Gurtunda Seetakalam: అడివి శేష్‌ వరుస ‘హిట్‌’లు కొట్టేందుకు కారణమదే: సత్యదేవ్‌

‘గుర్తుందా శీతాకాలం’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్. అడివి శేష్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Published : 06 Dec 2022 01:06 IST

హైదరాబాద్‌: అడివి శేష్‌ (Adivi Sesh) తనకు మంచి స్నేహితుడని, అతను ఏ కథ ఓకే చేస్తే అది హిట్ అవుతుందని సత్యదేవ్‌ (Satya Dev) అన్నారు. ‘గుర్తుందా శీతాకాలం’ (Gurtunda Seetakalam) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వేదికపై ఆయన మాట్లాడారు. సత్యదేవ్‌ హీరోగా దర్శకుడు నాగశేఖర్‌ తెరకెక్కించిన చిత్రమిది. తమన్నా, మేఘా ఆకాశ్‌, కావ్య కథానాయికలు. ఈ సినిమా డిసెంబరు 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన వేడుకకు అడివి శేష్‌ అతిథిగా హాజరయ్యారు.

సత్యదేవ్‌ బాగా బిజీ...

‘‘నేను యూఎస్‌లో ఉండి, సినిమాలు చేయాలని కలలు కంటున్నప్పుడు ‘హ్యాపీడేస్‌’తో తమన్నా నాకు స్ఫూర్తినిచ్చింది. మేం ఐదారేళ్లకు ఒకసారి కలుసుకుంటూ ఉంటాం. ఈసారి ఒకే సినిమా సెట్స్‌లో కలుసుకోవాలని కోరుకుంటున్నా. నా చిత్రం ‘క్షణం’లో సత్యదేవ్‌ నటించాడు. ఆ తర్వాత తన కెరీర్‌ ఊపందుకుంది. ‘ఎవరు’ సినిమా కోసం సంప్రదించా. ఉత్తరాదిలో సినిమాలు చేస్తున్నా అని బదులిచ్చాడు. ‘మేజర్‌’ సినిమా కోసం ప్రయత్నించినప్పటికి తను హీరో అయిపోయాడు. ‘హిట్‌ 2’ కోసం అడుగుదామనుకుంటే .. ‘గాడ్‌ ఫాదర్‌’లో మెయిన్‌ విలన్‌గా చేస్తున్నాడని తెలిసి షాక్‌ అయ్యా (నవ్వుతూ..). ఈ సినిమా మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నా’’ అని శేష్‌ అన్నారు.

శేష్‌ వచ్చాడు.. హిట్‌ అవుతుంది: సత్యదేవ్‌

‘‘శేష్‌ నాకు మంచి స్నేహితుడు. దర్శకులు తనకు కథ చెబితే ఎన్నో ప్రశ్నలు వేస్తాడు. అందులోని లోపాలను చెబుతాడు. అలా చేయడం వల్లే వరుస హిట్‌లు అందుకున్నాడు. ఆయనకు విజయం వస్తే నాకు వచ్చినట్టుగానే భావిస్తా. ఆయన పట్టుకున్న స్టోరీ హిట్‌ అవుతుంది. మా సినిమా ఈవెంట్‌కు వచ్చాడు కాబట్టి ఇదీ విజయం అందుకుంటుందనుకుంటున్నా. తమన్నా, మేఘా ఆకాశ్‌, కావ్యలు ఈ సినిమాకు కీలకం. ఆ తర్వాతే నేను. పాత్రలే కనిపిస్తాయి తప్ప నటులు కనిపించరు’’ అని సత్యదేవ్‌ చెప్పారు.

‘‘నేను వేసవిని తప్ప శీతాకాలాన్ని ఇష్టపడేదాన్ని కాదు. ఈ సినిమాలో నటించిన తర్వాత వింటర్‌ నచ్చింది. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమాలోని సత్యదేవ్‌ నటన నన్ను బాగా ఆకట్టుకుంది. అప్పుడే ఆయనతో కలిసి నటించాలనుకున్నా. అనుకున్న కొన్ని రోజుల్లోనే ‘గుర్తుందా శీతాకాలం’ అవకాశం వచ్చింది’’ అని తమన్నా అన్నారు. ‘‘నన్ను ఇప్పటి వరకూ ఆదరించిన కన్నడ ప్రేక్షకులు, నిర్మాతలు, నన్ను ఆహ్వానిస్తున్న తెలుగు చలన చిత్ర పరిశ్రమ వారికి కృతజ్ఞతలు. సత్యదేవ్‌ నుంచి తెలుగు మాట్లాడడం నేర్చుకున్నా. శీతాకాలం అంటే నాకు బాగా ఇష్టం. అందుకే ఆ సీజన్‌లోనే నా సినిమాలను షూట్‌ చేస్తా. వేసవిలో పోస్ట్ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు చేస్తుంటా’’ నాగశేఖర్‌ తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని