Guruvayoor Ambalanadayil Review: రివ్యూ: ‘గురువాయూర్‌ అంబలనాదయిల్‌’.. మలయాళ బ్లాక్‌ బస్టర్‌ ఎలా ఉంది?

Guruvayoor Ambalanadayil Review: పృథ్వీరాజ్‌ సుకుమార్‌, బసిల్‌ జోసెఫ్‌ కీలక పాత్రల్లో విపిన్‌ దాస్‌ దర్శకత్వం వహించిన ‘గురువాయూర్‌ అంబలనాదయిల్‌’ ఎలా ఉందంటే?

Updated : 01 Jul 2024 17:18 IST

Guruvayoor Ambalanadayil Review in telugu; చిత్రం: గురువాయూర్‌ అంబలనాదయిల్‌; నటీనటులు: పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, బసిల్‌ జోసెఫ్‌, నిఖిలా విమల్‌, అనస్వర రాజన్‌, యోగిబాబు, బిజు సంతోష్‌, అజు వర్గీస్‌, ఇర్షద్‌ తదితరులు; సంగీతం: అంకిత్‌ మేనన్‌, డాబ్జీ; సినిమాటోగ్రఫీ: నీరజ్‌ రెవి; ఎడిటింగ్‌: జాన్‌ కుట్టి; రచన: దీపు ప్రదీప్‌; నిర్మాత: సుప్రియ మేనన్‌, ముఖేష్‌ ఆర్‌.మేథా, సీవీ సారథి; దర్శకత్వం: విపిన్‌ దాస్‌; స్ట్రీమింగ్‌ వేదిక: డిస్నీ+హాట్‌స్టార్‌

గత కొన్నేళ్లుగా వైవిధ్య చిత్రాలతో ప్రేక్షకులను పలకరిస్తోంది మలయాళ చిత్ర పరిశ్రమ. అలా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకువచ్చిన చిత్రం ‘గురువాయూర్‌ అంబలనాదయిల్‌’. మే నెలలో కేరళలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా రూ.90 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ఓటీటీ వేదిక డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. మరి ఈ మూవీ ఎలా ఉంది? (Guruvayoor Ambalanadayil Review) తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా?

కథేంటంటే: విను రామచంద్రన్‌ (బసిల్‌ జోసెఫ్‌) దుబాయ్‌లో పనిచేస్తూ ఉంటాడు. పార్వతి (నిఖిలా విమల్‌)తో బ్రేకప్‌ అయి ఐదేళ్లు అయినా ఆ జ్ఞాపకాలు మర్చిపోలేకపోతుంటాడు. ఆమె తనని మోసం చేసిందంటూ ప్రచారం చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో వినుకు అంజలి (అనస్వర రాజన్‌)తో నిశ్చితార్థం అవుతుంది. అంజలి అన్నయ్య ఆనంద్‌ (పృథ్వీరాజ్‌ సుకుమారన్‌)కు విను పాత ప్రేమ గురించి తెలిసి, ఆ జ్ఞాపకాల నుంచి బయటపడేందుకు తన మాటలతో అతడిని ఊరడిస్తూ ఉంటాడు. అయితే, ఆనంద్‌ లైఫ్‌ కూడా ఏమీ హ్యాపీగా ఉండదు. కొన్ని కారణాల వల్ల భార్యకు దూరంగా జీవిస్తూ ఉంటాడు. తనకి ఎంతో సపోర్ట్‌గా ఉన్న ఆనంద్‌ జీవితంలో సంతోషాన్ని నింపాలని విను అనుకుంటాడు. దీంతో పెళ్లికి కాస్త ముందుగానే ఇండియాకు వచ్చి ఆనంద్‌ను కలుస్తాడు. అతడు పెళ్లి చేసుకుంది తన మాజీ ప్రేయసి పార్వతి అని తెలిసి విను షాక్‌ అవుతాడు. మరి ఈ విషయం తెలిసిన ఆనంద్‌ ఏం చేశాడు? తన చెల్లి అంజలిని వినుకు ఇచ్చి పెళ్లి చేశాడా? ఈ క్రమంలో ఎదురైన పరిస్థితులు ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే: అందరికీ తెలిసిన కథనే మరోసారి చెప్పాల్సి వచ్చినప్పుడు స్క్రీన్‌ప్లే పకడ్బందీగా రాసుకుని, తెరపై ఎంత ఆసక్తికరంగా తీర్చిదిద్దామన్న దానిపై ఆ చిత్ర విజయం ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో ‘గురువాయూర్‌ అంబలనాదయిల్‌’ (Guruvayoor Ambalanadayil Review) చిత్ర బృందం విజయం సాధించింది. ఫస్ట్‌ ఫ్రేమ్‌ నుంచి చివరివరకూ తెరపై కనిపించే ప్రతీ పాత్ర ప్రేక్షకుడికి గిలిగింతలు పెడుతూ తీర్చిదిద్దిన విధానం బాగుంది. విను రామచంద్రన్‌, ఆనంద్‌ పాత్రలను పరిచయం చేస్తూ కథను మొదలుపెట్టిన దర్శకుడు నెమ్మదిగా వారి ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ వచ్చాడు. ప్రేమ విఫలమై విను, భార్య దూరమై ఆనంద్‌ ఒకరి ఆనందం కోసం ఒకరు మాటలతో సాయం చేసుకుంటూ ఒకరికొకరు భరోసా ఇచ్చుకుంటూ సాగే సన్నివేశాలు సరదాగా ఉంటాయి. ఎప్పుడైతే ఆనంద్‌ తన భార్యను తీసుకురావడానికి అత్తారింటికి వెళ్లాడో అక్కడినుంచి కథ, కథనాలు ప్రేక్షకుడికి వినోదాన్ని పంచుతూ సాగుతాయి. విను ప్రేమించిన అమ్మాయి ఆనంద్‌కు భార్య కావడం, ఆనంద్‌ చెల్లిలితోనే విను నిశ్చితార్థం కావడం తెలిసేలా విరామ సన్నివేశాలకు ఇచ్చిన ట్విస్ట్‌ నవ్విస్తూనే తర్వాత ఏం జరుగుతుందా? అన్న ఆసక్తి ప్రేక్షకుడికి కలిగేలా స్క్రీన్‌ప్లేను తీర్చిదిద్దిన విధానం బాగుంది. అక్కడినుంచి విను, ఆనంద్‌ల మధ్య టామ్‌ అండ్‌ జెర్రీ ఆట సాగుతుంది. ఆయా సన్నివేశాలు ప్రేక్షకులకు నూటికి నూరుపాళ్లు వినోదాన్ని పంచుతాయి. అయితే, కొన్నిచోట్ల అవి మరీ శ్రుతిమించినట్లు అనిపించినా సినిమాలో లీనమైన ప్రేక్షకుడు ఆ సంగతి మర్చిపోయేలా సన్నివేశాలను రాసుకున్న తీరు బాగుంది. ఇక యోగిబాబు పాత్ర ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆ నవ్వులు రెట్టింపు అవుతాయి. గురువాయూర్‌ ఆలయం నేపథ్యంలో వచ్చే పతాక సన్నివేశాలు ఒక హై జోష్‌తో ముగుస్తాయి.

ఎవరెలా చేశారంటే: వైవిధ్యమైన పాత్రలు చేయడంలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) ముందుంటారు. తెలుగు ప్రేక్షకులకు ఆయన సీరియస్‌ పాత్రలే గుర్తొస్తాయి. కానీ, ఇందులో ఆనంద్‌గా ఆయన నటనలో మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. తన చెల్లిని చేసుకోబోయేవాడు తన భార్య మాజీ ప్రియుడు అని తెలిసిన తర్వాత ఆయన పలికించిన హావభావాలు, పెళ్లి అడ్డుకునేందుకు ఆయన చేసే చర్యలు తెగ నవ్విస్తాయి. పృథ్వీరాజ్‌కు దీటుగా బసిల్‌ జోసెఫ్‌ (Basil Joseph) నటించారు. ఒకరకంగా తెరపై నవ్వులు పంచడంలో ఇద్దరి పాత్రలు నువ్వా-నేనా అన్నట్లు సాగుతాయి. అనస్వర రాజన్‌, నిఖిలా విమల్‌, యోగిబాబు తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. అన్నీ సమపాళ్లలో కుదిరాయి. తెలుగు డబ్బింగ్‌ చెప్పించిన తీరు చాలా బాగుంది. తెరపై కొన్ని పాత్రలు తెలియకపోయినా అచ్చం తెలుగు సినిమా చూస్తున్న భావన కలుగుతుంది. ‘జయ జయ జయ జయహే’లాంటి  కామెడీ ఎంటర్‌టైనర్‌ను తీసిన విపిన్‌ దాస్‌ మరోసారి అదే జానర్‌ను ఎంచుకుని విజయం సాధించారు. దీపు ప్రదీప్‌ రచన, విపిన్‌ దాస్‌ టేకింగ్‌ సినిమాను విజయ పథంలో నడిపాయి.

కుటుంబంతో చూడొచ్చా: నిరభ్యంతరంగా చూడొచ్చు. ఎలాంటి అసభ్య పదాలు, సన్నివేశాలు లేకుండా తీశారు. రెండున్నర గంటల పాటు కామెడీ రోలర్‌ కోస్టర్‌ ఎక్కిన అనుభూతి కలుగుతుంది. డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా తెలుగులోనూ స్ట్రీమింగ్‌ అవుతోంది.

  • బలాలు
  • + నటీనటులు
  • + కామెడీ
  • + రచన, దర్శకత్వం
  • బలహీనతలు
  • - తెలిసిన కథే కావడం
  • చివరిగా: ఎంటర్‌టైనింగ్‌ గురువాయూర్‌ అంబలనాదయిల్‌ (Guruvayoor Ambalanadayil Review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని