Hansika: ట్రెండింగ్‌ న్యూస్‌.. అప్పుడు హన్సిక హార్మోన్‌ ఇంజెక్షన్లు తీసుకుందా?

Hansika: కథానాయికగా ఎదిగే క్రమంలో హార్మోన్‌ ఇంజెక్షన్లు తీసుకున్నారన్న వార్తలపై హన్సిక, ఆమె తల్లి తాజాగా స్పందించారు. అలాంటి తీసుకోవాలంటే తాము బిలియనీర్లు అయి ఉండాలని అన్నారు.

Published : 19 Feb 2023 01:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో అలరించిన కథానాయిక హన్సిక (Hansika). తాను ప్రేమించిన
సోహైల్‌ కథూరియాను ఇటీవల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ వివాహ వేడుక ‘లవ్‌ షాదీ డ్రామా’ (love shaadi drama) పేరుతో డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇందులో తన కెరీర్‌లో ఎదురైన అనేక అనుభవాలకు సంబంధించిన ఆసక్తికర విషయాలను హన్సిక పంచుకున్నారు. కథానాయికగా హన్సిక ఎంట్రీ ఇచ్చే క్రమంలో హార్మోన్‌ ఇంజెక్షన్లు తీసుకున్నట్లు అప్పట్లో వచ్చిన వార్తలపైనా కూడా స్పందించారు.

హన్సిక బాల నటిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. 2003లో హృతిక్‌ రోషన్‌ కథానాయకుడిగా నటించిన ‘కోయి మిల్‌ గయా’లో చిన్న పిల్లగా కనిపించింది. ఆ తర్వాత ‘జాగో’, ‘హమ్‌ కౌన్‌ హై’, ‘అబ్రక దబ్ర’ చిత్రాల్లోనూ నటించింది. 2007లో పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ నటించిన ‘దేశ ముదురు’తో కథానాయికగా వెండితెరకు పరిచయమైంది. అంటే కేవలం బాలనటిగా కనిపించిన తర్వాత నాలుగేళ్లకే హన్సిక హీరోయిన్‌ కావడంపై అప్పట్లో తీవ్ర చర్చ నడిచింది. యువతిగా కనిపించేందుకే హన్సిక హార్మోన్‌ ఇంజెక్షన్లు తీసుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ, వాటిపై ఆమె కుటుంబ సభ్యులు స్పందించలేదు. ఆ తర్వాత కథానాయికగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అవకాశాలు దక్కించుకుంది. తెలుగుతో పోలిస్తే, తమిళంలో ఆమెకు విపరీతమైన క్రేజ్‌వచ్చింది. అప్పట్లో వచ్చిన ఆ వదంతులపై ‘లవ్‌ షాదీ డ్రామా’లో హన్సిక, ఆమె తల్లి స్పందించారు.

‘‘ఆ వార్తలన్నీ అవాస్తవం. ఒక సెలబ్రిటీ అయినందుకు నేను ఎదుర్కొన్న విచిత్ర పరిస్థితి ఇది.. నాకు 21ఏళ్ల వయసు ఉండగా, అలాంటి చెత్త వార్తలు రాశారు. నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు తెలుసు కదా. అప్పట్లో నేను అవి తీసుకుని ఉంటే, ఇప్పుడూ తీసుకుంటూనే ఉండాలి. నేను ఎదగడానికి ఇంజెక్షన్లు తీసుకున్నానని రాసిపారేశారు. పైగా నేను పెద్దదానిలా కనపడటం కోసం నా తల్లి స్వయంగా హార్మోన్‌ ఇంజెక్షన్లు ఇచ్చారని రాశారు’’ అని హన్సిక చెప్పుకొచ్చారు.

ఈ వార్తలపై హన్సిక తల్లి కూడా స్పందించారు. ‘‘ఒక‌వేళ నా కుమార్తెకు అప్పట్లో నేను హార్మోన్‌ ఇంజెక్షన్లు ఇవ్వాలంటే టాటా, బిర్లాల కన్నా ధనవంతురాలినై ఉండాలి. కనీసం మిలియనీర్‌నైనా కావాలి. అదే నిజమైతే ఒక వేళ నా కుమార్తెకు ఇంజెక్షన్లు ఇస్తే, వాళ్లకు కూడా ఇచ్చేదాన్ని, ఎంచక్కా త్వరగా పెద్దవాళ్లు అయ్యేవారు. అసలు ఇలాంటి వదంతులు ఎలా సృష్టిస్తారో, వాటిని ఎలా రాస్తారో తెలియదు. ప్రజలకు కామన్‌సెన్స్‌ ఉండదా? మేము పంజాబీలం. మాలో 12 నుంచి 16ఏళ్ల వయసులోనే ఆడపిల్లలు త్వరగా ఎదుగుతారు’’ అని అన్నారు. వివాహం అయిన తర్వాత కూడా హన్సిక సినిమాల్లో నటిస్తున్నారు. ‘పార్ట్‌నర్‌’, ‘105 మినిట్స్‌’ చిత్రాలు షూటింగ్‌ పూర్తి కాగా, ‘మై నేమ్‌ ఈజ్‌ శ్రుతి’, ‘రౌడీ బేబీ’, ‘గార్డియన్’, ‘గాంధారి’ తదితర చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని