Guru Dutt: భగ్న స్వాప్నికుడు గురుదత్‌

దాదాపు రెండు దశాబ్దాల సినీ ప్రయాణంలో ‘ప్యాసా’ (1957), ‘కాగజ్‌ కే ఫూల్‌’ (1959) లాంటి ఆణిముత్యాలను చిత్రసీమకు ఇచ్చారాయన. 1925 జులై 9న కర్ణాటకలో గురుదత్‌ పుట్టారు.

Published : 09 Jul 2024 01:22 IST

దర్శక దిగ్గజం శతజయంతి నేటి నుంచి

‘‘ఇస్‌ భరీ దునియామే, కోయీ భీ హమారా నా హువా! ఘైర్‌ తో ఘైర్‌ థే, అప్నోకా సహారా నా మిలా!’’ (ఈ విశాల ప్రపంచంలో నావాళ్లంటూ ఎవరూ లేరు.. పరాయివాళ్లు సరే, నావాళ్లు కూడా తోడుగా నిలువలేదు).. ‘భరోసా’ చిత్రం కోసం గురుదత్‌పై చిత్రీకరించిన ఈ పాట ఆయన నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఇదే కాదు.. గురుదత్‌ చిత్రాల్లోని ఏ విషాద గీతం తీసుకున్నా తన కోసమే రాయించుకున్నట్టుగా ఉంటుంది. 39 ఏళ్ల వయసులో సహజ మరణమో, ఆత్మహత్యో ఇప్పటికీ తెలియని స్థితిలో కన్నుమూసిన గురుదత్‌ జీవితం అంత విషాదమయంగా సాగింది.

దాదాపు రెండు దశాబ్దాల సినీ ప్రయాణంలో ‘ప్యాసా’ (1957), ‘కాగజ్‌ కే ఫూల్‌’ (1959) లాంటి ఆణిముత్యాలను చిత్రసీమకు ఇచ్చారాయన. 1925 జులై 9న కర్ణాటకలో గురుదత్‌ పుట్టారు. (ఆ తర్వాత వారి కుటుంబం జీవనం కోసం కలకత్తాకు చేరడంతో ఆయన విద్యాభ్యాసం అక్కడే జరిగింది. ప్రముఖ నృత్య దర్శకుడు ఉదయ్‌శంకర్‌ వద్ద నాట్యంలో శిక్షణ కూడా పొందారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించని కారణంగా కళాశాలకు వెళ్లి చదువుకోవాలన్న తన కల నెరవేరలేదు. హైస్కూలు విద్య ముగియగానే ఉద్యోగం వెతుక్కోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే 1940లో బొంబాయికి చేరుకున్నారు.)

నృత్యంలో ప్రవేశం ఉండటంతో ప్రభాత్‌ స్టూడియోలో గురుదత్‌ కొరియోగ్రాఫర్‌గా చేరారు. అక్కడ నాటి వర్ధమాన హీరో దేవానంద్‌తో పరిచయం గాఢమైన స్నేహబంధంగా మారింది. అప్పుడే మిత్రులిద్దరూ ఓ ఒప్పందం చేసుకున్నారు. ఇద్దరిలో ఎవరు ముందు పైకొచ్చినా మరొకరికి అండగా నిలవాలని. తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగి సొంత నిర్మాణసంస్థ  ప్రారంభించిన దేవానంద్‌ తమ ‘నవకేతన్‌’ బ్యానర్‌పై రెండోచిత్రంగా మిత్రుడు గురుదత్‌ దర్శకత్వంలో ‘బాజీ’ (1951) పేరుతో నేరకథా చిత్రాన్ని తీశారు. ఈ సినిమా ఘనవిజయం సాధించి దత్‌కు మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత ‘ఆర్‌ పార్‌’, ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ 55’, ‘చౌదవీ కా చాంద్‌’ ఇలా వరుసగా విజయవంతమైన చిత్రాలు గురుదత్‌ ఖాతాలో చేరాయి. సొంతంగా చిత్రనిర్మాణం ప్రారంభించాక రాజ్‌ఖోస్లాను దర్శకుడిగా పెట్టి మిత్రుడు దేవానంద్‌తో మరో నేరకథాచిత్రం ‘సీఐడీ’ (1956) తీసి ఘనవిజయం అందుకున్నారు. 1962లో వచ్చిన గురుదత్, మీనాకుమారి చిత్రం ‘సాహెబ్‌ బీవీ ఔర్‌ గులాం’ రాష్ట్రపతి రజత పతకాన్ని అందుకొంది. తన చిత్రాలకు అద్భుతమైన పాటలు, సంగీతం కోరి.. కొసరి చేయించుకున్న ఉత్తమాభిరుచి గల రసజ్ఞుడు గురుదత్‌. మరో మిత్రుడు జానీవాకర్‌ హాస్యం ఆయన చిత్రాలకు అదనపు ఆకర్షణగా మారింది.

చరిత్రలో నిలిచిన కళాఖండం ‘ప్యాసా’

గురుదత్, వహీదా రెహ్మాన్‌ కలయికలో వచ్చిన ‘ప్యాసా’ చిత్రం భారత చలనచిత్ర చరిత్రలో ఓ కళాఖండంగా నిలిచిపోయింది. ‘టైమ్‌’ మ్యాగజీన్‌ రూపొందించిన 100 గొప్ప చిత్రాల జాబితాలో ఇది చోటు దక్కించుకొంది. ఈ చిత్రం తెలుగులో శోభన్‌బాబు హీరోగా ‘మల్లెపూవు’ పేరుతో వచ్చింది. ‘ప్యాసా’ ఆర్థికంగానూ మంచి విజయం సాధించగా, గురుదత్‌ ప్రాణం పెట్టి తీసిన ‘కాగజ్‌ కే ఫూల్‌’ ఘోర పరాజయం ఆయనను తీవ్రంగా కుంగదీసింది. తర్వాత మళ్లీ దర్శకత్వం జోలికి దత్‌ వెళ్లలేదు. ఈ సినిమా ప్రివ్యూ చూసిన రాజ్‌కపూర్‌ చాలా అడ్వాన్సుగా ఆలోచించి గొప్ప సినిమా తీశారని ప్రశంసిస్తూ, పైసలు మాత్రం రావని ఫలితం ముందే తేల్చి చెప్పేశారు. అయితే, ఇదే చిత్రం తర్వాతి కాలంలో విమర్శకుల ప్రశంసలు పొంది ఓ కల్ట్‌ మూవీగా నిలిచిపోయింది. 11 విశ్వవిద్యాలయాల్లో ఫిల్మ్‌ కోర్సు విద్యార్థులకు ఇది అధ్యయన పాఠంగా మారింది. మన దేశంలో తొలి సినిమాస్కోప్‌ చిత్రం కూడా ఇదే. ఈ రెండు చిత్రాల వెనుక ఉన్న మరో అదృశ్యహస్తం సినిమాటోగ్రాఫర్‌ వి.కె.మూర్తి (2010లో దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత). షాడో అండ్‌ లైట్‌ విధానంలో ఈ చిత్రాలకు మూర్తి సమకూర్చిన కెమెరా మెళకువల గురించి నేటికీ ఎంతోమంది గొప్పగా చెబుతారు.

ప్రేమ.. పెళ్లి.. విషాదం

1953లో నాటి గాయని గీతారాయ్‌ను ప్రేమించి పెళ్లాడారు గురుదత్‌. ముగ్గురు సంతానంతో అన్యోన్యంగా సాగుతున్న వీరి సంసారంలో కథానాయిక వహీదా రెహ్మాన్‌ రూపంలో తుపాను చెలరేగింది. వహీదాతో గురుదత్‌ వరుసగా చిత్రాలు తీయడంతో వీరిద్దరి స్నేహంపై పరిశ్రమ చెవులు కొరుక్కొంది. గీత పిల్లలను తీసుకొని వేరే ఇంటికి మారింది. ఒంటరితనంలో తాగుడుకు బానిసగా మారిన గురుదత్‌ నిద్రమాత్రలు కూడా విరివిగా వాడేవారని చెబుతారు. అనుమానం పెనుభూతంగా మారి వీరి సంసారనావను కుదిపేసి ఇద్దరి జీవితాలనూ నాశనం చేసింది. నిర్మాతగా 5 చిత్రాలు తీసి, 8 సినిమాలకు దర్శకత్వం వహించిన గురుదత్‌ తన కెరీర్‌ మొత్తంలో కేవలం 20 చిత్రాల్లో నటించి ఉంటారు. 1964లో వచ్చిన హృషికేశ్‌ ముఖర్జీ సినిమా ‘సాంఝ్‌ ఔర్‌ సవేరా’ గురుదత్‌ ఆఖరిచిత్రం. గీత రచయిత మజ్రూహ్‌ సుల్తాన్‌పురి ఓ ఇంటర్వ్యూలో అన్నట్టు.. ఈ దర్శక మేధావి అల్పాయుష్కుడు కాకపోతే మరెన్ని కళాఖండాలను మనం చూసేవారమో! 

జి.ఎస్‌.జమీర్‌ హుసేన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని