్సీ, గ్రీటింగ్‌ కార్డ్స్‌ ముద్రణ ఎలా సాగింది..?

గంగరాజు: ఉద్యోగం మానేసిన తర్వాత ఏదో ఒకటి చేయాలని యాడ్ ఏజెన్సీలో చేశా. తర్వాత గ్రీటింగ్‌ కార్డ్‌ల తయారీని కొత్త తరహాగా చేసి ఆర్చీస్‌ వాళ్లతో కలిసి కొనసాగాం. కొత్త ఒరవడి తీసుకొచ్చినా పైరసీతో ఆ బిజినెస్‌ పోయింది.

మీది ప్రేమ వివాహమా..? వివాహబంధం ఎలా ఉండాలి..?

గంగరాజు: తను టెన్త్‌ రాసి హైదరాబాద్‌ వచ్చింది. నేను ఇంటర్‌లో ఉన్నా. ఇద్దరం కలిశాం. ఏడేళ్ల తర్వాత పెళ్లి చేసుకున్నాం. శాశ్వతంగా అని చెప్పలేను కానీ, ఉన్నంత కాలం బాగుండాలి. విడిపోయినా అంగీకారంతో విడిపోవచ్చు కదా. 

‘అమృతం’ తర్వాత ‘నాన్న’ చేశారు. అందులో కూడా ప్రయోగాలు చేశారని విన్నాం..?

గంగరాజు: మొదటి ప్రయోగం మల్లాది కథ కొనడం... అప్పటికే అది సినిమాగా కూడా వచ్చింది. కొత్తగా తీస్తామనే నమ్మకంతో ముందుకు వెళ్లాం. రాధామధులో అసలు విలన్‌ ఉండరు. ‘నాన్న’ కూడా అదే తరహాలో చేశాం.

‘అమ్మమ్మ డాట్‌ కమ్‌’ జర్నీ ఎలా మొదలయ్యింది..?

గంగరాజు: పాలగుమ్మి పద్మరాజు కూతురు సీత..సినిమాకు కథ తీసుకున్నాం. చివరికి సీరియల్‌గా మారింది. జయలలిత కామెడీ ఇతర పాత్రలు చేశారు. అమ్మమ్మ పాత్రకు బాగా సరిపోయారు. శాస్త్రిగారి ఫేవరేట్‌ టైటిల్‌ పాట అది. దాదాపుగా దానికి పనిచేసిన వారందరూ కొత్తవాళ్లే.

అయితే ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది..ఎలా..?

గంగరాజు: సినిమా చిన్నదయినా గట్టిగా అరవాలి. అన్ని సినిమాలు ఒకేలా ఉండవు. నాలుగు కేంద్రాల్లో వందరోజులు ఆడింది. యాక్టర్లు ఎక్కువ కనిపించలేదు. అంతా భిన్నంగా చేశాం.

‘అనుకోకుండా ఒకరోజు’ సినిమా ఎలా మొదలయ్యింది..?

గంగరాజు: ఈ సినిమా విడుదల సమయంలో జగపతిబాబు చిత్రం లేదు. రెండు వారాల తర్వాత వేశాం. ఆయనతో అలా చేయడం సరదా అనిపించింది. 

జస్ట్‌ ఎల్లో చాలా మందికి లైఫ్‌ ఇచ్చింది. భవిష్యత్తులో ఇంకా ఎలాంటి సినిమాలు వస్తాయి..?

గంగరాజు: జస్ట్‌ ఎల్లో, లైట్‌బాక్స్‌ మా అబ్బాయిది.. ఇద్దరం కలిసి చేస్తున్నాం. ఇపుడు ఓటీటీ వచ్చింది కదా.. ఎక్కువ శాతం దానికే కేటాయిస్తున్నాం. అరడజను సిరీస్‌, సినిమాలు రెండు, మూడున్నాయి. 

మీ శిష్యురాలు నందినీరెడ్డి ఈ స్థాయికి రావడం ఎలా అనిపిస్తుంది..?

గంగరాజు: చాలా ఆనందంగా ఉంటుంది. ఆమె చేసిన ‘ఓ.. బేబీ’ చాలా ఇష్టం.

మీలో రచయిత, దర్శకుడు ఉన్నారు. మీకు ఎవరిష్టం..?

గంగరాజు: నాలో రచయిత ఉన్నాడని ముందుగా తెలియలేదు. దర్శకత్వం చేయడానికి రాసుకోవాలనుకున్నాను. డైలాగులు ఇతరులతో రాయించుకోవాలనుకున్నా.. అనుకున్నట్టుగా రాకపోవడంతో నేనే రాసుకున్నా. అమృతంతో రచయితగా మరింత చేయి తిరిగింది.

దర్శకులే కథ రాయడంతో బాగా రావడం లేదనే అభిప్రాయం ఉంది..?

గంగరాజు: కథ ఎవరు రాసినా బాగుండాలి. దర్శకుడే కథ రాస్తే ఏడాదిన్నరకు ఓ సినిమా తీయొచ్చు. కథ వేరేవాళ్లు ఇస్తే ఏడాదికి రెండు సినిమాలు చేసే అవకాశం ఉంటుంది అంతే..!

నంది అవార్డులు, జాతీయ అవార్డులు వేటికి వచ్చాయి..?

గంగరాజు: చాలా వరకు సీరియల్స్‌కు వచ్చాయి. లిటిల్‌ సోల్జర్స్‌కు 8 నంది పురస్కారాలు వచ్చాయి. ఇందులోని కావ్యకు జాతీయ అవార్డు వచ్చింది.

సీరియల్స్‌ హిట్‌ అయినా మళ్లీ తీయక పోవడానికి కారణం ఏంటీ..?

గంగరాజు: సీరియళ్లకు క్రమేపి ఆదాయం తగ్గిపోయింది. జనం మెచ్చలేదు. అందుకే చేయలేదు. ఎక్కువ రోజులు చేయాలంటే కష్టం. ఓటీటీకి అయితే చేస్తా. 

తెలుగు పరిశ్రమ పాన్‌ ఇండియా స్థాయికి వెళ్లింది..? ఇంకా చాలా సినిమాల్లో సృజనాత్మకత తక్కువగా ఉందనే వాదన వస్తోంది...?

గంగరాజు: దాదాపుగా 95 శాతం తెలిసిన కథలనే చేస్తారు. కొందరే పరిధి దాటి బయటకు వెళ్తారు. చాలా వరకు ఒకే ఫార్మాట్‌కు అలవాటు పడి తీస్తారు. అప్పుడప్పుడు మాత్రమే భిన్నమైన సినిమాలు వస్తాయి.

మీ వారసులు ఏం చేస్తున్నారు..?

గంగరాజు: పెద్దబ్బాయి సన్నీ నాతోనే ఉంటున్నారు. చిన్నబ్బాయి విహంగ్‌ డాక్టర్‌ భాస్కరరావు కంపెనీలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమం చేస్తున్నాడు.

టికెట్ల ధర సమస్యగా మారింది. ఇది పరిష్కారం కావాలంటే ఎలా..?

గంగరాజు: ప్రభుత్వ జోక్యంతోనే సమస్యగా మారింది. మిగిలిన పనులను వదిలేసి వీటిపై పడ్డారు. ఇది నిర్మాత, థియేటర్‌ యజమాని, ప్రేక్షకులకు సంబంధించిన అంశం. వేరేవాళ్లకు సంబంధం లేదు. టికెట్‌ ధరకంటే పాప్‌కార్న్‌కు ధర ఎక్కువ. కర్ణాటకలో సినిమా థియేటర్‌కు కోటి లంచం ఇవ్వాలి. అన్ని నిబంధనలు అమలు చేసినా అనుమతి రాదు. 

మీ నుంచి వచ్చే ప్రాజెక్టులేవి..?

గంగరాజు: ఇంగ్లిష్‌ నవల రాశాను. రెండు, మూడు నెలల్లో విడుదల చేస్తా. పేరు విహంగం. ఉచితాలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. నేను ఎప్పుడో చెప్పా. ప్రభుత్వాల తీరు గురించి చర్చించా. ముందుగా ఇంగ్లిష్‌లో విడుదల చేసి ఆ తర్వాత తెలుగులో అనువాదం చేస్తా.

అమృతం నవలగా రాస్తున్నారట.. ఎంతవరకు వచ్చింది..?

గంగరాజు: ఒక ఎపిసోడ్‌ అయిపోయింది. ఒక్కో ఎపిసోడ్‌ చిన్న కథగా ఉంటుంది. పుస్తకం చదువుతారో లేదో తెలియదు. అందుకే నవలను ఆడియో బుక్‌గా తీసుకొస్తున్నాం.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని